
– పొలిట్ బ్యూరో మాజీ సభ్యులు గట్టు ప్రసాద్ బాబు
నవతెలంగాణ – పెద్దవంగర
తెలంగాణలో టీడీపీకి మళ్లీ పూర్వ వైభవం తీసుకురావాలని పొలిట్ బ్యూరో మాజీ సభ్యులు, ఉమ్మడి వరంగల్ జిల్లా మాజీ అధ్యక్షుడు గట్టు ప్రసాద్ బాబు, జిల్లా నాయకులు దొనికెన కుమారస్వామి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో టీడీపీ మండల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. మండల అధ్యక్షుడు బైన బిక్షపతి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో వారు ముఖ్య అతిథిగా పాల్గొని, ప్రసంగించారు. రాష్ట్రంలోని బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడే పార్టీ టీడీపీ అన్నారు. స్వర్గీయ ఎన్టీఆర్ టీడీపీని స్థాపించి, పేదలకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేశాడని కొనియాడారు. ప్రజల వద్దకే పాలన తెచ్చిన ఘనత ఎన్టీఆర్ కే దక్కుతుందని ప్రశంసించారు. త్వరలోనే అన్ని గ్రామాల్లో పార్టీ సభ్యత్వాలను ప్రారంభించాలన్నారు. వార్డు స్థాయి నుంచి మండల స్థాయి వరకు అన్ని అనుబంధ కమిటీ లను వెంటనే నియామకం చేపట్టాలని సూచించారు. మండల అధ్యక్షుడు బిక్షపతి మాట్లాడుతూ..రాబోయే పంచాయతీ ఎన్నికల్లో అన్ని వార్డు లతో పాటుగా, సర్పంచ్ గా పోటీ చేయాలని పిలుపునిచ్చారు. కొన్ని అనివార్య కారణాల వల్ల పార్టీ కేడర్ లో నైరాశ్యం నెలకొన్నదని, రాష్ట్ర నాయకత్వం ముందుకు వస్తే పార్టీ శ్రేణులు కదం తొక్కేందుకు సిద్దంగా ఉన్నారని చెప్పారు. తెలంగాణ టీడీపీ ఇంచార్జి గా తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తినే నియమించాలని కోరారు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా రాబోయే రోజుల్లో సమన్వయంతో పని చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు పిట్టల శ్రీనివాస్, తొర్రూరు టీడీపీ మండల అధ్యక్షుడు బోగ భాస్కర్, నాయకులు సోమ వీరన్న, తాటిచెట్టు శ్రీను, పెద్ది అనిల్, ఆలేటి సోమయ్య, గద్దల నరేష్, ఐలపాక శ్రీకాంత్, బోనగిరి యాకన్న తదితరులు పాల్గొన్నారు.