సుస్వర బాల గేయాల ఆడియో, రంగుల చిత్రాల కుంచె ‘శంకర్‌ సూరారం’

వెదురును వేణువుగా మలచడం కొందరికి తెలిసిన విద్య అయితే….
ఆ వేణువును సుస్వర గీతాల సారంగిగా మలచడం కొందరికి మాత్రమే వచ్చిన విద్య. ఆ విద్య తెలసిన బాల గీతకారుడు, గజల్‌ కవి, బాల సాహితీవేత్త… చిత్రకారుడు సూరారం శంకర్‌. తొంభయ్యవ దశకంలో బాల సాహిత్యాన్ని ఉద్యమంగా రాసిన కొందరిలో సూరారం ఒకరు. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలోని మాల్తుమ్మెదలో మే 5, 1959న సూరారం శంకర్‌ పుట్టారు. తల్లితండ్రులు శ్రీమతి కృష్ణబాయి, తండ్రి స్వాతంత్య్ర సమరయోధులు సూరారం నర్సింహులు. తెలుగు సాహిత్యంలో పిజి చేసిన శంకర్‌ స్కూల్‌ అసిస్టెంటుగా ఉద్యోగం చేశారు.

1980 నుండి రచనా వ్యాసంగంలో ఉన్న వీరు తన తొలి రచనగా తెచ్చిన రచనల బాల గేయ సంపుటి కావడం విశేషం. 1994లో కవితా సంపుటి ‘ఇవాళే అంకురిద్దాం’ ప్రచురించారు. ‘హృదయం పాటలు’ 1998లో వెలువడింది. ‘కుదుపు’, ‘రెండు జ్ఞాపకాలు’ వీరి మరో రెండు కవితా సంపుటాలు. సూరారం శంకర్‌ కవి, గాయకుడే కాక చిత్రకారుడు కూడా. తాను రాసిన పాటలను మల్లి పాటలు పేరుతో ప్రచురించారు. ఈ పాటలు మొదట ఆంధ్రప్రభలో శంకర్‌ గీసిన తైలవర్ణ చిత్రాలతో వచ్చాయి. బాల గేయం నుండి కవిత్వం వైపుకు, అటునుండి గజల్‌ వైపుకు ప్రస్థానం సాగించిన సూరారం అందులో విశేషకృషి చేస్తున్నారు. ‘సౌగంధిక’, ‘సౌపర్ణిక’, ‘నీహారిక’, ‘లహరిక’ సూరారం గజల్‌ సంపుటాలు. గజల్‌ పరుసవేది తెలిసిన రసవేది సూరారం. వీరి గేయ కావ్యం ‘అప్రాప్య’. గజల్‌ కవిగా తెలుగు విశ్వ విద్యాలయం కీర్తి పురస్కారాన్ని అందుకున్న సూరారం గురజాడ కళాపీఠం అవార్డు, అమ్మ గజల్‌ పురస్కారం, గరిశకుర్తి పురస్కారం, హరిద రచయితల సంఘం అవార్డు వంటి అవార్డులు, పురస్కారాలు అందుకున్నారు. ఆకాశవాణిలో వీరి దేశభక్తి గేయాలు ప్రసారమయ్యాయి. చిత్రకారులుగా దాదాపు రెండువందల పుస్తకాల వరకు సూరారం ముఖచిత్రాలు, కవితా చిత్రాలు వేశారు. ఫేస్‌బుక్‌లో సూరారం రాస్తున్న పంచపదులు, నా నుడుగులు ప్రసిద్ధం.
కవిగా వచన కవిత్వం, పాటలు, గేయాలు, కావ్యం రాసిన సూరారం తొలి రచనలు బాల గేయాలే. సూరారం అచ్చులో ప్రచురించిన తొలి పుస్తకం ‘విద్యార్థి గేయాలు’ బాల గేయ సంపుటి. ఇది 1991లో అచ్చయ్యింది. ఇందులో నలభైరెండు పాటలు, 20 తెలుగు నర్సరీ గేయాలు ఉన్నాయి. 1992లో రెండవ బాల గేయ సంపుటి ‘మహా సంకల్పం’ వచ్చింది. దీనిని మహాకవి సినారెకు పద్మభూషణ్‌ వచ్చిన సందర్భంగా తెచ్చాడు కవి. రచనయేకాక చిత్రాలు కూడా సూరారమే వేశాడు. అంటే రాతకారుడు, గీతకారుడు రెండు ఆయనేనన్నమాట. సూరారం రాసిన బాలగేయాలు తొంభయ్యవ దశకంలోనే ఆడియో క్యాసెట్లుగా వెలువడి వేలసంఖ్యలో అమ్ముడయ్యాయి. వీరి తొలి ఆడియో గీతాల క్యాసెట్‌ ‘బాల గీతాంజలి’గా వెలువడింది. ఆకాశవాణి నిజామాబాద్‌ ద్వారా ఈ గేయాలన్ని వెలువడ్డాయి. ఇందులో ముప్పైయేడు పాటలు, డెబ్బై బాల గేయాలు ఉన్నాయి. మహా సంకల్పంలోని గేయాలు ‘బాల గేయతరంగిణి’గా వెలువడ్డాయి. ఇవేకాక హృదయం పాటలు ‘జాబిలమ్మ పదాలు’గా వెలువడ్డాయి.
‘గంటలు పిలిచాయి/ బడి గంటలు పిలిచాయి’ అంటూ సాగిన సూరారం బాల గేయాలు ‘మనదేనోరు భారతదేశం/ మనమంతా భారతీయులం/ ప్రియభారతి కన్నబిడ్డలం/ జయభారత జాతి జ్యోతులం/ ఈ విశాల దేశంలో/ వికసించిన పుష్పాలం/ ఈ భువి సుమ సౌరభాల/ బాల కేతనాలం మనం’ అంటూ సాగుతాయి. బాలల బడిని, గుడిని, బాలల దినోత్సవాన్ని గేయాలలో చక్కగా రాశారు సూరారం శంకర్‌. చాచా నెహ్రూ పుట్టినరోజును ‘నేడే బాలల దినోత్సవం/ భారత జాతికి మహోత్సవం/ జాతి నేత శ్రీ జవహరు నెహ్రూ/ జన్మదినమ్యిదే జయోత్సవం’ అంటూ బాలల దినోత్సవాన్ని గురించి రాస్తూ… ‘బాలల చిరుదరహాస రేఖలే భావితరానికి బాటలురా’ అంటారు. గాంధీ పుట్టిన దినోత్సవాన్ని వైభవంగా వర్ణిస్తారు సూరారం.
జండా గురించి గుండెల నిండా దేశభక్తి పొంగేలా రాసిన సూరారం ‘ఇది మన భారత జండా/ మదిలో మమతలు నింపే జెండా’ అంటూ వైభవంగా కీర్తిస్తాడు. ‘నేటి బాలలం రేపటి దేశ పౌరులం/ సాటి మానవుల సేవకు సదా బద్ధులం’, ‘విద్యార్థులు/ రేపటి భారత చిత్రపటానికి/ మీరేలే విధాతలు’ వంటి గేయ పంక్తులు సూరారం బాల గేయ పటిమకు నిదర్శనాలు. పాఠ్యపుస్తకాన్ని కవి సూరారం బాలల కోసం చూపించిన విధానం ఆయన గేయాలలో చూస్తే ఆయన భావం అర్థమవుతుంది. ‘పాల మీగడ తరగలా/ పాఠ్యపుస్తకం/ నీ దరికి వచ్చినది/ నిను చేర గోరినది/ ఆలస్యమేల యిక/ అందుకో విద్యార్థి/ విద్వత్తు ద్వారమది/ విజ్ఞాన కోశమది’. శంకర్‌ రాసిన గేయాలకంటే కూడా చిట్టిపొట్టి గేయాలు ‘మిణుక్కు మిణుక్కు నక్షత్రం/ మిఠాయి పొట్లం ఆకాశం/ తారాజువ్వలు నీ కోసం/ తమ్ముడి నవ్వులు నాకోసం’, ఇదే కోవలో రాసిన గేయం ‘రాధా-మురళికి పెళ్ళంట/ మిత్రులందరికి విందంట/ కట్నం గిట్నం లేదంట/ కలిసి బ్రతకటం చాలంట!’ గేయం సూరారం ఆలోచనల సారం!
– డా|| పత్తిపాక మోహన్‌, 9966229548