”ఆనంద్ త్వరగా లేరా!, నాకు లేటవుతుంది”, అని గట్టిగా పిలిచింది భార్గవి. ”నాతో నీకేంటి మమ్మీ లేటు? నేను రెడీ అయ్యి కాలేజీకి వెళతాను గానీ, నువ్వు బయలుదేరు ఫస్ట్” అని విసుక్కుని మళ్ళీ ముసుగులోకి దూరాడు ఆనంద్.
”ఎందుకు మమ్మీ వాడిని రోజూ లేపుతావు? వాడు లేవని తెలిసినా” అంది, నందిత ఇల్లు ఊడ్చుకుంటూ. హడావుడిగా టిఫిన్, మధ్యాహ్నానికి భోజనం రెడీ చేసి తన బాక్సులో పెట్టుకుని, నిల్చునే రెండూ ఇడ్లీలు లాగించి, బస్సు కోసం బయలుదేరింది, భార్గవి.
నందిత డిగ్రీ సెకండియర్ హైద్రాబాద్‌లోనే, అక్కడ వాళ్ళ ఏరియాలోని కాలేజీలో జాయిన్ అయ్యింది. ఆనంద్ ఇంటర్ ఫస్టియర్. పదవ తరగతి 9.8 +ూA తో పాసయ్యాడు. తన పదవ తరగతి మధ్యలో కరోనా రెండోవేవ్‌లో, పోస్ట్ కోవిడ్ వల్ల ”హార్ట్ఎటాక్”తో వాళ్ళ నాన్నగారు రాఘవ మరణించారు. రాఘవ వ్యవసాయ శాఖాధికారి
వారి తదనంతరం భార్గవికి ఆ శాఖలో జూనియర్ అసిస్టెంట్ కేటాయించగా జాయిన్ అయ్యారు.
”ఆనంద్, ఈ రోజు సాయంత్రం సరుకులు తేవాలి, నాతో వస్తావా రా?” అని అడిగింది భార్గవి.
ఆ రోజు ఆదివారం ”మమ్మీ నాకు వీలుకాదు. మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాలి”, అని భోజనం చేసి వెళ్ళిపోయాడు.
”రాత్రి పది గంటలయ్యింది, ఆనంద్ ఇంకా రాలేదు. వాడికి కాల్ చెయ్యి నందిత, అంది భార్గవి, రేపటి టిఫిన్ కోసం మినపప్పు మిక్సిలో వేస్తూ,
”చాలా సేపటి నుండి చేస్తున్నా మమ్మీ వాడు కాల్ లిఫ్ట్ చేయడం లేదు” అంది నందిత చదువుకుంటూ రాత్రి పదకొండున్నర గంటలవుతోంది. భార్గవికి మనసులో భయం స్టార్ట్ అయ్యింది. టెక్ట్స్ మెసేజ్, వాట్సాఫ్ దేనీకీ రిప్లై రాలేదు. వాళ్ళ ఫ్రెండ్స్ ఫోన్స్ లిఫ్ట్ చేయడం లేదు. కన్నీళ్ళు ధారలయ్యాయి. ఏమీ అర్థం కావడం లేదు. అంతలో ఫోన్ రింగ్ అవుతుండగానే ఆత్రుతతో ఫోన్ ఎత్తింది భార్గవి. అటు వైపు నుండి కొంచెం కరకుగా ”ఆనంద్ పేరెంట్సా? మేము ”సరూర్‌నగర్” పోలీసు స్టేషను నుండి మాట్లాడుతున్నాం. మీ బాబు డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికాడు” స్టేషనుకు రమ్మని ఫోన్ పెట్టేశాడు. ఒక్కసారిగా కుప్పకూలింది భార్గవి.
కౌన్సిలింగ్‌కి అందరూ హాజరయ్యారు. ఆల్కహాలుతో పాటు, మత్తు పదార్థాలు ఇప్పుడిప్పుడే అలవాటయ్యాయని బయట పడింది. ఆ అమ్మానాన్నల కలలు, వీళ్ళు అప్పుడే ”కల్లలు” చేశారని గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నారు ఆ తల్లులు. వాళ్ళలో ఏ మాత్రం తప్పు చేశామన్న బాధ లేదు. కౌన్సిలింగులో గట్టిగా చెప్పారు, ఈసారి దొరికితే జైలు శిక్ష తప్పదని.
ఈ విషయం కాలేజీలో తెలిసింది. భార్గవి, ఆనంద్‌ని తీసుకుని ప్రిన్సిపాల్ రూమ్‌కి వెళ్ళింది.
ఆ ప్రిన్సిపాల్ గారికి ఆనంద్ ఫ్యామిలీ విషయం పూర్తిగా తెలుసు. ”ఏరా ఆనంద్, అమ్మని ఎట్లా మోసం చేయాలనిపించిందిరా? మీ కోసం దుఃఖాన్ని దిగమింగుకుని ఇన్ని కష్టాలు పడుతుంది” అని లాగి లెంపకాయ ఒక్కటిచ్చాడు.
”సారీ, సారీ సార్ మళ్ళీ ఎప్పుడూ చేయనుసార్”. అని ఏడుస్తున్నట్టు నటించాడు. కానీ కన్నతల్లి ఇంకా నమ్ముతుంది ఆనంద్ మంచివాడని.
”మీ పరిస్థితి నాకు తెలుసు కాబట్టి, ఆఖరి ఛాన్సుగా కాలేజీకి అనుమతిస్తున్నా” అన్నారు ప్రిన్సిపాల్ తన ఛైర్లో కూర్చుంటూ ”మీ అమ్మగారిని క్షమించమని అడుగు వెళ్ళి” అన్నారు ప్రిన్సిపాల్ వాళ్ళ అమ్మ వైపు చూపిస్తూ.
భార్గవి కాళ్ళు పట్టుకున్నాడు ఆనంద్ క్షమించమని.
దగ్గరకు తీసుకుని, ”నిన్ను ఈ విధంగా ఊహించటం కూడా నాకు వల్ల అవ్వటం లేదు. ఎప్పుడూ చేయకు, నీతో పాటు మీ అక్కకు చెడ్డపేరు వస్తుంది నాన్నా” అని బ్రతిమిలాడింది, భార్గవి.
ఆనంద్, తాను తెచ్చుకున్న కాలేజీ బ్యాగుతో క్లాసుకు వెళ్ళాడు. ప్రిన్సిపాల్ గారు భార్గవితో ఇలా అన్నారు… ”భార్గవి గారు మీ బాబులో తప్పు చేసిన భావన కన్పించడం లేదు. ఎందుకైనా మంచిది, ఒక మంచి సైకియాట్రిస్ట్‌ను కలవండి. కౌన్సిలింగ్ ద్వారా మారుస్తారు” అన్నారు.
”సరేనండి” అని బయలుదేరింది కళ్ళు తడుచుకుంటూ భార్గవి. సైకియాట్రిస్ట్ అపాయింట్మెంటు తీసుకుని, వెళ్ళే ముందు చెప్పింది భార్గవి ఆనంద్‌కు.
”నేను రాను మమ్మీ నాకేమయ్యింది? ఎవర్ని అడిగి అపాయింట్మెంట్ తీసుకున్నావు?” అని ఎదురుదాడి చేశాడు. నందిత కలగచేసుకుని, ”నువ్వు వెళ్తావా? మీ ప్రిన్సిపాల్ గారికి చెప్పాలా?” అనే సరికి, బయలుదేరాడు ముఖం మాడ్చుకుని. రోజు రోజుకు కోసం అసహనం పెరిగి పోతుంది. గౌరవం, మర్యాద అనే భావాల్నే మరిచిపోయాడు.
సైకియాట్రిస్ట్ డా||చంద్రకాంత్గారు చిరునవ్వుతో వీరిని ఆహ్వానించారు. మొదట భార్గవి విషయం అంతా వివరించేసరికి, ఆనంద్ కోపంతో రగిలిపోతున్నాడు. అది గమనించిన డాక్టరు గారు, భార్గవిని ఆపమని సైగ చేశాడు. ఆనంద్‌ని పలకరించగా నిర్లక్ష్యంగా సమాధానాలు చెప్తున్నాడు.
”ఆనంద్ మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు చిన్నప్పటి నుండి?”
”చిన్నప్పటి స్కూల్ ఫ్రెండ్స్ నాకు నచ్చరు సార్” అన్నాడు ఆనంద్.
”ఇంటర్లో మొదట నిన్ను ఇంప్రెస్ చేసిన ఫ్రెండ్ ఎవరు?” అడిగారు డాక్టరు గారు.
”అనిల్ అంటే నాకు చాలా ఇష్టం” ఎందుకంటే నన్ను ఫస్ట్ మూవీకి తీసుకువెళ్ళాడు సార్”.
డాక్టరు : అనిల్‌తో కలిసి ఎన్ని మూవీస్ చూశావు?
ఆనంద్ : గుర్తులేదు సార్
డాక్టరు : గుర్తులేదా? లెక్కలేదా?
ఆనంద్ : కౌంట్ చేయలేదు సార్
డాక్టరు : మూవీస్ ఏ షోకి వెళ్ళేవారు?
ఆనంద్ : మార్నింగ్ షోకి సార్
డాక్టరు : సండ్సేస్లోనా?
ఆనంద్ : నో, ఎప్పుడంటే అప్పుడు సార్
డాక్టరు :మరి కాలేజీ?
ఆనంద్ : అప్పుడప్పుడు టైమ్‌పాస్‌కి వెళ్ళేవాళ్ళం సార్.
డాక్టరు : నీకు నచ్చిన రెస్టారెంట్?
ఆనంద్ : ప్యారడైజ్ సార్
ఇలా ప్రశ్నల ద్వారా మొత్తం సమాచారాన్ని లాగడానికి చాలా సమయం పట్టింది.
”మధ్య తరగతి కుటుంబాలు, మేము పడ్డ కష్టం మా పిల్లలకు రావద్దని అతి గారాబం అంటే ఏది అడిగితే, అడిగిన దాని కన్నా ఎక్కువ ఇచ్చి వాళ్ళని పాడు చేస్తున్నారు. మొబైల్స్, బైక్, చేతి నిండా డబ్బులు. ఈ మూడింటితో రాబోయే 75 సం||ల జీవితాన్ని రెండు, మూడు సంవత్సరాల్లో పూర్తిగా నాశనం చేసుకుంటుంటే, తల్లిదండ్రులు మనోవేదనకు గురవుతున్నారు. పిల్లలకు అతి చనువు ఇవ్వకూడదు. పనిని బాగా చేయించాలి. ‘శ్రమయేవ జయతే’ సూత్రాన్ని, చిన్నప్పటి నుండి నూరిపోయాలి. ఎన్ని పనులున్నా, వాళ్ళ స్నేహితులను ఎప్పుడూ గమనిస్తూ, కష్టం విలువ, మనిషి విలువ, డబ్బు విలువ తెలిసేటట్టు పని చేయిస్తే వాళ్ళే మారతారు” అన్నారు డా||చంద్రకాంత్.
డాక్టరు గారి సలహాతో ప్రతిరోజూ, ఆనంద్‌తో పని చేయించడం మొదలుపెట్టింది భార్గవి. కాలేజీలో, ఆనంద్ గురించి ఎప్పటికప్పుడు వాకబు చేయడం, ప్రతి ఆదివారం వాళ్ళ నాన్నమ్మ ఊరికి తీసుకెళ్ళి పొలం పనులు చేయించడం, డబ్బు చేతికి ఇవ్వకపోవడం, అత్యవసరమైతే తప్ప, ఫ్రెండ్స్‌ను కలవకపోవడం వల్ల ఆరు నెలల్లో తన తప్పు తెలుసుకున్నాడు. ఇంటర్ 95% మార్కులతో కాలేజీలో టాపర్‌గా నిలిచాడు.
– మాద నాగాంజలి, 96400 98344