– తిరుగులేదనుకుంటే మోడీని చిత్తుగా ఓడిస్తారు
– ప్రశ్నించే వారిని బెదిరించడానికే ఈడీ, సీబీఐ
– 400పైగా సీట్లంటూ భ్రమలు కల్పిస్తున్న బీజేపీ
– తెలంగాణలో ఒక్క సీటూ గెలవకుండా తీర్పునివ్వాలి
– రాజ్యాంగాన్ని రద్దు చేసి మనుస్మృతి అమలుకు కుట్ర
– ప్రజాస్వామ్యం, లౌకికత్వం ధ్వంసం
– వామపక్ష, లౌకిక శక్తుల గెలుపే దేశానికి, రాజ్యాంగానికి రక్షణ
– నవతెలంగాణతో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్ వీరయ్య
‘సమస్యలను పరిష్కరించేందుకు ప్రజలు అధికారం ఇస్తే ప్రధాని మోడీ మాత్రం రాముడిని అడగాలని అంటున్నారు. సమస్యలను పరిష్కరించని ప్రధాని మోడీ అధికారంలో ఎందుకుండాలి. తక్షణమే గద్దెదిగిపోవాలి. ప్రజలు నిరంకుశత్వాన్ని సహించరు. ఎమర్జెన్సీని చూసిన ప్రజలు ఆ తర్వాత ఇందిరాగాంధీని చిత్తుగా ఓడించారు. ఇప్పుడు మోడీకీ అదే గతి పడుతుంది. తెలంగాణలో ఒక్క ఎంపీ స్థానం బీజేపీ గెలవకుండా ప్రజలు తీర్పునివ్వాలి. ఓటమి భయంతోనే ఇండియా కూటమి నాయకులను అరెస్టు చేసి జైల్లో పెడుతున్నారు. బ్యాంక్ ఖాతాలు సీజ్ చేస్తున్నారు. ప్రశ్నించే వారిని బెదిరించడానికి, ప్రతిపక్ష నాయకులను లొంగదీసుకోవడానికే ఈడీ, సీబీఐ, ఐటీ వంటి దర్యాప్తు సంస్థలు పనిచేస్తున్నాయి. బీజేపీ పాలనలో రాజ్యాంగం ప్రమాదంలో పడింది. ప్రజాస్వామ్యం, లౌకికత్వం ధ్వంసమవుతున్నాయి. వామపక్ష, లౌకిక అభ్యర్థులను గెలిపిస్తే దేశానికి, ప్రజలకు, రాజ్యాంగానికి రక్షణ ఉంటుంది. ప్రజలు ఆ దిశగా తీర్పునివ్వాలి.’అని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్ వీరయ్య అన్నారు. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఆయన నవతెలంగాణ ప్రతినిధి బొల్లె జగదీశ్వర్‌కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే…
‘ఓడిపోతామనే భయంతోనే మోడీ ప్రజలకు అబద్ధాలు చెప్పి భ్రమల్లో ముంచుతున్నారు. సొంతంగా 370, మిత్రపక్షాలతో కలిపి 400 సీట్లకుపైగా వస్తాయంటున్నారు. ఉత్తర భారత్‌లో యూపీ, బీహార్, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్‌లలో ఎక్కువ ఎంపీ సీట్లు గతంలోనే గెలిచారు. అక్కడ కోల్పోవడం తప్ప కొత్తగా గెలిచే అవకాశం లేదు. కేంద్రంలో, ఆయా రాష్ట్రాల్లో బీజేపీ పాలన వల్ల ప్రజల్లో అసంతృప్తి ఉంది. ఉత్తర బారత్‌లో సీట్లు తగ్గుతాయి. దక్షిణ భారత్‌లో పాగా వేయాలన్న ప్రయత్నాలు విఫలమయ్యాయి. కర్నాటక, తెలంగాణలో అధికారంలోకి రావాలన్న ఆశలు గల్లంతయ్యాయి. తమిళనాడు, కేరళలో బీజేపీ అడుగుపెట్టే పరిస్థితి లేదు. తెలంగాణలో ఉన్న నాలుగు సీట్లూ కోల్పోయే అవకాశమే ఉంది. అయినా బీజేపీ భ్రమలు కల్పించే ప్రయత్నం చేస్తున్నది.’అని వీరయ్య అన్నారు.
‘ఇండియా కూటమి నాయకులను అరెస్టు చేయడం బీజేపీలో నెలకొన్న భయాన్ని సూచిస్తున్నది. ఈ కూటమిలో కాంగ్రెస్ పెద్ద పార్టీ. మోడీ గద్దెదిగిపోతే కాంగ్రెస్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది. దాన్ని అడ్డుకోవడానికి దొడ్డిదారిన తప్పుడు పద్ధతులను బీజేపీ అనుసరిస్తున్నది. కాంగ్రెస్ బ్యాంకు అకౌంట్లను సీజ్ చేసింది. ఆ పార్టీ వద్ద డబ్బుల్లేకుండా చేసింది. బీజేపీ వద్ద మాత్రం లెక్కలేనంత డబ్బుంది. దాంతో ఓట్లు కొనొచ్చు. కనీవినీ ఎరుగనిరీతిలో ప్రచారానికి డబ్బు ఖర్చు చేయొచ్చు. కాంగ్రెస్‌కు మాత్రం ఆ అవకాశం లేకుండా చేయాలన్నదే వారి ఎత్తుగడ. దీన్ని బట్టి మోడీ, బీజేపీ ఎంత భయపడుతున్నారో అర్థమవుతున్నది. కేజ్రీవాల్, సోరేన్, కవితను జైల్లో పెట్టారు. బీఆర్ఎస్ను లొంగదీసుకోవడానికి బ్లాక్మెయిల్ చేస్తున్నది. ఆప్ రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. ఇండియా కూటమిలో ఆప్ ముఖ్యపాత్ర పోషిస్తున్నది. ముఖ్యమంత్రులనే అరెస్టు చేశామంటే ఇతర నాయకులు భయపడి లొంగిపోతారన్నది బీజేపీ ఎత్తుగడగా ఉన్నది.’అని వీరయ్య చెప్పారు.
‘ఎమర్జెన్సీని చూసిన ప్రజలు కన్నెర్ర జేస్తే బీజేపీ కొట్టుకుపోతుంది. తిరుగులేదనుకున్న ఇందిరాగాంధీ చిత్తుగా ఓడిపోయారు. నియంతలకు అదే గతి పడుతుంది. మోడీ అంతకంటే దుర్భర పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది. అప్రజాస్వామిక పద్ధతులను, నిరంకుశ పద్ధతులను అనుసరించిన నాయకులు చరిత్రలో అవమానకర పద్ధతిలో దెబ్బతిన్నారు. అధికారం మోజులో పడే నాయకులకు ఈ వాస్తవాలు అర్థం కావు. చుట్టూ ఉన్న వారు భజన చేస్తారు తప్ప వాస్తవాలను చెప్పరు. అందుకే ప్రజల్లో వస్తున్న మార్పులను గమనించలేకపోతున్నారు. కచ్చితంగా ప్రజలు ఆగ్రహిస్తారు. బీజేపీ వచ్చే ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోక తప్పదు.’అని వీరయ్య హెచ్చరించారు.
‘కాంగ్రెస్‌తో మా పార్టీకి వైరుధ్యం ఇప్పుడు కూడా ఉన్నది. దేశంలో జాతీయ పార్టీలుగా ఉండి పారిశ్రామికవేత్తలు, భూస్వాములకు అండగా ఉన్నది కాంగ్రెస్, బీజేపీలు. ఆ పార్టీలతో సాధారణ ప్రజలకు ఉన్న వైరుధ్యమే సీపీఐ(ఎం)కు ఉంది. అయితే సమస్యల పరిష్కారం కోసం కొట్లాడే ప్రజలను బీజేపీ మతం పేరుతో చీల్చుతున్నది. దేశంలో కార్మికులు, రైతులు, కూలీలు, మహిళలు, బడుగు బలహీనవర్గాలు ఎవరి సమస్యలనూ బీజేపీ పరిష్కరించలేదు. సామాజిక అణచివేత పెరిగింది. విద్యావైద్యం సామాన్యులకు అందడం లేదు. మధ్యతరగతి ప్రజలకు భారంగా మారింది. అన్ని రంగాల్లో మోడీ ప్రభుత్వం విఫలమైంది. అన్నింటికీ మించి ప్రజాస్వామ్యానికే చేటు తెస్తోంది. అందువల్ల మారిన పరిస్థితుల్లో బీజేపీ మళ్లీ అధికారంలోకి రాకుండా చూడ్డం కీలకమైన కర్తవ్యం.’అని వీరయ్య చెప్పారు.
‘ఎన్నికల బాండ్ల పేరుతో అవినీతిని చట్టబద్ధం చేశారు. సుప్రీంకోర్టు చెంపదెబ్బతో బీజేపీ గుట్టు రట్టయ్యింది. మోడీ ప్రధానిగా ఉండి అవినీతిని ప్రోత్సహించారు. ఆయన మంత్రివర్గంలో అవినీతిపరులున్నారు. దీనిపై ప్రజల్లో అసంతృప్తి ఉన్నది. దాన్ని అణచివేసేందుకు అప్రజాస్వామిక చర్యలకు పూనుకున్నారు. ప్రశ్నిస్తే దేశద్రోహి అని ముద్రవేస్తున్నారు. ఈడీ, సీబీఐ, ఐటీ, ఎన్ఐఏ వంటి రాజ్యాంగ సంస్థలను ప్రధాని చేతుల్లో పెట్టుకున్నారు. ప్రశ్నించే వారిని బెదిరించడానికి, బ్లాక్మెయిల్ సాధనాలుగా వాడుతున్నారు. ఎంతటి అవినీతిపరులైనా బీజేపీ కండువా కప్పుకుంటే పునీతులవుతున్నారు. లొంగకుంటే అరెస్టు చేసి జైల్లో పెడుతున్నారు. నిరంకుశ విధానాలను అమలు చేస్తున్నారు.’అని వీరయ్య అన్నారు.
‘మతాన్ని రాజకీయ ప్రయోజనాలకోసం వాడుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి ఉన్నపుడు ప్రజావ్యతిరేక విధానాలను అవలంబించింది. కానీ మతాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడలేదు. మతరాజ్యం స్థాపించాలనే లక్ష్యంతో బీజేపీ పనిచేస్తున్నది. మతాన్ని, దేవున్ని రాజ్యంతో, రాజకీయాలతో కలపడం ప్రమాద కరమైనది. ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తిని పక్కదారి పట్టించేందుకు మతాన్ని వినియోగిస్తున్నారు. 80 శాతం హిందువులను ఓటుబ్యాంకుగా చేసుకునే ఎత్తుగడ చేస్తున్నారు. మైనార్టీలపై దాడులను ప్రోత్సహిస్తున్నారు. రాజ్యాంగం మౌలిక పునాదులను ధ్వంసం చేస్తున్నారు. ప్రజాస్వామ్యం, లౌకికవాదాన్ని ధ్వంసం చేస్తున్నారు. పౌరసత్వానికి కులం, మతం, ప్రాంతంతో సంబంధం లేదు. కానీ సీఏఏ పేరుతో పౌరసత్వానికి మతం రంగు పులుముతున్నారు.’అని వీరయ్య చెప్పారు
‘భారత రాజ్యాంగాన్ని రద్దు చేసి మనుస్మృతిని అమలు చేయాలని చూస్తున్నారు. కులవ్యవస్థను బలోపేతం చేస్తున్నారు. మహిళలకు స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారు. ఇది దేశ ప్రజలకు, ప్రజాస్వామ్యానికి, సాంస్కృతిక వైభవానికి ముప్పు. మత రాజ్యం ఏర్పడితే, రాజ్యాంగం రద్దయితే ప్రశ్నించే హక్కుండదు. రాచరికం వస్తుంది. బడాబాబులు స్వేచ్ఛగా దోచుకోవచ్చు. అందువల్ల ఎట్టిపరిస్థితుల్లో మోడీ మళ్లీ ప్రధాని కావొద్దు. బీజేపీ మళ్లీ అధికారంలోకి రావొద్దు. అందుకే బీజేపీని ఏ పార్టీ ఓడిస్తే దానికి మా మద్దతు ఉంటుంది. కాంగ్రెస్ ఓడిస్తుందనుకుంటే ఆ పార్టీకి మద్దతివ్వడానికి మాకు అభ్యంతరం లేదు. బీజేపీ ముప్పు నుంచి దేశాన్ని, ప్రజలను కాపాడాలి. ఒకే దేశం, ఒకే భాష, ఒకే ఎన్నికలు, ఒకే సంస్కృతి వంటి ఈ విధానాలన్నీ ఏక వ్యక్తి పాలన, ఏక పార్టీ పాలన వైపు దేశాన్ని నడిపించే ప్రయత్నాలు. బీజేపీని ఓడించడమే ప్రజల తక్షణ కర్తవ్యం. తెలంగాణలో ఆ పార్టీ ఒక్క సీటు కూడా గెలవొద్దు.’అని వీరయ్య చెప్పారు.
‘కేరళలో కేంద్ర ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన ఎన్నికలు గనుక కాంగ్రెస్ అభ్యర్థులనే గెలిపించాలని ఆ పార్టీ ప్రచారం చేసింది. కేరళ ప్రజలు అదే నమ్మారు. అందుకే ఎక్కువ స్థానాలను కాంగ్రెస్‌కే కట్టబెట్టారు. దేశంలో లౌకిక విలువల కోసం నికరంగా నిలబడ్డది వామపక్షాలు. కేరళ ప్రజలు అది గుర్తించారు. కనుక ఈసారి కాంగ్రెస్ ప్రచారాస్త్రం పనిచేసే అవకాశం లేదు. కేంద్రంలో బీజేపీ ఓడిపోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. కానీ స్థిరంగా ప్రభుత్వం నిలబడాలంటే ప్రజాస్వామ్యం బలంగా ఉండాలంటే సీపీఐ(ఎం), సీపీఐ గెలవడం అవసరమని కేరళ ప్రజలు భావిస్తున్నారు. అక్కడ వామపక్షాలు మెజార్టీ సీట్లు గెలవబోతున్నాయి.’అని వీరయ్య అన్నారు.
‘ఇండియా కూటమిలో కాంగ్రెస్ పెద్ద పార్టీ. బీజేపీ ఓడిపోతే కాంగ్రెస్ నాయకత్వంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుంది. ఇతర పార్టీలను కలుపుకుపోవాల్సిన బాధ్యత కాంగ్రెస్‌పై ఉన్నది. ఆ బాధ్యతను సరిగ్గా నెరవేర్చకపోవడం వల్ల మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌ఘడ్‌లో నష్టపోయారు. దేశ ప్రజలకు కూడా నష్టం కలిగించారు. ఆ అనుభవం తర్వాత కూడా బీజేపీ వ్యతిరేక శక్తులను కలుపుకునిపోయే ప్రయత్నం చేయడం లేదు. ఇప్పటికైనా కాంగ్రెస్ బాధ్యతగా వ్యవహరించాలి.’అని వీరయ్య సూచించారు.
‘సీపీఐ(ఎం)కు బలమున్న పార్లమెంటు స్థానాలు ఖమ్మం, మహబూబాబాద్, భువనగిరి, నల్లగొండ. వీటిలో ఏదైనా ఒక్క సీటులో పోటీ చేయాలనుకున్నాం. భువనగిరి పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో సీపీఐ లేదా సీపీఐ(ఎం) గతంలో గెలిచాయి. గ్రామగ్రామాన ఎర్రజెండా గురించి తెలుసు. హైదరాబాద్‌కు దగ్గరగా ఉన్న భువనగిరిలో పోటీ చేయాలని నిర్ణయించాం. ఇతర పార్టీల అభ్యర్థులతో పోల్చుకుంటే సీపీఐ(ఎం) అభ్యర్థి ఎండీ జహంగీర్ కడిగిన ముత్యం. అట్టడుగు స్థాయి నుంచి, పేదరికం నుంచి వచ్చిన నాయకుడు. ప్రజలతో మమేకమవుతారు. సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడతారు. ఇతరులెవరు ప్రజల కోసం పోరాడిన వారు లేరు. ప్రజలకు అంకితమై పనిచేసే వారు లేరు. డబ్బు మీద ఆధారపడి పోటీ చేస్తున్నారు. ఇతరుల కంటే గొప్ప లక్షణాలున్న వ్యక్తి జహంగీర్. ప్రజలను ఓట్లడిగే నైతిక హక్కు సీపీఐ(ఎం)కు, మా అభ్యర్థికే ఉంది.’అని వీరయ్య అన్నారు.
‘ప్రధాని మోడీ రాముడిని చూపించి ఓట్లడుతున్నారు. ప్రజాసామ్యంలో ప్రధానిని ప్రజలు ఎన్నుకున్నది సమస్యలను పరిష్కరించడం కోసం. ఆయన విఫలమై రాముడిని చూపించి ఓట్లడుతున్నారు. సమస్యల పరిష్కారం కోసం రాముడిని అడగమంటున్నారు. సమస్యలను పరిష్కరించకుండా దేవుడిని అడగమంటే ప్రధాని కుర్చీలో మోడీ ఎందుకు. గద్దెదిగిపోవాలి. ఈ రాష్ట్రంలో బీజేపీకి ఒక్క సీటు రాకుండా చూడాలి. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నడిపిన గడ్డ. ఆ చైతన్యం ప్రదర్శించాలి. మతాన్ని రాజకీయాల కోసం వాడుకునే అవకాశం ఇవ్వొద్దు. తెలంగాణలో బీజేపీకి స్థానం లేదనే తీర్పునివ్వాలి.’అని వీరయ్య కోరారు.
‘దేశంలో వామపక్షాలు, లౌకిక శక్తులు, సీపీఐ(ఎం) ఎన్ని స్థానాలు గెలిస్తే ప్రజలకు, దేశానికి, రాజ్యాంగానికి అంత రక్షణ ఉంటుంది. అందుకే సీపీఐ(ఎం)ను గెలిపించాలి.’అని వీరయ్య పిలుపునిచ్చారు.