శిశిర సుమాలు
( కథా సంపుటి)
పేజీలు162 , వెల 250 /-
వారణాసి నాగలక్ష్మి
అన్వేక్షకి పబ్లిషర్స్ ప్రైవేట్ లిమిటెడ్.
హైదరాబాద్
ప్రతులకు : అన్వేక్షకి, నవోదయ పుస్తక కేంద్రాలు.
సెల్ : 94 90 75 15 75
కవయిత్రిగా, మంచి కథకురాలిగా గుర్తింపునొందిన వారణాసి నాగలక్ష్మి వెలువరించిన నాలుగవ కథా సంపుటియే ‘శిశిర సుమాలు’. ఇందులో ఎక్కువ కథలు కుటుంబ సంబంధాల గురించి వివరించగా, మిగిలిన కథలు మానవ సంబంధాల గురించి తెలియజేస్తాయి. జీవితమంతా భార్యను పట్టించుకోని భర్త వృద్ధాప్యంలో అన్ని అవసరాలకు భార్యపై ఆధార పడాల్సి రావడాన్ని ‘వృద్ధ పురుషః భార్యనుకూలః’ అనే గల్పికలో చూడవచ్చు. అమెరికాలో ఉన్న కూతురు తన సుఖాన్ని డబ్బును తల్లిదండ్రులతో పంచుకోకుండా, ఇండియాలో ఉన్నన్ని రోజులు అమ్మకున్న జ్ఞాపకాలన్నీ మాన్పించి, కావలసినవన్ని అడిగి చేయించుకుని షాపింగులు చేసుకుని, ఫ్రెండ్స్ ఆమెను చూడటానికి వస్తే వాళ్లకి అమ్మ చేత సేవలు చేయించి వెళ్లే రోజు అమ్మ నాన్న ఎయిర్‌పోర్టులో దింపితే చేతులు ఊపుకుంటూ వెళ్లిపోయే కూతురు అవకాశవాదాన్ని, స్వార్థపరత్వాన్ని గమనించిన తల్లి ఆమె నెలా వదిలించుకుందో ‘చుట్టుకునే బంధాల’లో కనిపిస్తుంది. ఒక అన్నగారు, తండ్రిని జీవితాంతం తన వద్ద ఉంచుకొని ప్రేమగా చూసుకున్న తమ్ముడికే తండ్రి ఆస్తిని వదిలిపెడతాడు. అన్నగారి ఔదార్యం వల్ల తన వాటా కూడా పోయిందని గింజుకున్న చెల్లెలు, తర్వాత ఆమె మనసు మార్చుకోవడం, అన్నగారి ఆంతర్యాన్ని అర్థం చేసుకోవడం ‘పూలపల్లి విత్తనాలు’ కథలో కనిపిస్తుంది.
వద్ధాప్యంలో మంచాన పడిన అత్తగారిని అపురూపంగా చూసుకునే కోడలు, అయినా కొడుకు కోడలు కలిసి సినిమాకు వెళతానంటే భరించలేక గొడవ చేస్తుంది. ఇది ఆమెలో చోటు చేసుకున్న ఇన్‌సెక్యూరిటీకి చిహ్నమని గుర్తించిన కోడలు సర్దుకుపోతుంది. అదే వేరే వాళ్ళైతే గొడవలే కదా! పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అమ్మానాన్నల ఇంట్లో ఎంతో హాయిగా ఉంటారు. అది తమ సొంతం అనుకుంటారు గానీ మాకు వేరే ఇల్లు లేదని అనుకుంటారా? అలాగే పిల్లలు పెద్దయ్యాక తల్లిదండ్రులు కూడా పిల్లల ఇంట్లో అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా వాళ్ళ ఇంట్లో స్వేచ్ఛగా, స్వతంత్రంగా ఉండవచ్చు. అంతేగాని మాకు వేరే ఇల్లు లేదని అనుకోకూడదు అని చెప్పే కథ ‘శిశిరంలో విరిసిన కుసుమం’. ముసలితనంలో ఎవరి మీదైనా పూర్తిగా ఆధారపడి ఉండటం అంటే చాలా కష్టం. కానీ అయిన వాళ్ళ సంరక్షణలో ఉంటే అది కొంత నయం. పెద్ద వయసులో పిల్లల సమక్షం కావాలనిపిస్తుంది. కొడుకు, కోడలు ఇద్దరూ ఉద్యోగస్తులు అయితే తల్లిని చూసుకోవడానికి ఒక మనిషిని పెడతారు. అది సరిపోదు, రోజుకు కొద్దిసేపు అయినా వారితో గడిపితే అదే తృప్తి వాళ్లకు అని ‘పడమటి సంద్య’ తెలియజేస్తుంది. పల్లెటూర్లో ఒంటరిగా ఉన్న తాతగారు. ఆయన్ని పట్నం పిలిపించుకుందామంటే భార్యకు ఇష్టం ఉండదు. అందుకని ప్రకాష్ తనే వెళ్తానంటే పోటీపడి మరీ భార్య కూడా వచ్చేస్తుంది. పల్లెటూరిలో ఎలాంటి సౌకర్యాలు ఉండవని, పని మనుషులు దొరకరని, దోమల బాధ అని కంప్లైంట్ చేస్తుండేది. ఇష్టం లేకుండా ఊరికి వచ్చిన ఆమెకు తన భర్తతో ఉన్న దూరాలు సమసిపోయి, తాత గారితో అనుబంధం ఏర్పడి, ఆమెలో వచ్చిన మార్పును ‘కలువకొలను వెన్నెల’ కథలో చిత్రీకరించిన విధానం బాగుంది.
మన ఇంట్లో పనివాళ్ళు కానీ, మన కింద పనిచేసే వాళ్లు కానీ, మన కళ్ళముందే ఎదిగి పోవడం యజమానులకు మింగుడు పడని విషయమే. అయినా పని వాళ్ళ పట్ల, అనాధల పట్ల జాలి చూపించడమే కాకుండా తగు సహాయం చేసి, వాళ్లు ఎదగడానికి దోహదం చేసిన గృహిణులు ‘నామోషి’ మరియూ ‘సుమాళి’ కథలలో కనిపిస్తారు.
ఒక వ్యక్తి ప్రతిఫలం ఆశించకుండా మనకి సాయం చేస్తే, అతనికి అవసరం వచ్చినప్పుడు అడక్కుండానే మనము సాయం చేయాలి. అడిగినా తప్పుకొని తిరిగిన రమేష్‌లో పరివర్తన ఎలా వచ్చిందో తెలుసుకోవాలంటే ‘మళ్ళీ మనిషిగా’ కథ చదవాల్సిందే. మనకు ఏం కావాలో తెలుసుకోలేక ఇతరులను మెప్పించడానికి, వారిపై ఆధిక్యం కనబరచడానికి చేసే ప్రయత్నాలన్నీ చూసే వాళ్ళకి ఎలా హాస్య భరితంగా, ఇంట్లో వాళ్లకు ఎంత తలనొప్పిగా మారుతాయో ‘పొరుగింటి మీనాక్షమ్మని’ కథ తెలియజేస్తుంది. ‘సంబరాల రాంబాబు’ లోని పాటను శీర్షికగా పెట్టడం బాగా కుదిరింది. ఎవరిని పట్టించుకోని అపార్ట్మెంట్ కల్చర్‌లో, డబ్బు హోదాలతో ఇతరులను పట్టించుకోని వారికి కూడా ఏదో ఒక సమయంలో ‘ఇరుగు-పొరుగు’ ఎలా అండగా నిలుస్తారో తమదాకా వస్తే గాని తెలియదు.
పిల్లలకి ఏది నేరం? ఏ నేరానికి ఎలాంటి శిక్ష పడుతుంది? ఎవరైనా లైంగిక దాడి చేయబోతే అందుబాటులో ఉన్న ఆయుధంతో తోటి వారి నెలా రక్షించవచ్చు. దానికి గురైన వ్యక్తి పట్ల ఎలాంటి సహానుభూతిని చూపించాలి? నేరస్తుల పట్ల మన వైఖరి ఎలా ఉండాలి? ఇవన్నీ ప్రతి బడిలోనూ చెప్పాలి. అనే సందేశాన్ని ‘రేపటి వెలుగు’ కథ అందజేస్తుంది. భర్త నిరాదరించాడనో, హింసిస్తున్నాడనో, ప్రేమించిన వాడు కాదన్నాడనో తమ జీవితాన్ని తామే అంతం చేసుకునే ఆడవాళ్లలో మార్పు తేవడానికి, జీవితం పట్ల వారికి భరోసా కల్పించడం ‘భూపాలం’ కథలో చూడవచ్చు.
భార్యలను బానిసల్లా చూసే భర్తలు, తల్లిని పనిమనిషిలా చూసే కూతుళ్లు, అన్నదమ్ముల మధ్య ఉన్న ప్రేమలు, ఆస్తుల కోసం అంగలార్చే కూతుళ్లు, తమ వాళ్ళ ఆత్మీయతల కోసం ఎదురుచూసే వృద్ధులతో పాటు – గృహహింసకు, లైంగిక హింసకు గురైన వారిని ఆదుకునే, చేయూతనిచ్చే గృహిణులు కూడా ఈ కథల్లో కనిపిస్తారు. కుటుంబ సంబంధాలైనా, మానవ సంబంధాలైన వాటిని వైవిధ్యమైన రీతిలో ఆవిష్కరించడం ఈ కథల ప్రత్యేకత. వాస్తవిక ధోరణలతో నిండిన ఈ కథలన్నీ ఆశావహ దక్పథంతో ముగియడం విశేషం. మంచి రీడబులిటీ తో నిండిన ఈ కథలు ఆసక్తిగా చదివింపజేస్తాయి.