నవతెలంగాణ – మునుగోడు
డిండి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టుల సాధన కోసం ఈనెల 9న జరిగే జిల్లా సదస్సును జయప్రదం చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం అన్నారు. బుధవారం మునుగోడు మండల కేంద్రంలో డిండి ఎత్తిపోతల పథకం డిపిఆర్ ను వెంటనే ఆమోదించాలని, త్రాగునీరు, సాగునీరు అందించాలని కోరుతూ మునుగోడు మండల పరిధిలోనిమునుగోడు, ఊకోండి, ఇప్పర్తి, కిష్టాపురం,కొరటికల్,గూడపూర్, కల్వ లపల్లి ,రాయి గూడెం వివిధ గ్రామాలలోజీపుప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2016లో జీవో ఎంఎస్ నెంబర్ 107 ద్వారా అప్పటి టిఆర్ఎస్ ప్రభుత్వం డిండి ఎత్తిపోతల పథకానికి రోజుకు అర టీఎంసీ చొప్పున 60 రోజులలో, 30 టీఎంసీల నీరు జిల్లాలోని సింగరాజుపల్లి గొట్టిముక్కుల చింతపల్లి లక్ష్మణాపురం శివన్న గూడెం రిజర్వాయర్లు నింపి సాగునీరు అందించడం ద్వారా ఈ మునుగోడు దేవరకొండ ప్రాంతాలను వ్యవసాయ రంగానికి నీరు అందించి అభివృద్ధి చేయాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ రిజర్వాయర్లకు సంబంధించిన పనులు కొంతమేరకు జరిగిన కీలకమైన డి పి ఆర్ ను ఆమోదించకపోవడం అట్లాగే సుమారు 27 కిలోమీటర్ల కాలువని తవ్వే పనులకు సంబంధించిన పర్యావరణ అనుమతుల కోసం లేఖలు రాయకపోవడం ద్వారా ఆ ప్రభుత్వం తీవ్రమైన తప్పిదానికి పాల్పడిందని విమర్శించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని వెంటనే ఆమోదించి పర్యావరణ అనుమతుల కోసం లేఖలు రాసి నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించాలని ప్రభుత్వాన్ని కోరారు. గత ప్రభుత్వం మాదిరిగా ఈ ప్రభుత్వం ప్రాజెక్ట్ రిజర్వాయర్ పనులు నిధుల కేటాయింపు విషయములో నిర్లక్ష్యం చేస్తే , ప్రజల నుండి తిరుగుబాటు ఎదురుకోవలసిన పరిస్థితి వస్తుందని తెలిపారు. పెద్ద ఎత్తున రైతులు పాల్గొని ఈ సదస్సును జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు సాగర్ల మల్లేష్, సీపీఐ(ఎం) మునుగోడు మండల సహాయ కార్యదర్శివరికుప్పల ముత్యాలు, చండూరు మండల సహాయ కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ గౌడ్,మునుగోడు టౌన్ శాఖ కార్యదర్శి యాస రాణి శ్రీను, ప్రజానాట్యమండలి జిల్లా నాయకులు వేముల లింగస్వామి, తదితరులు పాల్గొన్నారు.