నవతెలంగాణ-మోత్కూర్
ప్రభుత్వం రెండు నెలలైనా ధాన్యం కొనుగోలు పూర్తి చేయకపోవడంతో రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే పడిగాపులు పడుతున్నారని, ప్రభుత్వం తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో మునిగిపోయి రైతులను విస్మరించిందని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి గుండు వెంకటనర్సు విమర్శించారు.ఆదివారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ రైతులు అకాల వర్షాలతో ధాన్యం తడిసి మొలకెత్తి, రంగు మారి నష్టపోతున్నారని, ధాన్యం అమ్ముకోవడానికి పడరాని పాట్లు పడుతున్నా వారిని పట్టించుకునే నాథుడే కరువయ్యాడని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అకాలవర్షాలతో పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10వేల సాయం చేస్తామని చెప్పగా దాని ఊసే లేదని, తడిసి మొలకెత్తిన, రంగు మారిన ధాన్యాన్ని కొంటామని చెప్పినా కొనుగోలుకేంద్రాల్లో కొనడం లేదన్నారు. మిల్లులో తరుగు పేరుతో కోత పెడుతున్నా, లారీల యజమానులు బస్తాకు రూ.10 డిమాండ్ చేస్తున్నా ఎవరు పట్టించుకోవడం లేదని తెలిపారు. పాలడుగు ఐకేపి కేంద్రంలో ఇంకా 90 మంది రైతులకు చెందిన ధాన్యం ఉందని, లారీల కొరతతో ధాన్యం కొనక పోవడంతో రైతులు ధర్నాలు చేయాల్సి వస్తుందని, అయినా అధికారుల్లో చలనం లేదన్నారు. ఒకవైపు ధాన్యం కొనక, మరోవైపు అమ్ముకున్న ధాన్యానికి డబ్బులు రాక వానాకాలం సీజన్ మొదలు కావడంతో పెట్టుబడి కోసం రైతులు తిప్పలు పడుతున్నారన్నారు. రెండు నెలలవుతున్నా ధాన్యం కొనక రైతులు కన్నీరు పెడుతుండగా ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాల పేరుతో సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. ప్రభుత్వం స్పందించి కొనుగోలు కేంద్రాల్లోని పూర్తి ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని, రైతులకు డబ్బులు చెల్లించాలని, లేనిపక్షంలో తహసీల్దార్ కార్యాలయ ముట్టడి చేపడతామని హెచ్చరించారు.