– జగదాంబికా అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రులు
– సబ్బండ వర్గాలకు పెద్ద పీట
– బోనాల పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు
నవతెలంగాణ-మెహదీపట్నం
గోల్కొండ కోట బోనమెత్తింది. డప్పు చప్పుల్ల హౌరు, శివసత్తుల పూనకాలు, పోతరాజుల నృత్యాలు.. యువత కేరింతలతో రాష్ట్రానికి ప్రత్యేకమైన బోనాల పండుగ ఉత్సవాలు గురువారం హైదరాబాద్ గోల్కొండలో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. తెలంగాణ సంస్కృతికి, సంప్రదాయాలకు అద్దం పట్టే బోనాల ఉత్సవాలు చారిత్రక కోట గోల్కొండ నుంచి తొలి బోనం బయలుదేరడంతో షురూ అయ్యాయి. దాంతో నగరంలో నెల రోజులపాటు జరగనున్న ఆషాఢ మాసం బోనాల జాతర ఉత్సవాలకు అంకురార్పణ జరిగింది. మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ లంగర్‌హౌస్ చౌరస్తా వద్ద బంగారు బోనానికి దీపం వెలిగించి పూజలు నిర్వహించారు. అనంతరం ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ఊరేగింపును ప్రారంభించారు. ఉత్సవ విగ్రహాలకు ఆలయ కమిటీ సభ్యులు, ప్రధాన అర్చకుల ఇంట్లో పూజలు నిర్వహించారు. లంగర్ హౌస్ నుంచి ప్రారంభమైన రథం, తొట్టెల ఊరేగింపు కోటలోని జగదాంబికా ఆలయం వరకు సాగింది. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ.. బోనాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం 2014 నుంచి 2022 వరకు రూ.78 కోట్లు కేటాయించిందని తెలిపారు. బోనాల పండుగ ముందు రోజే తొలకరి పలకరింపు శుభదాయకం అన్నారు. అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్రమంతా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం రాకముందు ఈ బోనాల జాతర తక్కువ మందితో ప్రారంభమయ్యేదని, నేడు లక్ష మందికి పైగా ప్రజలు గోల్కొండ బోనాల జాతరలో పాల్గొనేందుకు వస్తున్నారని తెలిపారు. బోనాల ఉత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 15 కోట్లు కేటాయించిందని చెప్పారు. దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాలతో పాటు ఇతర ఆలయాలకు కూడా ఆర్థిక సహాయం చేస్తున్నట్టు తెలిపారు.
సబ్బండ వర్గాలకు పెద్ద పీట
బోనాల పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు
గోల్కొండ ఆషాడ బోనాల పండుగ ప్రారంభం సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు రాష్ట్ర ప్రజలకు గురువారం శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పే బోనాలను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నదనీ, తద్వారా సబ్బండ వర్గాల సంస్కతికి పెద్దపీట వేసిందని తెలిపారు. డప్పులు, మేళ తాళాల నడుమ మహిళలు బోనమెత్తుకుని భక్తిశ్రద్ధలతో అమ్మవారికి బోనం సమర్పిస్తారని పేర్కొన్నారు. తర తరాల తెలంగాణ సాంస్కృతిక ఆధ్యాత్మిక అస్థిత్వానికి బోనాల పండుగ ప్రతీకగా నిలిచిందని తెలిపారు. ఈ పండుగ ప్రారంభం సందర్భంగా వాన చినుకుల రూపంలో మనందరిమీద అమ్మవారు కరుణాకటాక్షాలు కురిపిస్తుండడం శుభసూచకమన్నారు. అమ్మవారి ఆశీస్సులు, దీవెనలు రాష్ట్ర ప్రజలపై ఎల్లవేళలా కొనసాగుతూనే ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా, దేశవ్యాప్తంగా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని పేర్కొన్నారు.