పనీర్‌తో ప‌సందుగా…

Delicious with Paneer...పనీర్‌ అంటే ఇష్టపడని వారు చాలా తక్కువ. ఇందులో ఉండే ప్రొటీన్‌లు, క్యాలరీల కారణంగా దీనిని తిన్న తర్వాత మీరు చాలా సేపు కడుపు నిండిన అనుభూతిని పొందుతారు. ఇది కొవ్వును వేగంగా కరిగిస్తుంది. అలాగే పనీర్‌తో చేసిన ఈ వంటకాలు బరువు తగ్గడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. ఇందులో గుండె సంబంధిత ఆరోగ్యాన్నిచ్చే పోషకాలు ఉన్నాయి. ఒమెగా 3, ఒమెగా 6 ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి. అలాగే దీనిలో పీచు అధికంగా ఉంటుంది. జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. పనీర్‌ తింటే త్వరగా పొట్ట నిండిన ఫీలింగ్‌ వస్తుంది. కాబట్టి పనీర్‌ తింటూ బరువు తగ్గవచ్చు. మహిళలు పనీర్‌ అధికంగా తింటే మంచిది. ముఖ్యంగా మెనోపాజ్‌ దశకు దగ్గరలో ఉన్న మహిళలకు చిరాకు, ఒత్తిడి రాకుండా ఉంటాయి. పనీర్‌తో చేసిన వంటకాలు చాలా రుచిగా ఉండటమే కాదు.. ఆరోగ్యానికీ మేలు చేస్తాయి.
పనీర్‌ పెప్పర్‌ ఫ్రై
కావలసిన పదార్థాలు : పనీర్‌ – 200 గ్రాములు, ఉల్లిపాయ (తరిగిన) – 3, పచ్చిమిర్చి – 4, క్యాప్సికమ్‌- ఒకటి, నల్ల మిరియాలు – ఒక స్పూన్‌, జీలకర్ర – ఆఫ్‌ స్పూను, లవంగాలు – 2, దాల్చిన చెక్క – 2, దనియాలు – ఆఫ్‌ స్పూను, ఎర్ర మిర్చి – 4, కరివేపాకు – 2 టేబుల్‌ స్పూన్లు, పసుపు – కొద్దిగా, నునె సరిపోయేంత, రుచికి తగినంత ఉప్పు
తయారీ విధానం : ముందుగా స్టౌ మీద పాత్రలో నూనె వేసి ఎండుమిర్చి, జీలకర్ర, లవంగాలు, నల్ల మిరియాలు, కొత్తిమీర, కరివేపాకు వేసి వేయించాలి. చిన్న మంటలో 2 నిమిషాలు వేయించి, తీసివేసి మరో పాత్రలో ఉంచి చల్లారనివ్వాలి. తర్వాత అదే పాత్రలో నూనె వేసి ఉల్లిపాయలు వేయించాలి. ఇప్పుడు ఉప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బాగా వేయించాలి. క్యాప్సికమ్‌ను సన్నగా తరుగుకొని అందులో వేసుకోవాలి. సన్నటి మంట మీద ఉడికించాలి. మరో వైపు వేయించిన మసాలా దినుసులను మిక్సీ జార్‌లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి.
తర్వాత స్టౌ మీద ఒక పాత్రలో రుబ్బిన మసాలా దినుసులు వేసి కలపాలి. అందులో పనీర్‌ వేసి కలపాలి. పసుపు వేసుకోవాలి. 2 నిమిషాలు వేయించాలి. పనీర్‌ను చిన్న ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. పనీర్‌ త్వరగా ఉడుకుతుంది. దీన్ని బాగా కలపండి, 2 నుంచి 3 నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్‌ ఆఫ్‌ చేయండి. మీకు నచ్చే రుచికరమైన పనీర్‌ పెప్పర్‌ ఫ్రై రెడీ.
పనీర్‌ మసాలా దోసె
కావలసిన పదార్థాలు : దోస పిండి – రెండు కప్పులు, పనీర్‌ – 150 గ్రాములు(తురుముకోవాలి), అల్లం – అరస్పూను, వెల్లుల్లి – అరస్పూను, పచ్చిమిర్చి – 1, ఉల్లిపాయ – 1, టమాట – 1, బీన్స్‌ – కొద్దిగా, క్యాప్సికమ్‌ – 3 టేబుల్‌ స్పూన్లు, క్యారెట్‌ – 1, ఉప్పు – తగినంత, ధనియాల పొడి – అరస్పూను, గరం మసాలా పొడి – పావు స్పూను, పసుపు – పావుస్పూను, కొత్తిమీర – 1 టేబుల్‌ స్పూన్‌, టొమాటో కెచప్‌ – 1 స్పూన్‌, వెన్న – 3 టేబుల్‌ స్పూన్లు, నూనె, రుచికి తగిన ఉప్పు
తయారీ విధానం : ముందుగా దోసె పిండిని రడీ చేసుకోవాలి. ఈ పిండిలో, క్యారెట్‌ తురుము వేసినట్టుగా పనీర్‌ తురుమును కొద్దిగా వేసుకోవాలి. తర్వాత స్టవ్‌ మీద పాన్‌ పెట్టుకొని… నూనె, వెన్న వేసుకోవాలి. అందులో అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, బీన్స్‌, క్యాప్సికమ్‌, క్యారెట్‌ వేసి (చిన్న ముక్కలుగా కట్‌ చేసుకోవాలి) రెండు నిమిషాలు వేయించాలి. దీని తర్వాత టొమాటో వేసి వేయించాలి. అందులో పసుపు , గరం మసాలా, కొత్తిమీర, కారపు పొడి వేసి వేయించాలి. దీనికి తురిమిన పనీర్‌ వేసి మరో రెండు నిమి షాలు వేయించాలి. చివరగా కొత్తిమీర తరుగు వేసి కలపాలి. మరో వైపు స్టవ్‌ మీద దోస పాన్‌ పెట్టి అందులో దోస పిండి వేయాలి. దోసె పైన వెన్న లేదా నెయ్యి వేసి టొమాటో కెచప్‌ కూడా వేసుకోవచ్చు. తర్వాత వేయించిన మసాలాను దోసెలో నింపుకోవాలి. కొద్దిసేపు వేడి చేయండి. ఈ దోసెలో ఒకవైపు మాత్రమే ఉడికిస్తే పనీర్‌ మసాలా దోసె రెడీ.
పనీర్‌ జిలేబి
కావలసిన పదార్థాలు : పనీర్‌ తురుము – పావు కిలో, పంచదార – ఒక కప్పు, కార్న్‌ పౌడర్‌ – పావు కప్పు, కుంకుమ పువ్వు – రెండు రేకులు, యాలకుల పొడి – పావు స్పూను, నెయ్యి – సరిపడా, బేకింగ్‌ సోడా – అర స్పూను, పిస్తా, జీడిపప్పు – గుప్పెడు, గోధుమపిండి – రెండు స్పూన్లు
తయారీ విధానం : ఒక గిన్నెలో కార్న్‌ పొడి, గోధుమపిండి, బేకింగ్‌ సోడా వేసి కొద్దిగా నీళ్లు పోసుకుని పల్చగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా చూసుకోవాలి. ఆ మిశ్రమంలోనే పనీర్‌ తురుమును కూడా వేసి బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని ఒకసారి మిక్సీ పడితే అది పేస్టులా అవుతుంది. దాన్ని జిలేబిలా వేయడానికి వీలుగా ఒక కవర్లో వేయాలి. ఆ కవర్‌ చివరన చిన్న రంధ్రం పెట్టాలి. స్టవ్‌ మీద కళాయి పెట్టి డీప్‌ ఫ్రై చేయడానికి వీలుగా నెయ్యి వేయాలి. పనీర్‌ జిలేబిని నేతిలోనే వేయిస్తారు. కవర్‌ను కోన్‌లా చేసి నెయ్యిలో జిలేబిలా వేసుకోవాలి. వాటిని రంగు మారేవరకు దోరగా వేయించాలి. మరో పక్క స్టవ్‌ మీద పంచదార, యాలకుల పొడి, నీళ్లు, కుంకుమపువ్వు వేసి లేత పాకం పట్టుకోవాలి. ఫ్రై అయిన జిలేబిలను నెయ్యిలో తీసి ఆ పాకం గిన్నెలో వేయాలి. తరువాత తీసి ప్లేట్లో వేసుకోవాలి. పైన పిస్తా, జీడిపప్పు ముక్కలను తురిమి చల్లాలి. అంతే పనీర్‌ జిలేబి రెడీ అయినట్టే. సాధారణ జిలేబితో పోలిస్తే ఇది చాలా రుచిగా ఉంటుంది. సాధారణ జిలేబి కాస్త సన్నగా ఉంటే ఇది మందంగా ఉంటుంది.
పనీర్‌ పులావ్‌
కావలసిన పదార్థాలు : బాస్మతి బియ్యం – రెండు కప్పులు, అల్లం వెల్లుల్లి పేస్టు – ఒక స్పూను, యాలుకలు – ఐదు, ఉప్పు – రుచికి సరిపడా, గరం మసాలా – అర స్పూను, నల్ల మిరియాలు – అర స్పూను, పసుపు – ఒక స్పూను, బిర్యానీ ఆకు – ఒకటి, పనీర్‌ – 150 గ్రాములు, దాల్చిన చెక్క – ఒకటి, పాలు – మూడు స్పూన్లు, ఉల్లిపాయలు – రెండు, నెయ్యి – మూడు స్పూన్లు, పెరుగు – ఒక కప్పు, పుదీనా – ఒక కట్ట, కారం – ఒక స్పూను, జీడిపప్పులు – గుప్పెడు, కుంకుమ పువ్వు – మూడు రేకులు
తయారీ విధానం : పనీర్‌ పులావ్‌ చేసేందుకు పనీర్‌ను కొద్దిగా పెద్దముక్కలు చేసుకోవాలి. ఒక గిన్నెలో ఈ పనీర్‌ ముక్కలను వేసి చిటికెడు ఉప్పు, పెరుగు, పసుపు, కాస్త నూనె, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి మ్యారినేట్‌ చేయాలి. అరగంట పాటు పక్కన పెట్టేయాలి. ఇప్పుడు స్టవ్‌ మీద కళాయి పెట్టి నెయ్యిని వేయాలి. ఉల్లిపాయలను సన్నగా తరిగి వేయించాలి. అవి బ్రౌన్‌ రంగు వచ్చేవరకు వేయించాలి. తర్వాత ఆ ఉల్లిపాయలను తీసి పక్కన పెట్టు కోవాలి. ఆ మిగిలిన నూనెలో దాల్చిన చెక్క, యాలకులు, మిరియాలు, బిర్యానీ ఆకు వేసి వేయిం చాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను కూడా వేసి వేయించాలి. ఇప్పుడు పసుపు, ఉప్పు, బియ్యం వేసి కలుపుతూ ఉండాలి. మంటను తగ్గించాలి. ఈ లోపు ముందుగా మ్యారినేట్‌ చేసుకున్న పనీర్‌ ను మరొక కళాయిలో వేసి గోధుమ రంగులోకి మారేవరకు నెయ్యిలో వేయించాలి. ఆ వేయించిన పనీర్‌ను ఈ బియ్యంలో వెయ్యాలి. అన్నింటినీ కలిపి కలుపు కోవాలి. యాలుకల పొడిని కూడా వేయాలి. గరం మసాలా, కారం కూడా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు నాలుగు కప్పుల నీళ్లను వేసి మూత పెట్టాలి. పైన పుదీనా, కొత్తిమీర తరుగును చల్లుకోవాలి. దించేముందు కుంకుమ రేకుల నీటిని పైన వేసుకొని ఐదు నిమిషాలు మూత పెట్టి ఉంచాలి. తర్వాత స్టవ్‌ కట్టేయాలి. అంతే టేస్టీ పనీర్‌ పులావ్‌ రెడీ అయినట్టే.