ఇంట్లో తోట ఆరోగ్యాల పంట

‘ఆదివారం సెలవు రోజు కావడంతో కమల్‌ టివి చూస్తున్నాడు. కూరగాయల మొక్కల పైన రసాయనాలను పిచికారి చేస్తున్నారని, వాటి నుండి వచ్చే కాయగూరలను మనం తినడం వలన మనిషి జీర్ణ వ్యవస్థ పైన తీవ్ర ప్రభావం చూపుతుంది. కాబట్టి సేంద్రియ పద్ధతిలో అందించిన కూరగాయలను వాడినట్లయితే ఆరోగ్యంగా ఉంటారని” టీవీలో వచ్చిన వార్తను చూశాడు కమల్‌. తీవ్రంగా ఆలోచించాడు. వెంటనే తన అనుమానాలను నివృత్తి చేసుకోవడానికి తాతయ్య దగ్గరికి వెళ్లి టీవీలో వచ్చిన వార్త గురించి చెప్పాడు.
తాతయ్య ”నువ్వు చూసింది, విన్నది నిజమే కమల్‌. మోతాదుకు మించి రసాయనాలు చల్లడం వల్ల చెట్లు ఆ రసాయనాలను పీల్చుకొని మనకు అందించే ఫలాలు, కాయగూరలు ఆ రసాయనాల అవశేషాలతో వుంటాయి. వాటిని తినడం వలన మన శరీరంలోకి ప్రవేశించిన రసాయనాలతో అంతుచిక్కని రోగాలు రావడం పరిపాటి అయింది. ముఖ్యంగా నరాల బలహీనత, వెంట్రుకలు పండిపోవడం, కాళ్లు చేతులు విపరీతంగా లాగడం ఈ మధ్య చాలా ఎక్కువయ్యాయి. ఒకప్పుడు మేం ఎలాంటి రసాయనాలూ చల్లకుండా వ్యవసాయాన్ని చేసేవాళ్ళం. అప్పుడు అందరం చాలా ఆరోగ్యంగా ఉన్నాం. కానీ ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చింది” అని చెప్పగానే కమల్‌ ఒక ఉపాయాన్ని ఆలోచించి, తాతయ్యకు చెప్పాడు. వెంటనే తాతయ్య సరేనన్నాడు.
తన ఇంటి పరిసరాల్లో ఉన్న ఖాళీ ప్రదేశాన్ని చదును చేసి, రెండు మడులను సిద్దం చేశాడు. రకరకాల కూరగాయల విత్తనాలను చల్లాడు. అందులో పశువుల పేడ, మేక పెంట, ఇంట్లో వ్యర్థ పదార్థాలను కుళ్ల బెట్టి, తద్వారా వచ్చిన ఎరువును మడులలో చల్లాడు. ఇంట్లో నుండి వచ్చే వ్యర్థమైన నీటిని కాలువ ద్వారా మళ్ళించాడు. వారం రోజుల్లో విత్తనాలు మొలకెత్తాయి. ఇది చూసిన కమల్‌ చాలా సంతోషించాడు.
ఇరవై రోజుల్లో రకరకాల ఆకుకూరలు, కాయగూరలు తెంపి వాళ్ళ అమ్మకు అందించేవాడు. చక్కటి రుచికరమైన తాజా కూరగాయలను తినడం వల్ల వారి కుటుంబ సభ్యులందరూ ఆరోగ్యంగా ఉన్నారు. ఇదే విషయాన్ని పాఠశాలలో ఉపాధ్యాయులతో, తన స్నేహితులతో చెప్పాడు. వారందరూ కూడా కమల్‌ మాదిరిగానే ”మన ఇంటి దగ్గర ఉన్న ఖాళీ ప్రదేశంలో సేంద్రియ పద్ధతిలో కూరగాయలను సాగు చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. కమల్‌ చేసిన మంచి పనికి వాళ్ల తాతయ్య అభినందించాడు.
నీతి: రసాయనాలు వాడొద్దు, సేంద్రీయ ఎరువులే ముద్దు.

– యాడవరం చంద్రకాంత్‌ గౌడ్‌, 9441762105