– రద్దుచేశాక.. రూ.2వేల నోట్లు సగమే రిటర్న్
– వృద్థి రేటు 6.5 శాతానికి తగ్గొచ్చు
– వడ్డీరేట్లు యథాతథం :ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడి
ముంబయి: రూ.1,000 నోట్లను మళ్లీ ప్రవేశపెట్టే యోచన లేదని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. అదే విధంగా రూ.500 నోట్లను ఉపసంహరించుకునే యోచన లేదని స్పష్టం చేశారు. శక్తికాంత దాస్ అధ్యక్షతన మూడు రోజుల పాటు జరిగిన ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్షా గురువారంతో ముగిసింది. మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) భేటీ వివరాలను శక్తికాంత మీడియాకు వెల్లడించారు. రూ.500 నోట్లను కూడా ఉపసంహరించుకుంటారనే ఊహాగానాలను ఆయన కొట్టిపారేశారు. రెపో రేటును వరుసగా రెండో సారి 6.50శాతం వద్దే కొనసాగించాలని నిర్ణయించామన్నారు. రూ.2000 నోట్లలో రూ.1.80 లక్షల విలువైన నోట్లు వెనక్కి వచ్చేశాయని శక్తికాంత వెల్లడించారు. ఇది ఆ కరెన్సీలో 50 శాతమన్నారు. రూ.2000 నోట్లను మార్కెట్ నుంచి ఉపసంహరించుకుంటున్నట్టు మే 19న ఆర్‌బీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. కేవలం 15 రోజుల్లోనే సగం కరెన్సీ బ్యాంకులకు తిరిగి వచ్చిందన్నారు. 2023 మార్చి 31 నాటికి రూ.3.62 లక్షల కోట్ల విలువ చేసే రూ.2,000 నోట్లు చెలామణిలో ఉన్నాయి. రూ.2000 నోట్ల మార్పిడికి ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు గడువు ఇచ్చిన విషయాన్ని శక్తికాంత గుర్తు చేశారు. ప్రస్తుత పరిస్థితి ప్రకారం బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ల రూపంలో 85 శాతం కరెన్సీ వెనక్కి వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు. అలాగని చివరి క్షణం వరకూ పెద్ద నోటు మార్పిడి లేదా డిపాజిట్ కోసం వేచి ఉండొద్దని ప్రజలకు ఆయన సూచించారు. నగదు మార్పిడికి సరిపడ కరెన్సీ బ్యాంక్‌ల వద్ద అందుబాటులో ఉందన్నారు. ఎలాంటి పత్రాలు లేకుండా ఒక్క రోజు రూ.20,000 వరకు రూ.2వేల నోట్లను మార్పిడి చేసుకునే వెసులుబాటు కల్పించింది. ప్రస్తుత 2023-24లో వృద్థి 6.5 శాతంగా ఉండొచ్చని ఆర్‌బీఐ అంచనా వేసిందని శక్తికాంత పేర్కొన్నారు. 2022-23లో 7.2 శాతంగా, ఇంతక్రితం 2021-22లో 9.1 శాతంగా నమోదయ్యింది. దీంతో పోల్చితే ప్రస్తుత ఏడాదిలో వృద్థి రేటు తగ్గనుందని స్పష్టమవుతోంది.
సమీక్షా ప్రధానాంశాలు…
– రెపో రేటు యథాతథంగా 6.5 శాతంగా కొనసాగింపు.
– 2023-24లో ద్రవ్యోల్బణం సూచీ 5.1 శాతంగా ఉండొచ్చని అంచనా.
– 2023-24లో వృద్థి 6.5 శాతంగా ఉండొచ్చు.
– తొలి త్రైమాసికం (క్యూ1)లో 8%, క్యూ2లో 6.5%, క్యూ3లో 6%, క్యూ4లో 5.7 శాతంగా అంచనా.
– బ్యాంక్‌లు రూపే ప్రీపెయిడ్ ఫారెక్ట్స్ కార్డ్‌లను జారీ చేయవచ్చు.
– జూన్ 22న ఎంపీసీ భేటీ మినెట్స్ వెల్లడి.
– తదుపరి ఆర్‌బీఐ ఎంపీసీ భేటీ ఆగస్టు 8-10న నిర్వహణ.
వడ్డీ రేట్లు యథాతథం
వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తూ రిజర్వ్ బ్యాంక్ నిర్ణయం తీసుకుంది. ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అధ్యక్షతన మూడు రోజుల పాటు జరిగిన ద్రవ్య పరపతి విధాన సమీక్షాలో రెపో రేటును 6.50శాతం వద్దే కొనసాగించాలని నిర్ణయించారు. దీంతో మరోసారి రుణ గ్రహీతలకు స్వల్ప ఉపశమనం లభించింది. స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ (ఎస్‌డీఎఫ్) రేటును 6.25 శాతం, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేటును 6.75 శాతం వద్దే కొనసాగించాలని ఆర్‌బీఐ నిర్ణయించింది. గత ఏప్రిల్ సమీక్షాలోనూ వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు చేయలేదు. అంతక్రితం మాత్రం 2022 మే నుంచి వరుసగా ఆరు దఫాల్లో కీలక వడ్డీ రేట్లను 250 బేసిస్ పాయింట్లు పెంచింది. దీంతో ప్రస్తుతం వడ్డీ రేట్లు అధిక స్థాయిలోనే ఉన్నాయనే విమర్శలు ఉన్నాయి. ఇటీవల రిటైల్ ద్రవ్యోల్బణం కొంత తగ్గినట్లు గణంకాలు రావడంతో ఆర్‌బీఐ వడ్డీ రేట్ల పెంపును నిలిపివేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత వృద్థి రేటు 6.5 శాతంగా ఉండొచ్చని ఆర్‌బీఐ అంచనా వేసింది. ఇంతక్రితం ఏడాది 7.2 శాతంగా నమోదయిన విషయం తెలిసిందే.