సీఎంఆర్‌తో మిల్లర్ల వ్యాపారం

– గడువులోపు ఎఫ్‌సీఐకి బియ్యం ఇవ్వకుండా అడ్డదారుల్లో అక్రమార్జన
– ప్రతి సీజన్‌లోనూ కొత్త ధాన్యం నుంచే పాతలెక్కలకు జమ
– ప్రభుత్వ కండ్లుగప్పి నూకలుగా మార్చి అమ్మకాలు
– నోటీసులు ఇచ్చినా.. బ్లాక్‌లిస్టులో పెడతామన్నా వెరవని వైనం
– కలిసొస్తున్న మిల్లింగ్‌ సామర్థ్యానికి.. ధాన్యం దిగుబడులు
– 2022-23ఖరీఫ్‌లో 20శాతం కూడా దాటని సీఎంఆర్‌
– ఇప్పుడు మిల్లులకు చేరిన యాసంగి ధాన్యం
రాష్ట్రంలో మిల్లింగ్‌ సామర్థ్యానికి మించి వచ్చే లక్షల మెట్రిక్‌టన్నుల ధాన్యం మిల్లర్ల అక్రమ వ్యాపారానికి అవకాశంగా మారింది. ప్రతి సీజన్‌లోనూ గడువులోపు ఎఫ్‌సీఐకి కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ (సీఎంఆర్‌) ఇవ్వకుండా ప్రభుత్వ ధాన్యంతోనే కొందరు మిల్లర్లు వ్యాపారం సాగిస్తున్నారు. ప్రభుత్వ బియ్యాన్నే బహిరంగ మార్కెట్‌లో అమ్ముకుంటున్న మిల్లర్లు.. ఇప్పుడు బియ్యాన్ని నూకలుగా మార్చి అధికారులను ఏమార్చుతూ మరీ సొమ్ము చేసుకుంటున్నారు.
నోటీసులు ఇచ్చినా.. బ్లాక్‌లిస్టులో పెట్టినా..
ఏటా సీజన్ల వారీగా వచ్చే భారీ ధాన్యం దిగుబడులను మిల్లింగ్‌ సామర్థ్యం లేక మళ్లీ అవే మిల్లులకు అప్పగించాల్సిన పరిస్థితులు ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో మిల్లర్లకు కలిసొస్తోంది. ప్రస్తుతం 2022-23వానాకాలం సీజన్‌ సీఎంఆర్‌ ఇప్పటికీ 20శాతం కూడా ఎఫ్‌సీఐకి ఇవ్వలేదు. పైగా మొన్నటి యాసంగి కొనుగోళ్లూ పూర్తయి పెద్దఎత్తున మళ్లీ మిల్లులకు ధాన్యం చేరడం గమనార్హం.
అధికారికంగానే క్వింటాపై రూ.200 ఆర్జన
ప్రతి సీజన్‌లో ప్రభుత్వం నుంచి ధాన్యం తీసుకున్న మిల్లర్లు ఆరు నెలల్లోపు క్వింటాల్‌ ధాన్యానికి 68కిలోల బియ్యం చొప్పున వాపస్‌ ఇవ్వాలి. ఇందుకు ప్రభుత్వం ఒక్కో క్వింటా మిల్లింగ్‌ చేసినందుకు రూ.33 ఇస్తోంది. తవుడు, నూకలు, ఊక వంటిని మిల్లర్లకే అప్పగించడంతో అది అదనపు లాభంగా మారింది. ప్రస్తుతం మార్కెట్‌లో కిలో తవుడుకు రూ.50, కిలో నూకలకు రూ.15, ఊకకు కిలో రూ.5 చొప్పున ధర పలుకుతోంది. క్వింటా ధాన్యం మిల్లింగ్‌ చేస్తే కనీసం మూడు కిలోలపైనే తవుడు వస్తుంది. ఈ లెక్కన తవుడు, ఊక, నూక రూపంలోనే క్వింటాల్‌ ధాన్యంపై రూ. 180వరకు అదనంగా మిగులుతోంది. ఇక ప్రభుత్వం ఇచ్చే రూ.33 కలిపి రూ.200పైనే ఆదాయం వస్తోంది.
ఇప్పటివరకు మిల్లర్లు ఎఫ్‌సీఐకి అప్పగించిన
2022-23 వానాకాలం సీఎంఆర్‌
జిల్లా మిల్లులకు తిరిగి ఇవ్వాల్సిన ఇప్పటివరకూ
కేటాయించిన బియ్యం(మె.ట) ఇచ్చిన బియ్యం ధాన్యం (మె.ట) (మె.ట)
కరీంనగర్‌ 296900 198923 44979
సిరిసిల్ల 218420 146341 6583
జగిత్యాల 338000 226460 30000
పెద్దపల్లి 299757 200837 18904
నవతెలంగాణ – కరీంనగర్‌ ప్రాంతీయ ప్రతినిధి
పదేండ్ల నుంచి ఊహించని రీతిలో 90శాతం మేర విస్తీర్ణంలో వరి సాగవుతోంది. ప్రతి జిల్లా నుంచి సుమారు 4లక్షల మెట్రిక్‌టన్నుల ధాన్యం దిగుబడి వస్తోంది. ఆ దిగుబడులను ప్రభుత్వమే కొని మిల్లుల ద్వారా ఎఫ్‌సీఐకి కస్టమ్‌ మిల్లింగ్‌ చేసి ఇస్తోంది. సర్కారు ఇచ్చే ధాన్యం సహా మిల్లర్లూ నేరుగా రైతుల నుంచి ధాన్యాన్ని కొంటున్నారు. ఆ ధాన్యం నుంచి తీసిన బియ్యాన్ని బహిరంగ మార్కెట్‌లో అమ్ముకుంటున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వానికి సకాలంలో కస్టమ్‌ మిల్లింగ్‌ బియ్యం అప్పగించకుండా కొంత బయట మార్కెట్‌లో అమ్ముకుంటున్నారు. అందులోనూ రెండేండ్ల కిందటి సీజన్ల లెక్కల్లోనూ ప్రతి జిల్లా నుంచి కనీసంగా 5 నుంచి 10శాతం మేర సీఎంఆర్‌ లెక్కలు తేలడం లేదు. 2022-23వానాకాలం సీజన్‌కు సంబంధించిన సీఎంఆర్‌ మిల్లుల నుంచి 20శాతంలోపే ఎఫ్‌సీఐకి చేరింది. ఈ సీజన్‌ సీఎంఆర్‌ ఇచ్చేందుకు ఈ ఏడాది సెప్టెంబర్‌30 వరకు గడువు ఉన్నా.. మళ్లీ మొన్నటి యాసంగికి సంబంధించిన లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం మిల్లులకు చేరడం గమనార్హం.
సొమ్ము ఒకరిది.. సోకొకరిది..
ప్రతి ఖరీఫ్‌, యాసంగి సీజన్లలో కస్టమ్‌ మిల్లింగ్‌తోనే మిల్లర్లు వ్యాపారం సాగిస్తున్నారని స్పష్టం అవుతోంది. సాధారంగా ఒక సీజన్‌లో అప్పగించిన ధాన్యాన్ని సీఎంఆర్‌ రూపంలో ఆర్నెళ్లలో అందించాలి. కానీ రెండు సీజన్లు దాటినా పూర్తిస్థాయిలో పాత సీజన్‌ సీఎంఆర్‌ ఇవ్వడం లేదు. బహింగ మార్కెట్‌లోనే మిల్లర్లు నేరుగా అమ్ముకునే బియ్యంతోపాటే ప్రభుత్వానికి ఇచ్చే సీఎంఆర్‌ను కలిపి అమ్ముకుంటున్నారు. ఏటా ఎంతో కొంత బియ్యాన్ని ఇవ్వకుండా దాటవేస్తున్న మిల్లర్లకు గడువు ముగిసేలోపు మళ్లీ కొత్త సీజన్‌ పంట మిల్లుకు రావడం కలిసివస్తోంది. ఇలా ప్రతియేటా సీజన్‌ చివరి వరకూ సాగదీస్తూనే నిర్ధేశించిన గడువులోపు మిల్లర్లు బియ్యాన్ని అప్పగించకుండా సీఎంఆర్‌తో వ్యాపారం సాగించటం బహిరంగ రహస్యంగా మారింది. ప్రభుత్వం కండ్లుగప్పి సీఎంఆర్‌ దొరక్కుండా బియ్యాన్ని నూకలుగా మార్చి అమ్ముకుంటున్నట్టూ చర్చ సాగుతోంది.
నోటీసులు ఇచ్చినా.. బ్లాక్‌లిస్టులో పెట్టినా…
ప్రతిసారీ సీఎంఆర్‌ విషయంలో సివిల్‌ సప్లయి శాఖ నుంచి సదరు మిల్లర్లకు నోటీసులు ఇవ్వడం, బ్లాక్‌ లిస్టులో పెడుతామని హెచ్చరికలు జారీ చేయడం పరిపాటిగా మారింది. అసలు లెక్కకు రాని బియ్యంపై తేల్చాల్సిన సదరు శాఖ ఎందుకు నిర్లక్ష్యం చేస్తోందనేది అంతుచిక్కని వ్యవహారంగా మారింది. మిల్లింగ్‌ సామర్థ్యానికి మించి ప్రతి సీజన్‌లోనూ వస్తున్న ధాన్యం దిగుబడులతో తప్పని పరిస్థితుల్లో చర్యలు తీసుకున్నా.. మిల్లులకు మినహాయింపులు ఇస్తూ మళ్లీ కేటాయింపులు చేస్తున్నారనే చర్చ సదరు వర్గాల్లోనే సాగుతోంది. ఈ క్రమంలోనే గడువులోపు ఎఫ్‌సీఐకి బియ్యం అందించకుండా ఏటా నష్టాలు చవిచూస్తున్న ప్రభుత్వం కొన్ని చర్యలకు పూనుకుంటోంది. ప్రతి సీజన్‌లో ధాన్యం సేకరణ లక్ష్యాన్ని తగ్గించుకుంటోంది. కోత సమయానికి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకుండా కొంత పంట ప్రయివేటు పరమయ్యాక రంగంలోకి దిగుతోంది.