టీచర్ల పెండింగ్‌ బిల్లులు వెంటనే మంజూరు చేయాలి

– పీఆర్టీయూటీఎస్‌ ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఉపాధ్యాయులకు సంబంధించిన సరెండర్‌ లీవు, మెడికల్‌, జీపీఎఫ్‌ వంటి పెండింగ్‌ బిల్లులను వెంటనే మంజూరు చేయాలని పీఆర్టీయూటీఎస్‌ ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆ బిల్లులు నగదుగా మారకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. గురువారం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పింగిలి శ్రీపాల్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రఘోత్తంరెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయుల ఇబ్బందిని ఆసరాగా తీసుకుని జిల్లా ట్రెజరీ కార్యాలయాల్లో పర్సెంటేజీలు తీసుకుని బిల్లులను మంజూరు చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈనెల 13న కోర్టు తీర్పు అనంతరం బదిలీలు వీలు కాని పక్షంలో అడ్‌హక్‌ పద్ధతిలో ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్‌, సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీరెల్లి కమలాకర్‌రావు, మాజీ ప్రధాన కార్యదర్శి గుర్రం చెన్నకేశవరెడ్డి, పత్రిక ప్రధాన సంపాదకులు తిరుమలరెడ్డి ఇన్నారెడ్డి, సబ్‌ఎడిటర్‌ చిత్తలూరి ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.