సింగరేణి రిటైర్డ్‌ ఉద్యోగులకు ఉచిత వైద్య సౌకర్యాలు కల్పించాలి

బొగ్గు గనుల ఉద్యోగుల 11వ వేతన సవరణ జాతీయ కార్మిక సంఘాల నాయకుల అద్వితమైన కషితో దేశంలోని ఏ పరిశ్రమ రంగంలోని 19 శాతం వద్ధితో సాధించారు. కేంద్రం కోలిండియా యాజమాన్యం పదేండ్ల వేతన ఒప్పందం ఉంటుందని దీనికి కట్టు బడితేనే ముందుకు సాగుతుందని చెప్పినా వినకుండా కార్మిక సంఘాలు పట్టుబట్టి ఐదేళ్ల కాలానికి వేతన ఒప్పం దం చేయడం గమనార్హం. ఇది కార్మిక సంఘాల నాయకుల ఐక్య పోరాటంతో సాధ్యమైందని తెలుపుటలో ఎలాంటి సందేహం లేదు. సమయస్ఫూర్తితో వేతన సవరణ ఒప్పందం చేసినందులకు కార్మిక సంఘాల నాయకులకు విప్లవాభి వందనాలు. ఈ సంఘాల నాయకులందరూ దాదాపు దేశంలోని బొగ్గు గనులలో ఉద్యోగ విరమణ చేసిన వారే. కానీ వీరు బొగ్గు గని రిటైర్‌ ఉద్యోగుల సమస్యల ను పట్టించుకోకపోవడం బాధాకరం. సింగరేణి రిటైర్డ్‌ ఉద్యోగులకు ఉచిత వైద్య సౌకర్యాలు కల్పించాలని సింగరేణి కార్మిక సంఘాల నాయకులను అనేక అనేక సందర్భాలలో వేడుకున్నా పట్టించుకోవడంలేదు. రిటైర్డ్‌ ఉద్యోగుల వైద్య, ఆరోగ్య సౌకర్యాలు గురించి వీరికి తెలియని విషయం కాదు. సింగరేణి రిటైర్డ్‌ ఉద్యోగులకు ఉచిత వైద్య సౌకర్యాలు కోలిండియా ఒప్పందంతో ముడివడి ఉంటాయని ఈ నాయకులు చెబుతుంటారు. కానీ ఇదే యూనియన్‌ నాయకులు వీరు సింగరేణిలో గుర్తింపు సంఘంగా ఎన్నికైనప్పుడు కోల్‌ ఇండియాలో లేని ఎన్నో సౌకర్యాలు, ఆర్థిక ప్రయోజనాలు, ప్రమోషన్స్‌ సింగరేణి యాజమాన్యంతో ఒప్పందం చేసుకొని ఉద్యోగులకు కల్పించామని అవకాశమొచ్చిన ప్రతిసారి చెబుతుంటారు. సింగరేణి సంస్థ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం తమ నిధులనుండి వివిధ పథకాల పేరుతో అనేక కార్యక్రమాలకు పైసలను అవసరమైన చోట వెచ్చిస్తున్నది. కానీ ఈ లాభాలకు మూలస్తంభాలైన తమ చెమట రక్తాన్ని సింగరేణి సంస్థ తమ కుటుంబంగా భావించి యవ్వన జీవితాన్ని ధారబోసి ప్రస్తుతం చేవలేని అచేతన పరిస్థితుల్లో ఉన్న రిటైర్డ్‌ ఉద్యోగులను వైద్యపరంగా ఆదుకొనుటకు దయ చూపడంలేదు. సింగరేణి యాజమాన్యానికి, రాష్ట్ర ప్రభుత్వానికి అనేకసార్లు వినతి పత్రాలు సమర్పించిన ఫలితం దక్కడం లేదు. కేంద్రంలో అధికార భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ అనుబంధ సంస్థ అయిన బిఎంఎస్‌ కూడా రిటైర్డ్‌ బొగ్గు గనుల ఉద్యోగుల పెన్షన్‌ గురించి గానీ, సింగరేణి రిటైర్డ్‌ ఉద్యోగుల ఉచిత వైద్య సౌకర్యాల గురించి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. తరచుగా ఈ సంఘం జాతీయ నాయకులు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషిని, బొగ్గు కార్యదర్శిని కలుస్తున్నట్లు పత్రికలలో చూస్తుం టాం కానీ అత్యల్ప పెరుగుదల లేని పెన్షన్‌ గురించి వైద్య సౌకర్యాల గురించి చర్చించకపోవడం శోచనీయం. ఇప్పటికైనా సింగరేణి రిటైర్డ్‌ ఉద్యోగుల బాధలు పట్టించుకోని వారికి మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉన్నది.
-దండంరాజు రాంచందర్‌రావు, సెల్‌:9849592958