ఢోకా.. దోఖా..

నేను బరితెగించాను
అయినా నమ్మకం కుదర్లా నీకు
మొన్న గుజరాత్‌, నిన్న కాశ్మీర్‌
నేడు మణిపూర్‌
మంటల్లో మండుతున్నా
నీకు నాపై ఆశచావదు.
విధ్వంసం సృస్టికర్తకే
విధ్వంసం ఆపమని విన్నపాలా..?
నా మౌనమే నీకు
అస్సలర్థమవడం లేదు.
నీ దేబిరింపులు
ప్రజాస్వామ్య మర్యాదలు
నా దగ్గరా…
నా పాత్ర నేను రంజుగా
రసవత్తరంగా పోషిస్తున్నాను
నీవే… గందరగోళంలో
మునిగి తేలుతున్నావు.
చాపం కింద నీరులా
నాలా పని చేయడం
చేత కాదు నీకు
నీకా తెలివి రానంతవరకు
నాకు ఢోకా లేదు.
… ….
నీది ఢోకాకాదు దోఖా…
దేవుని పేరిట ధర్మం పేరిట
నీ బాగోతాలు బూటకాలు
చరిత్ర చూస్తూనే ఉన్నది.

నేను పిపీలికాన్నే కావచ్చు
నా ఉచ్చులోనే ఉండొచ్చు.
నీతో పోరాడుతూనే
నిన్ను అంతం చేసే
తెలివి తెచ్చుకుంటాం
కచ్ఛితంగా…
– శైలి, 9959745723