భావవ్యక్తీకరణతో మెరుగైన సేవలు అందించొచ్చు

– కార్మిక, ఉపాధి కల్పన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణి కుముదిని
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
నాణ్యమైన భాషలో భావవ్యక్తీకరణ ద్వారా ప్రజలకు మరిన్ని మెరుగైన సేవలు అందించగలమని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణి కుముదిని అన్నారు. జపాన్‌లో నర్సింగ్‌ రంగంలో పనిచేసేందుకు అర్హత గల సిబ్బందికి జపనీస్‌ భాషలో రెండో విడత శిక్షణా కార్యక్రమాన్ని శుక్రవారం రాజేంద్రనగర్‌లోని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి సంస్థలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా నర్సింగ్‌ రంగంలో పెద్ద ఎత్తున అవకాశాలున్నాయనీ, వృత్తి, భాషా నైపుణ్యాలు పెంపొందించుకొని సద్వినియోగపరుచుకోవాలని అభ్యర్థులకు సూచించారు. రోగుల ఎమోషన్స్‌, ఫీలింగ్స్‌ తెలుసుకొని సరైన వైద్య సహాయం అందించడానికి భాషా పరిజ్ఞానం కీలకమన్నారు. పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖల ముఖ్య కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా మాట్లాడుతూ.. ఆత్మవిశ్వాసంతో జపనీస్‌ భాష నేర్చుకోవాలని సూచించారు. ఆ భాషలో శిక్షణ పొందిన అభ్యర్థులందరికీ ఉద్యోగాలు రావాలని ఆకాంక్షించారు. పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి, టాంకాం సీఈవో డాక్టర్‌ విష్ణువర్ధన్‌ రెడ్డి మాట్లాడుతూ, యువతకు విస్తృత ఉపాధి అవకాశాల కల్పన కోసం ప్రభుత్వ సహకారంతో చేపట్టిన పథకం ద్వారా ఆశించిన ప్రయోజనం చేకూరిందన్నారు. కార్యక్రమంలో టాంకాం జీఎం నాగభారతి, అధికారులు విద్యుల్లత, విద్యావతి, నరేంద్రనాథ్‌ , తదితరులు పాల్గొన్నారు.