గిరిజనబంధు అమలుచేయకుంటే.. పోరాటాలే..!

తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ శ్రీరాంనాయక్‌
నవతెలంగాణ- హన్మకొండ
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల ముగింపు లోపు గిరిజనబంధు అమలు చేస్తూ జీఓ జారీచేయాలని, లేదంటే ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధమవుతామని తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ శ్రీరాంనాయక్‌ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా శుక్రవారం పలు జిల్లాల్లో నిరసనలు జరిగాయి. హన్మకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం హన్మకొండ చౌరస్తాలోని అంబేద్కర్‌ విగ్రహం ఎదుట చేట్టిన నిరసనలో ఆయన పాల్గొని మాట్లాడారు. గిరిజన బంధు అమలు చేస్తామని గతేడాది సెప్టెంబర్‌ 17న ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారని, అయినా ఇప్పటికీ అమలుకు నోచుకోకపోవడం దారుణమన్నారు. మరో మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్‌ వస్తున్న నేపథ్యంలో గిరిజనబంధు ఎప్పుడు అమలుచేస్తారో ప్రభుత్వం స్పష్టత నివ్వాలని డిమాండ్‌ చేశారు. గిరిజనబంధు అమలు చేయకుండా తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో గిరిజన ఉత్సవాలను నిర్వహించడం గిరిజనులను మోసం చేయడమేనని విమర్శించారు. గిరిజన మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలకు చిత్తశుద్ధి ఉంటే ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఒత్తిడి చేసి దశాబ్ది ఉత్సవాల ముగింపు లోపు గిరిజనబంధు అమలుకు జీఓ జారిచేయించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో 15 లక్షల గిరిజన కుటుంబాల్లో 10 లక్షల కుటుంబాలకు పైగా దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నారని, కానీ భూమిలేని గిరిజనులకు మాత్రమే గిరిజన బంధు ఇస్తామన్న ముఖ్యమంత్రి ప్రకటనను వెనక్కుతీసుకోవాలని డిమాండ్‌ చేశారు. గిరిజనబంధు సాధన కోసం గిరిజనులు, విద్యార్థి, ఉద్యోగ సంఘాలు, మేధావులు కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బల్లకొండ శ్రీకాంత్‌, వాంకుడోత్‌ వీరన్న, నాయకులు, జగన్‌, తిరుపతి, రమేష్‌, సిద్దు, నరసింహ, రమ, సుమలత, సారయ్య, స్వరూప, లాలూ తదితరులు పాల్గొన్నారు.