– ఐపీఎల్ ప్రాంఛైజీలకు అనుకూలంగా వేలం రూల్స్
ముంబయి : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఆటగాళ్ల మెగా వేలం ముంగిట ప్రాంఛైజీలకు అనుకూలంగా నిబంధనలను సడలిస్తున్నారు. ఐదుగురు ఆటగాళ్లను అట్టిపెట్టుకునే (రిటెన్షన్) అవకాశంతో పాటు వేలంలో మరో ఆటగాడిని తిరిగి సొంతం చేసుకునేందుకు ఓ ఆర్‌టీఎం (రైట్ టూ మ్యాచ్) కార్డ్‌ను అందించనుంది. దీంతో ప్రాంఛైజీలు గరిష్టంగా ఆరుగురు క్రికెటర్లను తిరిగి జట్టులో నిలుపుకునే వీలుంది. నవంబర్ లేదా డిసెంబర్ రెండో వారంలో ఐపీఎల్ 2025 ఆటగాళ్ల వేలం నిర్వహించనున్నారు. ఈ మేరకు వేలం రూల్స్‌ను బీసీసీఐ, ఐపీఎల్ ఉన్నతాధికారులు రూపొందిస్తున్నారు. అట్టిపెట్టుకునే ఆటగాళ్లలో స్వదేశీ, విదేశీ ఆటగాళ్లపై ఏమైనా ఆంక్షలు ఉంటాయా అనేది తెలియాల్సి ఉంది. ప్రతి ప్రాంఛైజీ వేలంలో గరిష్టంగా రూ.115-120 కోట్ల ఖర్చు చేసేందుకు పర్సు పరిమితి పెంచనున్నారు. ఆదివారం బెంగళూర్‌లో ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం జరిగేందుకు అవకాశం ఉంది. బీసీసీఐ వార్షిక సర్వ సభ్య సమావేశం ముంగిట జరిగే ఈ భేటీలో వేలం రూల్స్‌కు తుది రూపు ఇవ్వటంతో పాటు ఆ నివేదికను ఏజీఎంకు సమర్పించనున్నారు. గతంలో ముగ్గురు ఆటగాళ్లను అట్టిపెట్టుకోవటం లేదా మూడు ఆర్‌టీఎం కార్డులు ఇచ్చేవారు. వేలంలో ప్రాంఛైజీ పర్సుకు సైతం రూ.90 కోట్ల పరిమితి ఉండేది.