– వెంకటగిరి తండాలో గిరిజన ఉత్సవ సంబరాలు
– సర్పంచ్ పాతులోత్ పెంటవ్వ బాలకిషన్
నవతెలంగాణ – దుబ్బాక రూరల్
గతంలో గిరిజన తండాలుగా ఉన్న గ్రామాలు నేడు సీఎం కేసీఆర్ హయాంలో గ్రామ పంచాయతీలుగా రూపాంతరం చెంది స్వంతంగా పరిపాలన చేసుకుంటూ… నేడు అభివృద్ధిలో పోటీ పడుతున్నాయి.ఈ ఘనత తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ కే దక్కుతుందని వెంకటగిరి తాండ సర్పంచ్ పాతులోత్ పెంటవ్వ బాలకిషన్ అన్నారు.తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం దుబ్బాక మండల పరిధిలోని వెంకటగిరి తండాలో సర్పంచ్ ఆధ్వర్యంలో తెలంగాణ గిరిజన ఉత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించారు.మూడు వందల జనాభా ఉన్న వెంకటగిరి తండాను గ్రామపంచాయతీగా మార్చినందుకు హర్షం వ్యక్తం చేస్తూ గిరిజనులతో కలిసి సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈసందర్భంగా పాతులోత్ పెంటవ్వ బాలకిషన్ మాట్లాడుతూ గిరిజన తండాలను అభివృద్ధి పథంలో నడిపేందుకు సీఎం కృషి చేస్తున్నారన్నారు. ప్రభుత్వ కృషితో వెంకటగిరి తండాలో రూ.45 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణం, రూ.20 లక్షలతో గ్రామపంచాయతీ నూతన భవన నిర్మాణం ప్రారంభించామన్నారు. మెదక్ ఎంపీ ప్రత్యేక చొరవతో ఎంపీ లాండ్స్ నిధుల నుంచి ఇటీవల సంత్ సేవాలాల్ మహారాజ్ ఆలయానికి ఐదు లక్షలు, తండా యువత కోసం యూత్ భవనానికి మరొక ఐదు లక్షల ప్రొసీడింగ్ గ్రామానికి వచ్చాయన్నారు.రానున్న రోజుల్లో గిరిజనుల అభివృద్ధికి కేసిఆర్ సర్కార్ మరిన్ని సంక్షేమ పథకాలను తీసుకువస్తుందని పేర్కొన్నారు. తాజాగా హైదరాబాదులో గిరిజనుల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఐదు కోట్లతో బంజారా భవన్, ఐదు కోట్లతో ఆదివాసి భవన్ లను నిర్మించి, ఘనంగా ప్రారంభించడంపట్ల వారు హర్షం వ్యక్తం చేశారు.అంతకు ముందు తండావాసుల ఆరాధ్య దైవమైన సంతు సేవాలాల్ మహారాజ్ చిత్రపటానికి పూజలు, నైవేద్యాలు నిర్వహించి, జగదాంబ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్ పర్సన్ చింతల జ్యోతి కృష్ణ, ఉపసర్పంచ్ మోహన్, బిఆర్ఎస్ నాయకులు పాతులోత్ బాలకిషన్ , పంచాయతీ కార్యదర్శి వజ్ర, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.