సంగీతం ఆమె ప్రపంచం. మనసు కలత చెందినపుడు ఆ సంగీతమే ఆమెకు ప్రియనేస్తం. కొత్త ఊపిరి పోసే అమృతం. పుట్టింట సంగీతం సాహిత్యం పెనవేసుకున్న అందమైన పొదరిల్లు. అలాంటిచోట పుట్టి… వైవాహిక జీవితంలో కొన్ని ఒడుదుడుకులు ఎదుర్కోవలసి వచ్చింది. ఆ సమస్యల నుండి బయటపడేందుకు సంగీతమే ఆమెకు ఔషధమయింది. ఇలా సంగీతంలోనే సేదతీరుతున్న ప్రముఖ గాయనీమణి నండూరి విజయసుమిత్ర. ఆమె పరిచయం ఆమె మాటల్లోనే చదవండి…
నా చిన్నతనంలో నన్ను కర్ణాటక సంగీతం వైపు మరలించినవారు మా నాన్న. ఆయన పట్టుదల వల్లే కర్ణాటక సంగీతం నేర్చుకున్నాను. మా అమ్మ కూడా చాలా ప్రోత్సహించేవారు. నా తల్లితండ్రులు నన్ను ఓ ఎమ్మెస్ సుబ్బలక్ష్మిలా, ఓ పి. సుశీలలా చూడాలని ఎన్నో కలలు కనేవారు. పెద్ద గాయని కావాలని నిరంతరం తపించేవారు. అందుకే సంగీతం నేర్పిస్తూ కచేరీలకు కూడా నన్ను తీసుకెళ్ళేవారు. అయితే పెండ్లి తర్వాత వాటన్నింటికి తాళం పడిపోయింది. నా భర్త నుంచి ఎటువంటి ప్రోత్సాహం లేదు. కేవలం ఇంట్లోనే అప్పుడప్పుడు పాడుకుంటూ ఉండేదాన్ని.
ఇంటికే పరిమితమై…
పెండ్లి తర్వాత ఆయన ఉద్యోగరీత్యా మేము మద్రాసు, నెల్లూరు, హైదరాబాదులో కొంత కాలం కలిసి జీవించాం. ఆ సమయంలో ఇంటికే పరిమితమై ఆధ్యాత్మిక జీవితం గడిపాల్సి వచ్చింది. ప్రస్తుతం నా భర్త లేరు. కొన్నాళ్ళకు విజయవాడ వచ్చేసాను. సంగీతం విషయంలో నా అక్క చెల్లెలు, తల్లిదండ్రులు తప్ప ఎవ్వరూ నన్ను ప్రోత్సహించలేదు. కర్ణాటక సంగీతంలో నేను పెద్ద స్థాయిలో ఎదగాలని కోరుకున్న వాళ్లు వీరే. ఇక సంగీతంలో నాకు గురువులుగా ఉండి ప్రోత్సహించిన వారు శ్రీ పి.సూర్యారావు, శ్రీమతి రామ కుమారి, శ్రీ అన్నవరపు రామస్వామి. అలాగే శ్రీ టి.ఎం.త్యాగరాజన్, శ్రీ కేవీ నారాయణస్వామి, శ్రీ బి. రాజం అయ్యారు. వీరంతా సంగీతంలో నాకు సమగ్రమైన అవగాహన వచ్చేలా చేశారు. వైలెన్ నేర్చుకున్నప్పుడు శ్రీ టి.ఎన్ కృష్ణన్ ఎన్నో మెళకువలు తెలిపారు.
డ్రామా ఆర్టిస్ట్‌గా…
నా వ్యక్తిగత జీవితంలోకి వస్తే నాకు ఒక బాబు. అతను ప్రస్తుతం ఎంబీబీఎస్ పూర్తి చేసి హైదరాబాదులోని ఇవియా హాస్పిటల్లో జనరల్ ఫిజీషియన్‌గా వర్క్ చేస్తున్నాడు. అతనికి పెండ్లై ఓ కూతురు ఉంది. పెండ్లి తర్వాత చాలా కాలం తర్వాత తిరిగి నా సంగీత జీవితాన్ని ప్రారంభించాను. ఆలిండియా రేడియోలో డ్రామా ఆర్టిస్ట్‌గా కొంత కాలం పని చేశాను. ఆ సమయంలో నండూరి సుబ్బారావు, సి.రామ్మోహన్ రావు, యోగానంద, పద్మజా నిర్మల, సరోజ నెమలి నన్నెంతో ప్రోత్సహించారు. అప్పట్లో లలిత సంగీత విభాగంలో మోదమూడి సుధాకర్ ఉండేవారు. ఆయన మాకు బంధువు. ఈయన ప్రోత్సాహంతో రేడియోలో చాలా లలిత సంగీత కార్యక్రమాలు చేశాను. అలాగే అవుట్‌సైడ్ కన్నడ సంగీత కచేరీలు కూడా చేశాను.
క్యాజువల్ ఆర్టిస్ట్‌గా…
కొంత కాలం స్కూల్లో ఉద్యోగం చేశాను. అది క్రిస్టియన్స్ పాఠశాల కావడంతో వెస్ట్రన్ మ్యూజిక్ గురించి కొంత అవగాహన వచ్చింది. అలాగే క్యాషియో కొంత నేర్చుకొని పిల్లలను కూడా ప్రోత్సహించేదాన్ని. నా చిన్నతనంలో విజయవాడ, మద్రాసులో కూడా కొన్ని కచేరీలు చేశాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొని పాటలు పాడాను. లలిత సంగీతంతో పాటు సినిమా పాటలు కూడా అప్పుడప్పుడు పాడేదాన్ని. విజయవాడ ఆల్ ఇండియా రేడియోలో క్యాజువల్ ఆర్టిస్టుగా కూడా చేశాను. అలాగే హైదరాబాదులో కూడా క్యాజువల్ ఆర్టిస్ట్‌గా ఉన్నాను. నేను ఆంధ్ర యూనివర్సిటీ నుంచి బీఏ మ్యూజిక్ చేశాను. మద్రాస్ గవర్నమెంట్ కాలేజ్ నుంచి సంగీత టైటిల్ కోర్సు పాస్ అయ్యాను.
తల్లి దండ్రుల ప్రోత్సాహంతోనే…
సెయింట్ జోన్స్ సెకండరీ హై స్కూల్ గన్నవరంలో, సింగరేణి కాలరీస్ గోల్డ్ హైస్కూల్లో కూచిపూడి ఆర్ట్ అకాడమీలో చాలా కాలం పని చేశాను. అలాగే విజయవాడలోని ప్రభుత్వ సంగీత కళాశాలలో ఐదేండ్లు విద్యనభ్యసించి డిప్లమా పూర్తి చేశాను. తెలుగు యూనివర్సిటీ తరపున అక్కడ డ్యాన్సులతో పాటు అన్ని కార్యక్రమాలకు పాటనే కాకుండా, మ్యూజిక్ నేర్పుతూ ఉండేదాన్ని. ఒకసారి సింగపూర్ కూడా వెళ్ళి కచేరీలో పాల్గొని వచ్చాను. ఆనాడు నా తల్లిదండ్రులు ఇచ్చిన ప్రోత్సాహంతో ఇప్పటి వరకు నా జీవితం సంగీతంతోనే కొనసాగుతోంది. ఏది ఏమైనా మధ్యలో చాలా ఏండ్లు ఖాళీగా ఉండాల్సి వచ్చింది. అయినా తిరిగి నా సంగీత ప్రపంచంలోకి వచ్చేశాను. చాలా సంతోషంగా ఉంది.
– అచ్యుతుని రాజ్యశ్రీ