బడ్జెట్‌లో ఓయూకు రూ.1000 కోట్లు కేటాయించాలి

– ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు అర్‌.ఎల్‌.మూర్తి
– ఓయూలో సంతకాల సేకరణ
నవతెలంగాణ-ఓయూ
ఉస్మానియా యూనివర్సిటీకి రాష్ట్ర బడ్జెట్‌లో రూ.1000 కోట్లు కేటాయించాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు అర్‌.ఎల్‌.మూర్తి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు హైదరాబాద్‌ ఓయూలో శనివారం ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా మూర్తి మాట్లాడుతూ.. ఓయూకు ప్రభుత్వం కేటాయించే నిధులు వేతనాలు ఇవ్వడానికి మాత్రమే సరిపోతున్నాయని, యూనివర్సిటీలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలకూ నోచుకోవడం లేదన్నారు. యూనివర్సిటీని నడిపించడానికి అధికారులు విద్యార్థుల మీద ఫీజుల భారం వేసే పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అన్ని యూనివర్సిటీల పరిస్థితీ ఈ విధంగానే ఉందని, రోజురోజుకు అవి నిర్వీర్యానికి గురవుతున్నాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం కూడా విద్యారంగానికి కేటాయించిన బడ్జెట్‌ 2.4 శాతం మాత్రమేనని గుర్తు చేశారు. మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతామని చెప్పారు. సీఎం రాష్ట్రంలో విద్యారంగ పరిరక్షణ కోసం 30 శాతం నిధులు కేటాయించి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్‌ చేశారు. యూనివర్సిటీలపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించి వాటి సమగ్ర అభివృద్ధి కోసం తగిన కార్యాచరణ సిద్ధం చేయాలని కోరారు. యూనివర్సిటీలో చదివే ప్రతి విద్యార్థికీ ఉచిత మెస్‌, స్కాలర్‌షిప్‌, ఫెలోషిప్‌ కూడా అందించే విధంగా తగిన బడ్జెట్‌ కేటాయించాలన్నారు. ఓయూ అధ్యక్ష కార్యదర్శులు ఆంజనేయులు, రవి మాట్లాడుతూ.. ఓయూకు నిధులు కేటాయించకపోతే అన్ని విద్యార్థి సంఘాలతో కలిసి ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. సంతకాల సేకరణలో ఎస్‌ఎఫ్‌ఐ ఓయూ ఉపాధ్యక్షులు శ్రీను, పవన్‌, సహాయ కార్యదర్శి కృష్ణ, అశ్విని, నాయకులు రమ్య, ప్రొఫెసర్లు పాల్గొన్నారు.