నిత్యం అల్లర్లతో అట్టుడికిపోయే ప్రాంతం. ఎప్పుడు ఎక్కడ దాడి జరుగుతుందో తెలియదు. అపారమైన ఖనిజ సంపద ఉన్నా ఆ ప్రాంత ప్రజలు మాత్రం భయంకరమైన పేదరికంతో అల్లాడిపోతున్నారు. అక్కడ లోపించిన శాంతి భద్రతే దీనికి ప్రధాన కారణం. అలాంటి చోట శాంతి భద్రతల్ని పెంపొందించే బాధ్యతను స్వీకరించారు మేజర్ రాధికా సేన్… 2019లో ఐక్యరాజ్య సమితితో కలిసి దక్షిణ సూడాన్‌లో ఆమె చేసిన విశేష సేవకుగానూ ‘మిలటరీ జెండర్ అడ్వొకేట్ ఆఫ్ ది ఇయర్ 2023’ అవార్డును అందుకున్నారు. ఈ అవార్డు అందుకున్న రెండవ భారతీయు రాలిగా చరిత్ర సృష్టించిన ఆమె పరిచయం నేటి మానవిలో…
1993లో హిమాచల్ ప్రదేశ్‌లో జన్మించిన రాధిక. బయోటెక్నాలజీ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఆ తర్వాత ఐఐటీ బాంబేలో మాస్టర్స్ డిగ్రీ చేశారు. దేశానికి సేవ చేయాలనే బలమైన కోరికతో 2016లో భారత రక్షణ రంగంలోకి ప్రవేశించారు. అప్పటి నుండి ఇండియన్ ఆర్మీలో విశేష సేవలందిస్తున్నారు. 2023, మార్చి నుండి ఈ ఏడాది ఏప్రిల్ వరకు ఐరాస శాంతి పరిరక్షకురాలిగా డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో సేవలందించారు. ఇండియన్ రాపిడ్ డిప్లారు మెంట్ బెటాలియన్ కోసం మొనొస్కో ఎంగేజ్ మెంట్ ప్లాటూన్‌కు కమాండర్‌గా పని చేశారు.
ధైర్యంగా గళమెత్తేలా…
సుమారు 13 నెలల పాటు ‘యునైటెడ్ నేషన్స్ ఆర్గరైజేషన్ స్టెబిలైజేషన్ మిషన్’తో కలిసి రాధిక అక్కడ తన బాధ్యతలు నిర్వర్తించారు. ఆ సమయంలో ఉత్తర కివులోని మహిళలు, చిన్నారులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పెట్రోలింగ్ నిర్వహించడంతో పాటు ఇతర భద్రతా చర్యలు తీసుకున్నారు. అంతేకాకుండా కమ్యూనిటీ అలర్ట్ నెట్వర్క్స్ ఏర్పాటు చేసి అక్కడి కమ్యూనిటీ నాయకులు, మహిళలు, యువతకు తమ భద్రత, మానవ హక్కుల సమస్యలపై ధైర్యంగా గళమెత్తే అవకాశాన్ని కల్పించారు. తన వినయం, కరుణ, అంకితభావంతో అక్కడి ప్రజల నమ్మకాన్ని పొందారు. పిల్లలు, మహిళలతో సహా సంఘర్షణలో చిక్కుకున్న వారందరికీ భద్రత కల్పించారు.
అవగాహన కల్పించారు
కేవలం భద్రతా పరమైన విషయాలకే పరిమితం కాకుండా అక్కడి చిన్నారులకు ప్రత్యేక పాఠశాల ఏర్పాటు చేసి తరగతులు నిర్వహించారు. వారికి ఆంగ్ల విద్యను బోధించారు. అలాగే యువతకు వృత్తినైపుణ్యాల్లో శిక్షణ కూడా అందించారు. అరోగ్యంపై వారికి అవగాహన కల్పించారు. ఇలా ఒక ఆఫీసర్‌గానే కాకుండా వారింట్లో మనిషిలా కలిసిపోయి వాళ్ళ సమస్యలు వినడంతో పాటు వాటిని పరిష్కరించేందుకు అవసరమైన అవగాహన, సహకారం సైతం ఆమె అందించారు. ముఖ్యంగా అక్కడి రాజకీయ అవినీతి, అల్లర్లకు చరమగీతం పాడేందుకు తన శాయశక్తులా కృషి చేశారు. అందుకే మే 30న అంతర్జాతీయ ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షకుల దినోత్సవం సందర్భంగా మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్నారు.
నిజమైన నాయకురాలు
యూఎన్ సెక్రటరీ-జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ రాధిక పట్ల తన అభిమానాన్ని వ్యక్తం చేస్తూ ఆమెను ‘నిజమైన నాయకురాలు, రోల్ మోడల్. ఆమె సేవ మొత్తం ఐక్యరాజ్యసమితికి దక్కిన నిజమైన ఘనత’ అని ఆయన అభివర్ణించారు. ప్రస్తుతం భారత సైన్యం తరపున ఐక్యరాజ్య సమితిలో 124 మంది మహిళలు శాంతి పరిరక్షకులుగా ఉన్నారు. దాంతో అత్యధిక సంఖ్యలో శాంతిపరిరక్షకులను అందించిన దేశాల్లో భారత్ పదకొండో స్థానంలో కొనసాగుతోంది.
నాకెంతో ప్రత్యేకం
ఈ అవార్డు గురించి రాధిక మాట్లాడుతూ ‘ఈ అవార్డు నాకెంతో ప్రత్యేకమైనది. ఎందుకంటే అనునిత్యం అల్లర్లు చెలరేగే ప్రాంతాల్లో శాంతి భద్రతలను నెలకొల్పడమంటే సాధారణ విషయం కాదు. నాలాంటి శాంతి పరిరక్షకులు పడే కష్టానికి ముఖ్యంగా సవాలు వాతావరణంలో కృషి చేస్తున్న వారికి ఈ అవార్డు ప్రత్యేక గుర్తింపును తీసుకొ స్తుంది. సమాజంలో సానుకూల మార్పు తీసుకువచ్చేం దుకు వారంత తమ ప్రాణాలను ఫణంగా పెట్టి మరీ కృషి చేస్తున్నారు. శాంతి పరిరక్షణ అనేది మా ఒక్కరిదే కాదు మనందరి బాధ్యత. ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ శాంతియుతంగా ఆలోచించినప్పుడు ప్రపంచం ప్రశాంతమైన, ఓ అందమైన ప్రదేశంగా మారుతుంది’ అంటూ పంచుకున్నారు.
లింగ సమానత్వానికై…
ఈ ప్రతిష్టాత్మక అవార్డు 2016లో స్థాపించబడింది. శాంతి పరిరక్షక మిషన్లలో లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడం కోసం ఈ అవార్డును ప్రారంభించారు. వ్యక్తిగత సైనిక శాంతి పరిరక్షకుల అంకితభావాన్ని ఈ అవార్డు గుర్తిస్తుంది. ఇది మహిళలు, శాంతి, భద్రతపై యూఎన్ భద్రతా మండలి తీర్మానం 1325 సూత్రాలకు అనుగుణంగా ఉంటుంది. యూఎన్ శాంతి పరిరక్షకుల ప్రకారం, అన్ని శాంతి కార్యకలాపాల నుండి ఫోర్స్ కమాండర్లు, మిషన్ల అధిపతులచే నామినేట్ చేయబడిన అభ్యర్థుల నుండి అవార్డు గ్రహీత ఎంపిక చేయ బడతారు.