ఇది దళారుల రాజ్యం

– తరుగు పేరుతో 5 కిలోల కటింగ్‌
– సకాలంలో లారీలు రావడం లేదని ఆవేదన
– రైతువేదికలో అధికారులను ప్రశ్నించిన రైతులు
నవతెలంగాణ దుబ్బాక రూరల్‌
దుబ్బాక మండలంలోని తిమ్మాపూర్‌ రైతు వేదికలో శనివారం నిర్వహించిన రైతు దినోత్సవంలో రైతులు అధికారులను నిలదీశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బందులకు గురి చేస్తున్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదని వాపోయారు. తరుగు పేరుతో 5 కిలోల కటింగ్‌ చేస్తున్నారని తెలిపారు. సకాలంలో లారీలు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. హసన్‌ మీరాపూర్‌ రైతులు కనకచలం, నరేష్‌ తదితరులు మాట్లాడుతూ యాసంగిలో నష్టపోయిన రైతులకు పరిహారం ఎప్పుడు అందుతుందన్నారు. ఐకేపీ కొనుగోలు సెంటర్లలో కొనుగోలు చేస్తున్న ధాన్యం రైస్‌ మిల్లుల వద్ద ఆగిపోయిందన్నారు. సకాలంలో లారీలు లేక కొరత, జాప్యం అవుతోందన్నారు. రైతు రాజ్యం కాదు దళారుల రాజ్యం అంటూ రైతులంతా అసహనం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సర్పంచులు మంజుల,పర్శారాములు, తిమ్మాపూర్‌ ఉప సర్పంచ్‌ బాబు, ఏఎంసీ డైరెక్టర్‌ లింగం, రైతుబంధు సమన్వయ కమిటీ సభ్యులు సైదుగారి ఎల్లం, రైతు బంధు కోఆర్డినేటర్‌ నర్సారెడ్డి, రైతుబంధు విలేజ్‌ కోఆర్డినేటర్‌ నరేష్‌, రైతులు, సెక్రటరీలున్నారు.
రైతు దినోత్సవాన్ని అడ్డుకున్న కాంగ్రెస్‌
నవతెలంగాణ నర్సాపూర్‌: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ద ఉత్సవాల్లో భాగంగా. శనివారం రైెతు దినోత్సవంలో భాగంగా నర్సాపూర్‌లోని రైతు వేదిక ప్రారంభోత్సవంలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నాయకులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. రైతు వేదికను ప్రారంభిస్తున్న సమయంలో కాంగ్రెస్‌ నాయకులు వచ్చి సీఎం డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాలు చేశారు. ఆగ్రహించిన బీఆర్‌ఎస్‌ నాయకు లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ జిందాబాద్‌ అంటూ నినా దాలు చేశారు. ఇరు పార్టీల నాయకులు ఒకరినొకరు తోసుకున్నారు. సీఐ షేక్‌ లాల్‌ మదార్‌, ఎస్సై శివకు మార్‌ తమ సిబ్బందితో వచ్చి ఇరు పార్టీల నాయకు లకు సర్దిజెప్పే ప్రయత్నం చేశారు. రైతులు ఇబ్బం దులు పడుతుంటే రైతు వేదిక ప్రారంభోత్సవాలు అవసరమా అని కాంగ్రెస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి, రాష్ట్ర నాయకులు ఆంజనేయులు గౌడ్‌, కాంగ్రెస్‌ నాయకులు, రైతులు ప్రధాన రోడ్డుపై బైఠాయించారు. సీఐ షేక్‌ లాల్‌ మదర్‌ జోక్యం తీసుకొని అధికారులతో మాట్లాడి ధాన్యం కొనుగోలు సమస్య పరిష్కరించేందుకు ప్రయత్నిస్తానని చెప్పినా వినకుండా రోడ్డుపై ధర్నా చేశారు. టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి, రాష్ట్ర నాయకులు ఆంజనేయులు గౌడుతో పాటు కాంగ్రెస్‌ నాయకులను పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్‌ కు తరలించారు.
రోడ్డుపై బైఠాయించిన ఎంపీపీ జ్యోతి
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రైతు వేదికల ప్రారంభోత్సవానికి ఎంపీపీ జ్యోతిని ఆహ్వానించారు. ఆమె రాకముందే జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ చంద్ర గౌడ్‌ రైతు వేదికను ప్రారంభిం చారు. దీంతో ఎంపీపీ జ్యోతి ఆగ్రహించారు. రైౖతు వేదిక ప్రారంభోత్సవానికి ఆహ్వానించి తాను రాకముందే ప్రారంభించడం ఎంతవరకు సమంజసమన్నారు. తనను ఎందుకు పిలిచి అవమానపరిచారని నిరసిస్తూ రైతు వేదిక ఎదురుగా ఉన్న రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. దీంతో కొద్దిసేపు ట్రాఫిక్‌ అంతరాయం కలిగింది. అక్కడే ఉన్న సిఐ ఎంపీపీ జ్యోతి సురేష్‌ నాయక్‌కు నచ్చే చెప్పినా వినకపోవడంతో మహిళ పోలీసుల చేత అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్‌ తరలించారు.