నూతనంగా ‘300’ అమ్మ ఒడి వాహనాలు

కొత్తగా ‘204’ 108 వాహనాలు ,34 కొత్త పార్థివ వాహనాలు ఏర్పాటు :
మంత్రి హరీశ్‌ రావు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
జులై మొదటి వారంలోగా కొత్తగా 300 అమ్మఒడి వాహనాలను కొనుగోలు చేసి ఉపయోగంలోకి తేవాలని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌ రావు అధికారులను ఆదేశించారు. బుధవారం 108, 102 అమ్మఒడి వాహనాలు, పార్ధీవ వాహనాల పనితీరుపై మంత్రి సమీక్షించారు. అమ్మఒడి వాహనాల పనితీరును మంత్రి ప్రశంసించారు. కాలం చెల్లిన వాహనాలను తొలగించాలనీ, కొత్త వాహనాల్లో గర్భిణులకు అన్ని రకాల వసతులు అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అలాగే కాలం చెల్లిన 108 అంబులెన్సుల స్థానంలో కొత్తగా కొనుగోలు చేస్తున్న 204 అంబులెన్స్‌ల ప్రక్రియ త్వరగా పూర్తి చేసి జులై చివరి వారంలోగా అందుబాటులోకి తీసుకోని రావాలన్నారు. కొత్తగా 34 పార్థీవ వాహనాలు కూడా జులై చివరి నాటికి వాడకంలోకి రావాలని ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో వైద్యారోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, కుటుంబ సంక్షేమ కమిషనర్‌ శ్వేతామహంతి పాల్గొన్నారు.