అడవి దేవత పాఠం

Forest Goddess lessonవెంకటాపురం అనే పల్లెటూరిలో వేంకటేశం అనే రైతు ఉండేవాడు. అతను తన భార్య లక్ష్మి, కుమారుడు రాముతో ఆనందంగా జీవించేవాడు. రాము ఎంతో చురుకైన పిల్లవాడు పల్లెలో అందరికీ ఇష్టమైనవాడు. అతనికి అడవిలో తిరుగుతూ జంతువులను చూడటం అంటే చాలా ఇష్టం. రాముకు ఉన్న ఆ సాహస గుణం, ప్రకృతిని ప్రేమించే తత్వం వల్ల అతను ప్రతిరోజూ పల్లె సమీపంలోని చిన్న అడవికి వెళ్లేవాడు. ఒకరోజు రాము తన స్నేహితులు రవి, గోపిలతో కలిసి అడవికి వెళ్లాడు. ఆ రోజు వారు అడవిలో ఎక్కువ దూరం వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అడవిలో దూరంగా జంతువులను చూస్తూ, ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ముందుకు సాగారు. మరింత దూరం వెళ్ళినప్పుడు, వారికి ఎప్పుడూ కనబడని అందమైన ప్రాంతం కనబడింది. ఆశ్చర్యపడి, రవి ”రామూ, ఈ ప్రాంతం ఎంత అందంగా ఉంది! మనం ఇక్కడ కొంత సేపు ఆడుకుందాం” అన్నాడు. రాము, గోపి కూడా ఆ ఆలోచనతో మురిసిపోయారు. అంతలోనే ఒక మెరుపు మెరిసి అరణ్య దేవత వారి ముందు ప్రత్యక్షమైంది. ఆ దేవత గంభీరంగా మాట్లాడటం ప్రారంభించింది. ”బాలాలూ, మీరు ఈ మాయా మృగాల అడవిలోకి ప్రవేశించారు. ఇది సాధారణ అడవి కాదు, చాలా మాయాజాలంతో నిండి ఉంది. మీరు ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి” ఆ మాటలను వారు ఆశ్చర్యంతో, భయంతో దేవత మాటలు విన్నారు. రాము ధైర్యంగా అడిగాడు, ”దేవీ, ఈ అడవి గురించి మాకు మరింత సమాచారం ఇవ్వగలరా? మేము ఇక్కడ ఎంత సేపు ఉండాలి?”
దేవి నవ్వి, ”ఈ అడవిలో ప్రతి చెట్టు, ప్రతి జంతువు మాయాజాలంతో నిండి ఉంది. మీరు ఇక్కడికి వచ్చినందుకు మీ సాహసాన్ని పరీక్షించాలి. మీరు ఇక్కడినుండి బయటకు పోవాలంటే, నాలుగు పరీక్షలను పూర్తి చేయాలి. మీరు ధైర్యంగా, జాగ్రత్తగా ఉండి ఆ పరీక్షలను సమర్థవంతంగా పూర్తి చేసిట్లయితేనే సురక్షితంగా బయటకు వెళ్లగలరు”
రాము, రవి, గోపి కాస్త భయపడినప్పటికీ, ధైర్యంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. దేవత మొదటి పరీక్ష మొదలు పెట్టింది. మొదటి పరీక్షలో ”మీరు ఈ అడవిలోని అత్యంత భయంకరమైన జంతువును ఎదిరించాలి. ఆ జంతువు ఎలాంటి హానీ చేయకపోవచ్చు. కానీ మీరు దానిని చూసి భయం లేకుండా నిలబడాలి” అని చెప్పింది. వారు అడవిలో ముందుకు సాగారు. కొంత దూరం వెళ్లాక వారికి పెద్ద సింహం ఎదురైంది. సింహం గర్జిస్తూ, భయంకరంగా రాము, మిగతా వారి వైపు చూడడం ప్రారంభించింది. రవి, గోపి, భయపడ్డారు కానీ రాము ధైర్యంగా సింహాన్ని చూసి ”మనం జాగ్రత్తగా ఉండాలి. మనకు నమ్మకం ఉంటే, ఏ భయం కూడా మనకు హాని చేయదు. ఇది నిజం కాదు… ఒక పరీక్ష మాత్రమే అని దేవత చెప్పింది” అన్నాడు. మిగతా ఇద్దరూ రాము మాటలు విని, సింహం ముందు నిలబడి, భయం లేకుండా దానిని చూశారు. సింహం కొద్దిసేపు వారికి చూస్తూ, ఎటువంటి హాని చేయకుండా వెళ్లింది. దేవత ప్రత్యక్షమై, ”ఈ పరీక్షలో మీరు విజయం సాధించారు. ఇప్పుడు రెండో పరీక్షకు సిద్ధంగా ఉండండి” అని చెప్పింది. రెండో పరీక్ష సహనం. దేవత వారిని మరింత దూరంగా అడవిలోకి తీసుకెళ్ళింది. అక్కడ విపరీతమైన వేడి, చలి ఉంటుంది. వారిని పరీక్షించడానికి, రెండు వాతావరణ పరిస్థితులను ఎదుర్కోవాలి. దేవత, ”ఇక్కడ మీరు వేడి, చలిని సహించి సహనం కోల్పోకుండా ఉండాలి” అని చెప్పింది. ముందుగా, విపరీతమైన వేడి మొదలైంది. వారు అంత తీవ్రమైన వేడిని ఎదుర్కొనడం చాలా కష్టంగా తోచింది. రాము తన సహనాన్ని కోల్పోకుండా, ”మనకు ఇది ఒక పరీక్ష మాత్రమే. మనం ఈ వేడిని సహనం తో ఎదుర్కొందాం” అని చెప్పాడు. కొంతసేపు తరువాత వేడి తగ్గి తీవ్ర చలి మొదలైంది. చలి కూడా భయంకరంగా ఉండింది. గోపి తన చేతులు రుద్దుతూ, ”ఇది ఎంతో కష్టంగా ఉంది!” అన్నాడు. రవి, గోపి, రామును నమ్మి, సహనంతో ఆ పరీక్ష కూడా ముగియగానే దేవత వారిని చూసి, ”మీరు సహనంతో ఈ పరీక్షను కూడా విజయవంతంగా పూర్తి చేశారు. ఇప్పుడు మూడో పరీక్షకు సిద్ధంగా ఉండండి,” అని చెప్పింది. మూడో పరీక్ష స్నేహం. దేవత వారిని మరింత లోతైన అడవిలోకి తీసుకెళ్ళింది. అక్కడ ఒక వింత జంతువు పెద్ద మృగం వుంది. ఆ మృగం చాలా భయంకరంగా కనిపించింది, కానీ అది ఎటువంటి హాని చేయలేదు. దేవత, ”ఈ మృగం మీతో స్నేహం చేస్తుంది. మీరూ దానితో స్నేహం చేయాలి” అని చెప్పింది. రాము, రవి, గోపి మృగం దగ్గరికి వెళ్లి, దానితో మాట్లాడటం ప్రారంభించారు. మొదట్లో అది కొంచెం భయపెట్టినా, వారు దానిని ప్రేమతో చూసి, దాని వెంట నడిచారు. రాము దానికి చెట్ల పళ్లను ఇచ్చాడు. రవి, గోపి కూడా దానితో ప్రేమగా మాట్లాడి, స్నేహంగా గడిపారు. కొంతసేపు తరువాత ఆ మృగం వారు స్నేహంగా ఉన్నందుకు సంతోషిస్తూ, వారి చుట్టూ తిరిగింది. దేవత ప్రత్యక్షమై, ”మీ స్నేహం చాలా గొప్పది. మీరు ఈ పరీక్షను కూడా విజయవంతంగా పూర్తి చేశారు. ఇప్పుడు చివరి పరీక్షకు సిద్ధంగా ఉండండి” అని చెప్పింది. చివరి పరీక్ష జ్ఞానం. దేవత వారిని ఒక పెద్ద చెట్టు దగ్గరకు తీసుకెళ్ళింది. ఆ చెట్టుకి పెద్ద పండ్లు ఉన్నాయి. ఆ పండ్లను తింటే వారు జ్ఞానవంతులు అవుతారు. కానీ వాటిని తినటానికి ధైర్యం కావాలి.
దేవత ”ఈ పండ్లను తినాలి. కానీ మీరు నిజంగా జ్ఞానవంతులైతేనే వీటిని తినగలరు” అని చెప్పింది. రాము, రవి, గోపి పండ్లను చూసి ఆశ్చర్యపోయారు. రాము ముందుకు వెళ్ళి ”మనం ఈ పరీక్షను ఎదుర్కొనగలం. ఈ పండ్లను తినటానికి మనం సిద్దం” అన్నాడు. వారు పండ్లను తినటానికి సిద్ధమై, చెట్టు పండ్లను తినటం ప్రారంభించారు. కొంతసేపు తరువాత, వారు జ్ఞానవంతులుగా మారారు. దేవత వారికి ధన్యవాదాలు చెప్పి, ”మీరు ధైర్యం, సహనం, స్నేహం, జ్ఞానం అనే నాలుగు లక్షణాలూ కలిగి ఉన్నారు. మీరు ఇప్పుడు సురక్షితంగా బయటకు వెళ్ళవచ్చు. జీవితంలో ధైర్యం, సహనం, స్నేహం, జ్ఞానంతో ముందుకు సాగాలి” అని దీవెనలనందజేసింది. వారంతా దైర్యం, సహనం, స్నేహం, జ్ఞానం అనే అడవి దేవత నేర్పిన పాఠాల్ని జీవితాంతం అనుసరించారు. ఎంతో గొప్పగా జీవితంలో ఎదిగారు.

– డా|| చిట్యాల రవీందర్‌, 7798891795