తల్లిపాలే అమృతం

Breast milk is nectar– ముర్రుపాలలో పోషకాలు మెండుగా ఉంటాయి
– పోతపాలతో అనారోగ్య సమస్యలు వస్తాయి
– నేటి నుంచి తల్లిపాల వారోత్సవాలు
– వారం రోజుల పాటు అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలకు అవగాహన
నవతెలంగాణ – వైరాటౌన్
శిశువు ఆరోగ్యానికి పునాది, తొలి పోషణ, రక్షణ ఇచ్చేది తల్లిపాలు మాత్రమే. శిశువు ఎదిగేందుకు అన్ని పోషకాలను సమకూర్చేవి, ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడేవి చనుబాలే. బిడ్డతో పాటు తల్లినీ భవిష్యత్తులో జబ్బుల బారిన పడకుండా కాపాడతాయి. ఈ విషయంపై విస్తృత ప్రచారం కోసం మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఆగస్టు మొదటి వారంలో తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తున్నారు.  ఈ సంవత్సరం వారోత్సవాలకు సంబంధించి మంగళవారం ఉన్నతాధికారులు జిల్లా ఐసీడీఎస్ అధికారులతో జూమ్ మీటింగ్, బుధవారం సెక్టార్ సూపర్వైజర్లు టీచర్లతో మీటింగ్ నిర్వహించారు. ఖమ్మం జిల్లాలోని 1,840 అంగన్వాడీ కేంద్రాల్లో వారోత్సవాలు నిర్వహించనున్నారు. వైరా మండలంలో 64 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. శిశువు జన్మించిన గంటలోపే పాలు ఇచ్చేలా తల్లికి సాయం చేయాలన్నదే తల్లిపాల వారోత్సవాల ప్రధాన ఉద్దేశం.
బిడ్డకు అమ్మపాలు అమృతం
నవజాత శిశువు ఆరోగ్యంగా పెరగడానికి తల్లిపాలు ఎంతగానో దోహదపడతాయి. ప్రకృతి సిద్ధంగా లభించే పాలు బిడ్డకు ఎంతో మేలు చేస్తాయి. తల్లి పాలల్లో వివిధ రకాల పోషకాలుంటాయి. అవి శిశువు పెరుగుదలకు ఉపకరిస్తాయి. అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే ఆపోహలు వీడి తప్పకుండా బిడ్డకు తల్లిపాలు పట్టించాలి. పుట్టిన వెంటనే బిడ్డకు గంటలోపు ముర్రుపాలు పట్టిస్తే సహజ రోగ నిరోధక శక్తి కలిగేలా చేస్తాయి. లేత పసుపుపచ్చ రంగుతో కూడిన పాలను బిడ్డకు ఇవ్వడం వల్ల పసికందు మెదడు చురుకుగా పనిచేస్తుంది. జ్ఞాపక శక్తి పెరిగేందుకు దోహదపడుతుంది. గుండె, చర్మ సంబంధ వ్యాధులు, ఉబ్బసం, ఆస్తమా, బీపీ, షుగర్ రాకుండా చేస్తాయి. ఆరు నెలల పాటు శిశువుకు రోజుకు 12 సార్లు పాలు తాగించాలి. ఈ పాలు తాగిన పిల్లల్లో స్థూలకాయం వచ్చే అవకాశాలు చాలా తక్కువ. ఆగస్టు 1 నుంచి 8 వ తేదీ వరకు తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా జిల్లా, మండల కేంద్రంతోపాటు అన్ని గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
శిశువుకు సంపూర్ణ రక్షణ
తల్లి పాలల్లో సహజ సిద్ధమైన  యాంటీబాడీలుంటాయి. ఇవి శిశువు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. వైరస్లు, బ్యాక్టీరియాతో పోరాడే శక్తినిస్తాయి. తొలి గంటలో చనుబాలు పట్టడం బిడ్డకు భవిష్యత్తులో ఎంతో లాభం చేకూర్చుతుంది. తల్లిపాలు తాగిన పిల్లల్లో ఆస్తమా, అలర్జీలు, శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల తక్కువ. పాలు తాగేటప్పుడు పిల్లలు తల్లి కళ్లలోకి చూడటం, శరీర స్పర్శ మూలంగా ఇద్దరి మధ్య అనుబంధం ఏర్పడుతుంది. తల్లి రక్షణలో ఉన్నామన్న భావన శిశువుకు ఎంతో ధైర్యాన్ని కలిగిస్తుంది.
ప్రోటీన్లు, విటమిన్లు పుష్కలం
తల్లిపాలతో బిడ్డకు కావాల్సిన ప్రోటీన్లు అంది మెదడు వికసించడంతోపాటు శిశువుకు సమత్యులమైన ఆహారం అందుతుంది. బిడ్డకు అవసరమయ్యే విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. పాలల్లో లాక్టోజ్ ఉండటంతో కాల్షియం నిల్వలు పెరుగుతాయి. దీంతో బిడ్డ రక్తహీనత బారినపడకుండా ఉంటుంది. తొలిదశలో శిశువును అంటువ్యాధుల నుంచి కాపాడటమే కాకుండా మనోవికాసానికి తోడ్పడతాయి. జీవితాంతం ఆరోగ్యంగా ఉంటారు. తల్లిపాలు పుష్కలంగా రావాలంటే గర్భిణిగా ఉన్నప్పటి నుంచి పోషక విలువల ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. గుడ్లు, చేపలు, పాలు, తాజా కూరగాయాలు, పండ్లు తీసుకోవాలి.
అపోహలొద్దు
బిడ్డకు తల్లిపాలు మాత్రమే సరిపోవనే అనుమానం వద్దు. ఆరు నెలల వరకు బిడ్డ అవసరాలకు తగినన్ని పాలు తప్పకుండా వస్తాయి. నెల నెలా బిడ్డ ఎదుగుదల సక్రమంగా ఉండి, హాయిగా నిద్రపోతుంటే పాలు సరిపోతున్నట్లే. తల్లిపాలను రెండు సంవత్సరాల వరకు పట్టించవచ్చును.
ఇవీ కార్యక్రమాలు..
తల్లిపాల ప్రాధాన్యతను వివరిస్తారు. పిల్లల ఎదుగుదలపై అవగాహన కల్పిస్తారు. 7 నుంచి 9 నెలల గర్భిణుల ఇళ్లకు వెళ్లి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తారు. బాలింతలు, గర్భిణులకు లకు కౌన్సెలింగ్ ఇవ్వడంతోపాటు పుస్తకంలో వివరాలు నమోదు చేస్తారు. ఆరు నెలల్లోపు చిన్నారులకు తల్లిపాలు అందుతున్నాయా లేదా అని తెలుసుకుంటారు. అంగన్వాడీ సిబ్బంది ఇంటింటికీ తిరిగి 7 నుంచి 24 నెలల పిల్లలకు తల్లిపాలతోపాటు అదనంగా ఆహారం ఇవ్వాలని సూచిస్తారు. సమతుల ఆహారం తయారీపై అవగాహన కల్పిస్తారు.
లక్ష్యం ఇలా..
తల్లి పాల ఆవశ్యకతను బలోపేతం చేయడంలో ప్రజల పాత్రను తెలియజేసేలా విస్తృత ప్రచారం చేయాలి. వ్యక్తులు, సంస్థల సహకారంతో కూటమిగా ఏర్పడి తల్లిపాల పాత్రను వివరించాలి. మంచి పోషకాహారం, ఆహార భద్రత గురించి తెలుపుతూ వీటి మధ్య ఉన్న అనుమానాలను తొలగించేలా కృషి చేయడం. విస్తృతంగా ప్రచారం చేసి వ్యవస్థలో మార్పులు తీసుకురావడం, తక్షణం అమలు పరిచేలా చర్యలు తీసుకోవడం ఈ వారోత్సవాల లక్ష్యంగా నిర్దేశించారు.