– వ్యకాస జిల్లా అధ్యక్షులు ములకలపల్లి రాములు
నవతెలంగాణ-మునగాల
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్ట రక్షణ కోసం ఈనెల 5వ తేదీన సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముట్టడికి వ్యవసాయ కార్మికులు వేలాదిగా తరలి రావాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ములకలపల్లి రాములు పిలుపునిచ్చారు. గురువారం నడిగూడెం మండలం బృందావనపురం గ్రామంలో ఉపాధి హామీ పని ప్రదేశాన్ని ఆయన సందర్శించి మాట్లాడారు. కేంద్రంలో అధికారం చేపట్టిన మోడీ సర్కార్ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ బడ్జెట్‌లో నిధులను కుదిస్తున్నారని విమర్శించారు. చట్ట రక్షణ కోసం జరిగే ఉద్యమంలో ప్రజలందరూ పాల్గొనాలని పిలుపు నిచ్చారు. ఉపాధి హామీ క్షేత్రస్థాయిలో అనేక లోపాలు ఉన్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. సౌకర్యాలు అమలు చేయడంలో అధికారులు చిత్తశుద్ధిగా వ్యవహరించటం లేదని ఆరోపించారు. పని చేసి నెలలు గడుస్తున్న వేతనాలు అందకపోవటం, సౌకర్యాలు అమలు చేయకపోవడం అధికారుల నిర్లక్ష్యంమే కారణమన్నారు. ఉపాధి హామీ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసి సంవత్సరానికి 200 రోజులు పని దినాలు రూ.600 వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. వ్యవసాయంలో యాంత్రికరణ పెరగటంతో పనులు లేక వలసలు పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మికు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు సోమపంగు జానయ్య, డివైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు కాసాని కిషోర్, ఉపాధి హామీ కూలీలు అనంతుల మురళి, బెల్లంకొండ లింగ స్వామి, మాణిక్యమ్మ అంజమ్మ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.