బీజేపీ-జేడీఎస్‌ కూటమికి ఎదురు దెబ్బ?

BJP-JDS alliance Backlash?– ఇబ్బందికరంగా మారిన ప్రజ్వల్‌ రేవణ్ణ ఉదంతం
బెంగళూరు : మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ మనుమడు, హసన్‌ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో సార్వత్రిక ఎన్నికల వేళ కర్నాటకలో బీజేపీ-జనతాదళ్‌ (ఎస్‌) కూటమి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో పడింది. రేవణ్ణపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇప్పటికే సిట్‌ను ఏర్పాటు చేసింది. లోక్‌సభ ఎన్నికల్లో ఉనికిని చాటుకోవడానికి జేడీఎస్‌ తంటాలు పడుతోంది. ఈ సమయంలో రేవణ్ణ వివాదంలో చిక్కుకోవడం ఆ పార్టీని కలవరపెడుతోంది. రేవణ్ణ లైంగిక వేధింపులకు సంబంధించిన వీడియోలు ఇప్పటికే హసన్‌లో వందలాదిగా దర్శనమిస్తున్నాయి. ఈ ఉదంతం పార్టీతో పాటు కూటమి ప్రతిష్టను కూడా దెబ్బతీస్తుందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఇది కూటమికి అవమానకరమేనని రాజకీయ విశ్లేషకుడు సందీప్‌ శాస్త్రి వ్యాఖ్యానించారు.
కర్నాటకలో ఇప్పటికే తొలి విడత పోలింగ్‌ ముగిసింది. రెండో విడతలో ఉత్తర కర్నాటక ప్రాంతంలో పోలింగ్‌ జరగాల్సి ఉంది. అక్కడ జేడీ (ఎస్‌)కు పెద్దగా బలం లేదు. అయినప్పటికీ సిట్‌ విచారణలో రేవణ్ణ దోషిగా తేలితే ఆ ప్రభావం కూటమిపై పడే అవకాశం ఉంది. అది మార్ఫింగ్‌ చేసిన వీడియోయేనని బీజేపీ కొట్టిపారేస్తోంది. రేవణ్ణ వీడియో క్లిప్పులు హసన్‌లో ప్రచారంలో ఉన్నాయని, ఆయన
మహిళలను లైంగికంగా వేధించినట్లు అందులో స్పష్టంగా కన్పిస్తోందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చెప్పారు. ఇదిలావుండగా వీడియో క్లిప్పింగ్‌ వెలుగులోకి రాగానే ప్రజ్వల్‌ రేవణ్ణ జర్మనీకి పరారయ్యారని వార్తలు వస్తున్నాయి. హసన్‌లో ఈ నెల 26నే పోలింగ్‌ జరిగింది. దానికి రెండు రోజుల ముందే వీడియో క్లిప్పింగులు ప్రచారంలోకి వచ్చాయి. లైంగిక వేధింపుల ఉదంతాన్ని రాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ నాగలక్ష్మి చౌదరి సుమోటోగా స్వీకరించారు. రేవణ్ణ అనేక మంది మహిళలను లైంగికంగా వేధించారని ఆరోపణలు రావడంతో దీనిపై విచారణ బృందాన్ని ఏర్పాటు చేయాలని ఆమె రాష్ట్ర ప్రభుత్వాన్ని, డీజీపీని కోరారు. ఈ వ్యవహారంలో పారదర్శక విచారణకు సహకరిస్తామని జేడీ (ఎస్‌) నేత, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ప్రజ్వల్‌ రేవణ్ణ మేనమామ కుమారస్వామి తెలిపారు. కాగా ఈ వివాదంతో తనకేమీ సంబంధం లేనట్లుగా బీజేపీ వ్యవహరిస్తోంది. అయినప్పటికీ ఆ పార్టీలో కలవరపాటు కన్పిస్తూనే ఉంది. రెండో దశ పోలింగ్‌లో ఈ ఉదంతం ప్రభావం చూపుతుందేమోనన్న ఆందోళన బీజేపీలో వ్యక్తమవుతున్నా పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోంది.
వెయ్యికి పైగా దేవెగౌడ మనవడి రాసలీలల వీడియోలు

నవతెలంగాణ న్యూఢిల్లీ బ్యూరో
మాజీ ప్రధాని దేవెగౌడ మనువడి రాసలీలు దేశ వ్యాప్తంగా పెను దుమారాన్ని రేపుతున్నాయి. మాజీ సీిఎం కుమార స్వామి సోదరుడి కుమారుడు ప్రజ్వల్‌ రేవణ్ణకు సంబంధించిన పోలీసుల విచారణలో వెయ్యికిపైగా అమ్మాయిలతో శంగారంలో పాల్గొన్న వీడియోలు బయటపడ్డాయి. యువతులను లొంగదీసుకుని లైంగిక కోరికలు తీర్చుకోవడమే టార్గెట్‌గా ఎంతో మంది మహిళల జీవితాలను నాశనం చేశాడని బాధితులు ఆరోపిస్తున్నారు. వారి ఆరోపణలకు బలం చేకూరుస్తూ వీడియోలు బయటపడటం జేడీఎస్‌లో కలకలం రేపుతోంది.
మాజీ మంత్రి హెచ్‌డి రేవణ్ణ, ఎంపీ ప్రజ్వల్‌పై లైంగిక దౌర్జన్యం కేసు నమోదు చేసిన బాధిత మహిళ (47) వారికి బంధువే కావడం సంచలనం సష్టిస్తోంది. ప్రజ్వల్‌ తల్లి భవానీకి బాధితురాలు స్వయానా మేనత్త కుమార్తె కావడం గమనార్హం. రేవణ్ణ మంత్రిగా ఉన్నప్పుడు ఆమెకు పాల కేంద్రంలో, వసతి గహంలో పని కల్పించాడు. ఆ తరువాత 2015లో ఆమెను వారి ఇంట్లో పనికి చేర్పించారు. రేవణ్ణ నివాసంలో ఆరుగురు మహిళలు, యువతులు పని చేసేవారు. ఇంట్లో చేరిన కొన్నాళ్లకే తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని బాధితురాలు వాపోయింది. స్టోర్‌ రూంకి పిలిపించుకుని అసభ్యంగా ప్రవర్తించేవాడని.. స్నానం చేయించాలని చెప్పి బాత్‌రూంకి తీసుకెళ్లి లైంగికంగా వేధించేవాడని ఆమె ఆరోపించింది. తననే కాకుండా తన కుమార్తెనూ ప్రజ్వల్‌ వదల్లేదని.. అతనికి భయపడి ఫోన్‌ నంబర్‌ బ్లాక్‌ చేసిందని వివరించింది. కొన్నాళ్లకు తాను పని మానేసి బయటకి వచ్చేశానని.. వీడియోలు బయటకు రావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో మాట్లాడుతున్నానని బాధితురాలు వాపోయింది.
వీడియోలు తీసి బెదిరింపులు..
ప్రజ్వల్‌ వీడియోలు తీసి వాటి ఆధారంగా అమ్మాయిలను లోబరుచుకునేవాడని కొందరు ఆరోపిస్తున్నారు. అలా ఏకంగా మూడు వేలకుపైగా వీడియోలు తీశాడని.. వెయ్యి మందికిపైగా మహిళలపై అత్యాచారానికి పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.
సిట్‌ ఏర్పాటు
జేెడీఎస్‌ ఎంపీ రాసలీల ఆరోపణలపై కర్ణాటక ప్రభుత్వం సిట్‌ ఏర్పాటు చేసింది. ఎడీజీపీ బికె సింగ్‌ నేతత్వంలో ప్రత్యేక దర్యాప్తు బందాన్ని (సిట్‌) ఏర్పాటు చేశామని రాష్ట్ర హౌం మంత్రి పరమేశ్వర్‌ ప్రకటించారు. కాగా.. అశ్లీల వీడియోల అంశం హల్‌చల్‌ చేస్తున్న సమయంలోనే ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ జర్మనీలోని ఫ్లాంక్‌ఫర్ట్‌కు వెళ్లిపోవడం మరిన్ని అనుమానాలకు దారితీస్తోంది. అయితే సిట్‌ దర్యాప్తులో భాగంగా ఆయన్ని వెనక్కి తీసుకువచ్చి విచారిస్తామని పరమేశ్వర్‌ తెలిపారు.
మరోవైపు.. ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణకు సంబంధించి పలు వీడియోలు ప్రస్తుతం రాష్ట్రమంతటా వైరల్‌గా మారాయి. ప్రజ్వల్‌ రేవణ్ణ పలువురు మహిళలతో అశ్లీలంగా ఉన్న వీడియోలు వెలుగులోకి వచ్చాయి. దీంతో బాధిత మహిళలు న్యాయం చేయాలని టివి చానళ్లు, మహిళా కమిషన్‌ను ఆశ్రయిస్తున్నారు. ప్రజ్వల్‌ అశ్లీల వీడియోలపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ నాగలక్ష్మి చౌదరి సీఎంకు లేఖ రాశారు. ఈ విషయమై ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్‌ బెంగళూరులో మాట్లాడుతూ.. ప్రజ్వల్‌ దేశం విడిచి పారిపోవడం సిగ్గుచేటన్నారు. కాగా.. తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు కావాలని మార్ఫింగ్‌ వీడియోలను ప్రచారం చేశారని ప్రజ్వల్‌ రేవణ్ణ ఆరోపించారు.