ఒక దొంగ ఆ ఇంటిలోనికి ప్రవేశించాడు. వీధిలో కుక్కల అరుపులకు ఆ ఇంటి యజమాని మేల్కొన్నాడు. తనముందు కత్తితో నిలబడిన దొంగను చూసాడు.
”నేను ధనవంతుడిని కాను, మా ఇంటికి ఎందుకు వచ్చావు” అడిగాడు
”ఇప్పుడు సెల్‌ఫోన్ లేని ఇల్లు లేదు. సాయంత్రం నీ జేబులో కొత్త సెల్‌ఫోన్ లాగా కనబడింది. అందుకే మీ ఇంటికి వచ్చాను. రేపు మా అబ్బాయి పుట్టినరోజు. కానుకగా సెల్‌ఫోన్ అడిగాడు. అదిగో అక్కడున్న ఆ సెల్ ఫోన్ తీసుకొంటాను” అన్నాడు
”ఇంతకూ నీ కొడుకు ఏం చదువుతున్నాడు”
”ఎనిమిదవ తరగతి చదువుతున్నాడు. పుట్టిన రోజు కానుకగా సెల్‌ఫోన్ ఇమ్మన్నాడు”
ఒక చేతిలో కత్తిని చూపిస్తూ మరోచేతితో సెల్‌ఫోన్ తీసుకొంటున్న సమయాన కత్తి వున్న ఆ చేతిని గట్టిగా పట్టుకొన్నాడు ఇంటియజమాని. ఆ దొంగ చేతిని గట్టిగా ఆదమడంతో నొప్పిని భరించలేక చేతిలోని కత్తిని కింద పడేశాడు. ఆ ఇంటియజమాని కరాటే విద్య తెలిసినవాడవటం వలన సులభంగా దొంగ కాళ్ళు కట్టేశాడు.
”ఇది నా కొడుకు కోసం కొన్న స్మార్ట్ ఫోన్, వాడూ ఎనిమిదవ తరగతి చదువుతున్నాడు”.
”అయ్యా, మీరు మీ కొడుకుకు ప్రేమతో తీసిచ్చిన వస్తువును పోగొట్టుకొనడానికి మీరు ఇష్టపడక మీరు నాతో యుద్ధం చేశారు. నేనూ నా కొడుకు మీద ప్రేమతో ప్రాణాలకు తెగించి దొంగతనం చేయడానికి వచ్చాను. నన్ను క్షమించి వదిలేయండి. బహుమతి ఇవ్వలేకపోయినా నా కొడుకు పుట్టినరోజు ఎలాగోలా చేసుకొంటాను” అన్నాడు దొంగ
”ఈ స్మార్ట్ ఫోన్ పల్లెటూరిలో వున్న మా నాన్నగారికి రేపు వెళ్లి ఇచ్చి వస్తాను”
”మీరు కొత్త ఫోన్ కొన్నారా” అడిగాడు దొంగ
”ఆరునెలల క్రితం నా కొడుకు పుట్టిన రోజు కానుకగా తీసిచ్చాను. వాడు పూర్తిగా స్మార్ట్ ఫోను, వీడియో గేమ్స్‌కు బానిసయ్యాడు. ఆ తరువాత వాడి చదువు, ఆరోగ్యం బాగా దెబ్బతినింది. ఇప్పుడు వాడు ఆసుపత్రిలో వున్నాడు. పిల్లలకు పుట్టిన రోజు కానుకగా ఇలాంటివి తీసివ్వడం పెద్ద పొరపాటని గ్రహించాను. నా కొడుకు చదువు పూర్తి అయ్యేంతవరకు మా ఇంటికి స్మార్ట్ ఫోన్ రాదు. నీకొడుకు భవిష్యత్తు ఆ స్మార్ట్ ఫోన్ వలన దెబ్బతినగూడదనే నీకు ఇవ్వడానికి వ్యతిరేకించాను” అన్నాడు
”మీరు మంచి మనిషి. నా కొడుకు భవిష్యత్తు కోసం ప్రాణాలకు తెగించి నాతో యుద్ధం చేయడానికి సిద్ధపడ్డారు” అంటూ చేతులు జోడించాడు.
”పుట్టిన రోజుకానుకగా మీ అబ్బాయికి మంచి దుస్తులు కొనుక్కొనడానికి డబ్బులు ఇస్తాను” అంటూ కట్లు విప్పాడు ఇంటి యజమాని .
– ఓట్ర ప్రకాష్ రావు, 09787446026