గుజరాత్‌తో పోల్చి చూద్దామా

– ప్రత్యామ్నాయం లేకనే కర్నాటకలో కాంగ్రెస్‌కు పట్టం
– తెలంగాణ గురించి మాట్లాడే నైతికత కిషన్‌రెడ్డి లేదు
– రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేట
తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని ప్రధాని మోడీ సొంతరాష్ట్రం, 25 ఏండ్లుగా బీజేపీ ఏలుబడిలో ఉన్న గుజరాత్‌ రాష్ట్రంలో ఉన్న గుజరాత్‌తో పోల్చి చూద్దామా అని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి రాష్ట్ర విద్యుత్‌ శాఖామంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి సవాల్‌ విసిరారు.డబుల్‌ ఇంజిన్‌ సర్కార్లు అంటూ గొప్పలు చెప్పుకుంటున్న బీజేపీ గుజరాత్‌లో ఒరగబెట్టింది ఏం లేదని దుయ్యబట్టారు.శుక్రవారం జిల్లాకేంద్రంలో మంత్రి మీడియాతో మాట్లాడారు.ఉద్యోగాల కల్పనపై చర్చకు సిద్ధంగా ఉన్నామన్నారు.మొత్తం బీజేపీ పాలిత రాష్ట్రాలలో కలిపి కూడా గడిచిన 9 ఏండ్లలో తెలంగాణలో ఇచ్చిన అన్ని ఉద్యోగాలు కల్పించలేకపోయారని స్పష్టం చేశారు.సరైన ప్రత్యామ్నాయం లేకనే కర్నాటకలో కాంగ్రెస్‌ గెలిచిందన్నారు.కాంగ్రెస్‌,బీజేపీలకు ప్రత్యామ్నాయం ఉన్న చోట కాంగ్రెస్‌,బీజేపీయేతరులే విజయం సాధిస్తారన్నారు.తెలంగాణలో ఉనికి కోసమే బీజేపీ పడరానిపాట్లు పడుతుందని ఎద్దేవాచేశారు.తెలంగాణ గురించి మాట్లాడే నైతికత కిషన్‌రెడ్డికి లేదన్నారు.అంతగా ప్రేమ ఉంటే ఇక్కడి అవసరాలకు అనుగుణంగా నిధులు తెచ్చి మాట్లాడితే మీమీద విశ్వసనీయత పెరుగుతుందని, ఇప్పటి వరకైతే క్షేత్ర స్థాయిలో అటువంటిది ఏమి కనపడడం లేదన్నారు.బీజేపీ కుట్రలు తెలంగాణలో పనిచేయవన్నారు.యావత్‌ తెలంగాణ సమాజం ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెంటే నడుస్తుందని తెలిపారు.అడ్డదిడ్డంగా మాట్లాడితే ఇక్కడి ప్రజలు కర్రు కాల్చి వాత పెడ్తారని, 2014,2018 ఎన్నికల్లో అదే జరిగిందని, 2023 ఎన్నికల్లో అదే జరుగుతుందని మంత్రి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని హెచ్చరించారు.