మహిళలు.. యువ ఓటర్లే కీలకం

Women, young voters are the key– ‘ఛత్తీస్‌’ లోక్‌సభ ఎన్నికల్లో అభ్యర్థుల భవిష్యత్తు వారి చేతుల్లోనే
– గతేడాది అసెంబ్లీ ఎన్నిక ఓటింగ్‌ ప్రక్రియలో చురుగ్గా పాల్గొన్న మహిళలు
– ఆ రెండు వర్గాలపై ప్రధాన పార్టీల దృష్టి
రాయ్ పూర్‌ : ఛత్తీస్‌గఢ్‌లో రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల భవితవ్యం అక్కడి మహిళలు, యువ ఓటర్ల మీదనే ఉన్నది. ఇందుకు గతేడాది రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్‌ సరళిని చూస్తే పూర్తి చిత్రం అవగతమవుతున్నదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఓటర్లుగా పురుషుల కంటే ఎక్కువ సంఖ్యలో మహిళలు చురుగ్గా పాల్గొన్నారని వారు గుర్తు చేస్తున్నారు. రాష్ట్రంలో కొత్త ఓటర్ల సంఖ్య కూడా పెరిగిందనీ, దీంతో రాబోయే ఎన్నికల్లో మహిళలతో పాటు యువత కూడా నిర్ణయాత్మక శక్తిగా మారనున్నదని విశ్లేషకులు అంటున్నారు. రాష్ట్రంలోని ఓటర్లలో పదకొండు లోక్‌సభ నియోజకవర్గాల్లో మహిళలు, యువత ఓట్లు అధికంగా ఉన్నాయని గణాంకాలను వారు ఉటంకిస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా, మొత్తం 2.05 కోట్ల మంది ఓటర్లలో 52.88 లక్షల మంది (ఇది మొత్తం 23 శాతం) 18-29 ఏండ్ల మధ్య వయస్కులే కావటం గమనార్హం. 18-49 ఏండ్లలోపు వారు మొత్తం యాభై శాతానికి మించి ఉన్నారు. రాష్ట్రంలో గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకున్నది. కాంగ్రెస్‌ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నది.
ఇప్పుడు ఈ రెండు ప్రధాన పార్టీలు ఆ రెండు వర్గాల మీదనే ప్రధానంగా ఫోకస్‌ చేస్తుండటం గమనార్హం.పోలింగ్‌కు ముందు ఓటర్లను ఒప్పించేందుకు ఇటీవల విడుదల చేసిన మ్యానిఫెస్టోల్లో మహిళలు, యువత కోసం తమ హామీలను ప్రకటించేటప్పుడు రెండు పార్టీలు కీలకంగా దృష్టిని సారించాయి.దేశంలోని పదో అతిపెద్ద రాష్ట్రంగా ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో 2.05 కోట్ల మంది ఓటర్లలో మహిళా ఓటర్లు 1.03 కోట్ల మంది కాగా పురుషులు 1.01 కోట్ల మంది ఉన్నారు. దేశంలో ధరల పెరుగుదల, మహిళలకు భద్రత కరువు కావటం, వారిపై బీజేపీ నాయకుల దుర్భాషలు వంటి అంశాలు మోడీ సర్కారుకు ప్రతికూలాంశాలుగా మారి, కాషాయపార్టీకి ఛత్తీస్‌గఢ్‌లో మహిళా ఓటింగ్‌ శాతం తగ్గే అవకాశాలు మెండుగా ఉన్నాయని విశ్లేషకులు చెప్తున్నారు.
మహిళల రాజకీయ భాగస్వామ్యంలో ఛత్తీస్‌గఢ్‌ పర్వాలేదని గణాంకాలు చెప్తున్నాయి. రాష్ట్ర అసెంబ్లీలో ప్రస్తుతం అత్యధిక మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇది మొత్తం శాసనసభ్యులలో 21.11 శాతం. 90 మంది సభ్యుల సభలో 19 మంది శాసనసభ్యులు మహిళలే ఉన్నారు. అయితే, ఈ సంఖ్య ఇంకా పెరగాల్సిన అవసరమున్నదనీ, ప్రధాన రాజకీయ పార్టీలు అటువైపుగా కృషి చేయాలని మేధావులు, సామాజికవేత్తలు అంటున్నారు.