కర్నాటక జోష్‌ కొనసాగేనా?

– ప్ర‌భావం కోల్పోతున్న బీజేపీ
– కాంగ్రెస్‌ను వేధిస్తున్న అంతర్గత కుమ్ములాటలు
న్యూఢిల్లీ : కర్నాటక ఎన్నికల కురుక్షేత్ర సంగ్రామం ముగిసింది. కాంగ్రెస్‌ ఘన విజయం సాధించింది. అయితే లోక్‌సభ ఎన్నికలకు ముందు మరో ఐదు రాష్ట్రాలలో… మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌ఘర్‌, రాజస్థాన్‌, తెలంగాణ, మిజోరంలలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. ఢిల్లీ పీఠం చేరేందుకు ఈ రాష్ట్రాలు అటు బీజేపీకి, ఇటు కాంగ్రెస్‌కు అగ్నిపరీక్షగా నిలిచాయి. త్రిపుర, మేఘాలయ, నాగాలండ్‌, కర్నాటక రాష్ట్రాలలో ఇప్పటికే ఎన్నికలు ముగిశాయి. మిజోరంలో డిసెంబర్‌ 17న, ఛత్తీస్‌ఘర్‌లో వచ్చే సంవత్సరం జనవరి 3న, మధ్యప్రదేశ్‌లో జనవరి 6న ఆయా శాసనసభల కాలపరిమితి ముగుస్తుంది. రాజస్థాన్‌ శాసనసభ కాలపరిమితి జనవరి 14న, తెలంగాణ శాసనసభ కాలపరిమితి జనవరి 16న ముగియనుంది. ఈ రాష్ట్రాలలో జరిగే ఎన్నికలకు ఇంకా షెడ్యూల్‌ విడుదల కానప్పటికీ అన్ని రాష్ట్రాలలోనూ నవంబర్‌-డిసెంబర్‌ మధ్య కాలంలోనే పోలింగ్‌ జరుగుతుందని అంచనా. నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వాన్ని మట్టి కరిపించి, లోక్‌సభ ఎన్నికలలో సత్తా చాటాలని తహతహలాడుతున్న కాంగ్రెస్‌ పార్టీకి కర్నాటక ఫలితాలు కొత్త జోష్‌నిచ్చాయి. అయితే ఆయా రాష్ట్రాల్లో నెలకొన్న కొన్ని అంతర్గత కుమ్ములాటలు ఆ పార్టీని కలవరపెడుతున్నాయి. వీటిని అధిగమించి పార్టీ విజయ తీరాలకు చేరుతుందా? బీజేపీ పతనం ప్రారంభమైందా? అనేవి ఇప్పుడు మిలియన్‌ డాలర్ల ప్రశ్నలు.
మధ్యప్రదేశ్‌లో అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్‌ మధ్య నువ్వా నేనా అనే రీతిలో పోరు జరిగే అవకాశం ఉంది. ఆ రాష్ట్ర శాసనసభలో 230 స్థానాలు ఉన్నాయి. కమల్‌నాథ్‌ నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం పతనమైన నాలుగు సంవత్సరాల తర్వాత అక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి. గత ఎన్నికలలో కాంగ్రెస్‌ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ బీజేపీ ఫిరాయింపు రాజకీయాలతో ఆ పతనమైంది. శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ నాయకత్వాన బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది.
రెండు వందల స్థానాలున్న రాజస్థాన్‌లో అశోక్‌ గెహ్లాట్‌ నేతృత్వంలో ఏర్పడిన కాంగ్రెస్‌ ప్రభుత్వం స్థిరంగానే కొనసాగుతోంది. అయితే ముఖ్యమంత్రి గెహ్లాట్‌, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్‌ పైలెట్‌ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. అంతర్గత కుమ్ములాటలు పార్టీ అధినాయకత్వాన్ని కలవరపెడుతున్నాయి. ఎప్పటికప్పుడు ఇద్దరు నేతల మధ్య సయోధ్య కుదురుస్తూ ప్రభుత్వాన్ని నెట్టుకొస్తున్నారు. గెహ్లాట్‌ ముఖ్యమంత్రి అయినప్పటి నుండి పైలెట్‌తో విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. మధ్యప్రదేశ్‌లో మాదిరిగానే రాజస్థాన్‌లో కూడా బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య హోరాహోరీ పోరు సాగే అవకాశం ఉంది.
ఛత్తీస్‌ఘర్‌లో కూడా కాంగ్రెస్‌ను వర్గ పోరు కలవరపెడుతూనే ఉంది. 2018 ఎన్నికలలో భూపేష్‌ భాగల్‌ నేతృత్వంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడగా ఆయనకు, ఆరోగ్య మంత్రి టీఎస్‌ సింగ్‌ దేవ్‌కు మధ్య ఏ మాత్రం పొసగడం లేదు. 90 స్థానాలున్న శాసనసభలో కాంగ్రెస్‌ 68 సీట్లతో తిరుగులేని ఆధిపత్యం కనబరచినా ఈ అనైక్యత చీకాకు తెప్పిస్తున్నది. బీజేపీ విషయానికి వస్తే సుదీర్ఘ కాలం పాటు రాష్ట్రానికి నేతృత్వం వహించిన రమణ్‌ సింగ్‌ పైనే ఆ పార్టీ ఆధారపడుతోంది. ఎన్నికలకు ముందు సీనియర్‌ గిరిజన నేత నంద్‌కుమార్‌ శారు పార్టీకి గుడ్‌బై చెప్పడం ఆ పార్టీకి గట్టి ఎదురు దెబ్బగా భావించవచ్చు.
ఇక తెలంగాణలో అధికార బీఆర్‌ఎస్‌, ప్రతిపక్ష కాంగ్రెస్‌ల మధ్యే ప్రధాన పోటీ. బీజేపీ ఆశలను కర్నాటక ఫలితాలు నీరుగార్చాయి. 2024 లోక్‌సభ ఎన్నికలలో దేశవ్యాప్తంగా విస్తరించి, జాతీయ రాజకీయాలలో కీలక పాత్ర పోషించేందుకు టీఆర్‌ఎస్‌ ప్రయత్నిస్తోంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై సమరశంఖం పూరించిన టీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇప్పటికే పలువురు జాతీయ ప్రతిపక్ష నేతలతో సమాలోచనలు జరిపారు.
ఇక మిజోరంలో అధికారంలో ఉన్న మిజో నేషనల్‌ ఫ్రంట్‌ (ఎంఎన్‌ఎఫ్‌) కేంద్రంలో ఎన్డీఏలోనూ, రాష్ట్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్‌ఈడీఎలోనూ భాగస్వామిగా కొనసాగుతోంది. రాష్ట్రంలో మరోసారి అధికారాన్ని కైవసం చేసుకోవాలని ఆ పార్టీ ఉవ్విళ్లూరుతోంది. 2018 అసెంబ్లీ ఎన్నికలలో ఎంఎన్‌ఎఫ్‌ 26 స్థానాలు (మొత్తం స్థానాలు 40) గెలుచుకొని అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్‌కు కేవలం ఐదు సీట్లు మాత్రమే దక్కాయి. రాష్ట్రంలో బీజేపీ మొదటిసారిగా ఖాతా తెరిచింది. కాగా, నిన్న హిమాచల్‌ప్రదేశ్‌లో నేడు కర్నాటకలో తగిలిన ఎదురుదెబ్బలు, తీవ్రమైన ప్రజావ్యతిరేకత, పెరుగుతున్న ప్రతిపక్షాల ఐక్యత, వికటిస్తున్న హిందూత్వ బీజేపీ ప్రాభవానికి సవాలుగా మారాయి.

Spread the love