కొందరికి ‘మెడ మీదికి కత్తి వేలాడేదాకా తెల్సిరాదు’ అన్నట్టు ‘నిమ్మకు నీరెత్తినట్టు’ వుంటరు. వీల్లనే ‘జాము మనుషులు’ అని కూడా అంటరు. వీల్లు ‘తిన్నావుర బసవన్న అంటే తిన్న’ అంటరు. ‘పన్నావుర బసవన్న అంటే పన్న’ అంటరు. ముందు చూపు, భవిష్యత్ ప్రణాళిక వుండది. ఏం పని ఎప్పుడు చేయాలనో తోచని వాళ్లు. మనుషులల్ల అన్ని రకాల వాల్లు వుంటరు. వీల్లు చేసే పనిని చూసే ‘దూప అయినప్పుడే బాయి తవ్వినట్టు’ చేస్తున్నవు అంటరు. దూప అంటే దాహం అయి నీళ్లు తాగాలి అనిపించుడు, మరి అప్పుడే బాయి తవ్వాలె నీళ్ల కోసం అంటే కలవది కదా. ఇల్లు కట్టినప్పుడే నీళ్ల కోసం బావి ఏర్పాట్లు వుండాలి. అంటే అవసరం పూరాగ దగ్గరికి వచ్చేదాక తెల్వది అన్నట్టు.
మరి కొందరేమో అత్యాశవాల్లు వుంటరు. వాల్లు ఎట్లాంటోల్లు అంటే ‘మబ్బుల్లో నీళ్లను చూసి ముంతలోని నీళ్లు ఒలకబోసుకునేటోల్లు’ అంటరు. ఆకాశం మేఘావృతం అయిందంటే ఇంకేంది… వర్షం కురుస్తదని ఇంట్లోని బిందెలు, ముంతలలో వున్న నీళ్లు పారబోయడం, తర్వాత వర్షం కురవపోతే కష్టమే కదా!
కొందరేమో తెలిసినా తెలవనట్టు ఆక్షన్ చేస్తరు. గీపని చేయవయ్య అంటే నాకు ఆ పని రాదు, నేనెన్నడు చెయ్యలేదు అని కతలు చెప్పుతరు. వాల్లను గురించి చెప్పేటప్పుడు ‘నీవైతే ఏలు పెడితే కొరుకవు, ఎన్న పెడితే నాకవు’ అంటరు. అమాయకుల లాగ కన్పించేటోల్లను దెప్పిపొడిచే మాట ఇది. ‘పురుషులందు పుణ్యపురుషులు వేరయా’ అన్నట్టు మనుషులందు కూడా తీరొక్క తీర్లు వుంటరు. అదే నడుస్తున్న జగతి.
– అన్నవరం దేవేందర్, 9440763479