రోడ్డున పడ్డ విద్యార్థులు..!

– 5 వేల మంది భవిత ఆగమ్యగోచరం
– ఏడాది చదువులు కోల్పోయినట్టేనా?
– అనుమతి లేకుండానే అడ్మిషన్లు
– ఇంకా మోసం చేస్తున్న శ్రీనిధి, గురునానక్‌
– పర్మిషన్‌ వస్తుందంటూ బుకాయింపు
– నోటీసులిచ్చి చేతులు దులుపేసుకున్న విద్యాశాఖ
– గవర్నర్‌ ఆమోదానికి మళ్లీ బిల్లును పంపిన ప్రభుత్వం
– మాకు న్యాయం చేయాలి : విద్యార్థులు, తల్లిదండ్రులు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో అనుమతి లేకుండానే అడ్మిషన్లు చేపట్టి విద్యార్థుల జీవితాలతో ప్రయివేటు విశ్వవిద్యాలయాలు చెలగాటమాడుతున్నాయి. తీరా వాటికి అనుమతి లేదని తెలియడంతో సుమారు ఐదు వేల మంది విద్యార్థుల బతుకులు రోడ్డున పడ్డాయి. వారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఏడాది చదువులు వృధా అవుతున్నాయన్న ఆవేదనతో లబోదిబోమంటున్నారు. 2022-23 విద్యా సంవత్స రంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి రాకుండానే శ్రీనిధి, గురునానక్‌ ప్రయివేటు విశ్వవిద్యాలయాలు అడ్మిషన్లు చేపట్టాయి. నిబంధనలకు యధేచ్చగా తిలోదకాలిచ్చిన ఆయా వర్సిటీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. అనుమతి వస్తుందంటూ అబ ద్ధపు ప్రచారం చేస్తూ ఇంకా నమ్మించాలని చూస్తు న్నాయి. అనుమతి లేకున్నా ఇంజినీరింగ్‌ కోర్సుకు ఏడాదికి రూ.రెండు లక్షలు, హాస్టల్‌ ఫీజు ఒకేసారి రూ.80 వేలు కట్టాలంటూ గురునానక్‌ యాజ మాన్యం విద్యార్థులు, తల్లిదండ్రులను ఆదేశించింది. దీంతో హాస్టల్‌ ఫీజు మొత్తం, కోర్సు ఫీజులో సగానికిపైగా అందరూ చెల్లించారు. ఈ క్రమంలో తమ పరీక్షల సంగతేంటని విద్యార్థులు, వారి భవిష్యత్తేంటని తల్లిదండ్రులు యాజమాన్యాన్ని ప్రశ్నిస్తున్నారు. ఈనెల 21వ తేదీ వరకు అనుమతి వస్తుందంటూ యాజమాన్యం చెప్పింది. తీరా రాకపోవడంతో గురువారం విద్యార్థులు, తల్లిదండ్రులు మళ్లీ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం వద్ద ఉన్న గురునానక్‌ ప్రయివేటు విశ్వవిద్యాలయం వద్ద ధర్నాకు దిగారు. అయితే ఈ విషయాన్ని ముందే తెలుసుకున్న యాజమాన్యం భారీగా పోలీసులను మోహరించింది. దీంతో అక్కడ టెన్షన్‌ వాతావరణం ఏర్పడింది. కొందరు విద్యార్థులు, తల్లిదండ్రులను అరెస్టు చేశారు. అయితే ఇప్పుడు కూడా అనుమతి వస్తుందంటూ మళ్లీ మోసపూరితమైన మాటలు యాజమాన్యం చెప్తున్నది. దాన్ని నమ్మలేమంటూ విద్యార్థులు, తల్లిదండ్రులు తేల్చిచెప్పారు. దీంతో ఆ వర్సిటీల యాజమాన్యం డైలమాలో పడింది.
అడ్మిషన్లు ఎలా చేపట్టారు? : విద్యాశాఖ నోటీసు
రాష్ట్రంలో 2021-22 విద్యాసంవత్సరంలో మహీంద్రా, మల్లారెడ్డి, వాక్సన్‌, అనురాగ్‌, ఎస్‌ఆర్‌ విద్యాసంస్థలు ప్రయివేటు విశ్వవిద్యాలయాలను నెలకొల్పాయి. వాటిలో మూడు విద్యాసంవత్సరాలుగా ప్రవేశాలు జరుగుతున్నాయి. 2022, సెప్టెంబర్‌ 13న రాష్ట్రంలో మరో ఐదు ప్రయివేటు విశ్వవిద్యాలయాలను నెలకొల్పుతూ ప్రవేశపెట్టిన బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. అందులో శ్రీనిధి విశ్వవిద్యాలయం (ఘట్‌కేసర్‌), గురునానక్‌ విశ్వవిద్యాలయం (ఇబ్రహీంపట్నం), నిక్‌మర్‌ కన్‌స్ట్రక్షన్‌ విశ్వవిద్యాలయం (శామీర్‌పేట), ఎంఎన్‌ఆర్‌ విశ్వవిద్యాలయం (సంగారెడ్డి), కావేరి విశ్వవిద్యాలయం (గౌరారం) ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ బిల్లును గవర్నర్‌ ఆమోదం కోసం పంపించింది.
కానీ ఆమె ఆమోదించలేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. గవర్నర్‌ వద్ద పెండింగ్‌లో ఉన్న బిల్లులపై వెంటనే నిర్ణయం తీసుకోవాలంటూ న్యాయస్థానం ఆదేశించింది. దీంతో ప్రయివేటు విశ్వవిద్యాలయాల బిల్లును గవర్నర్‌ తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించారు. ఎలాగైనా అనుమతి వస్తుందని భావించి శ్రీనిధి, గురునానక్‌ విశ్వవిద్యాలయాలు ప్రస్తుత విద్యాసంవత్సరంలో అడ్మిషన్లు చేపట్టాయి. వేలాది మంది విద్యార్థులు వివిధ కోర్సుల్లో ప్రవేశం పొందారు. తీరా అనుమతి రాకపోవడంతో వారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. లక్షల రూపాయల డబ్బు, ఏడాది కాలం వృధా అయ్యింది. అయితే అనుమతి లేకుండా అడ్మిషన్లు ఎలా చేపట్టారంటూ గురునానక్‌, శ్రీనిధి ప్రయివేటు విశ్వవిద్యాలయాలను ఉన్నత విద్యాశాఖ ప్రశ్నించింది. వివరణ ఇవ్వాలంటూ ఇటీవల నోటీసులు జారీ చేసింది. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులతో ఆయా వర్సిటీల యాజమాన్యాలు మే 31న సమావేశాలను నిర్వహించాయి. ఈనెల 21 నాటికి అనుమతి వస్తుందంటూ చెప్పాయి. ఫీజు తిరిగి చెల్లిస్తామనీ, సర్టిఫికెట్లు ఇస్తామని, ఇష్టమైన విద్యార్థులు తీసుకెళ్లొచ్చని యాజమాన్యాలు చెప్పినట్టు తెలిసింది. ఇంకోవైపు అనురాగ్‌, మల్లారెడ్డి ప్రయివేటు విశ్వవిద్యాలయాల్లో అడ్మిషన్లు ఇప్పిస్తామని, వాటిలోనే పరీక్షలు రాసేందుకు అనుమతి ఉంటుందని ఇంకో ప్రతిపాదన చేసినట్టు సమాచారం.
అయితే దాన్ని విద్యార్థులు, తల్లిదండ్రులు నమ్మలేమంటూ చెప్పారు. దీంతో వారిని అనురాగ్‌ వర్సిటీ సీఈవో నీలిమ వద్దకు తీసుకెళ్లి చర్చించారు. అయితే వారంరోజుల్లో నిర్ణయం తీసుకుని చెప్తామంటూ వారిని ఆమె సమాధానమిచ్చాయి. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ప్రయివేటు వర్సిటీల బిల్లును మళ్లీ గవర్నర్‌ ఆమోదానికి పంపించినట్టు సమాచారం. గవర్నర్‌ నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.
న్యాయం చేయాలి : విద్యార్థులు, తల్లిదండ్రులు
శ్రీనిధి, గురునానక్‌ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం పొందిన తమకు రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేయాలని విద్యార్థులు,వారి తల్లిదండ్రులు డిమాండ్‌ చేస్తున్నా రు. ఏడాది కాలం వృధా కాకుండా చర్యలు తీసుకో వాలని కోరుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ జోక్యం చేసుకుని తమ భవిష్యత్తును కాపాడాలని, పరీక్షలు నిర్వహించి న్యాయం చేయాలని సూచిస్తున్నారు.
ఆ యాజమాన్యాలపై క్రిమినల్‌ కేసులు పెట్టాలి : డీవైఎఫ్‌ఐ
శ్రీనిధి, గురునానక్‌ ప్రయివేటు విశ్వవిద్యాల యాలు అనుమతి లేకుండా అడ్మిషన్లు చేపట్టడం ఎంత వరకు సమంజసమని డీవైఎఫ్‌ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎండీ జావీద్‌ ప్రశ్నించారు. విద్యార్థులు, తల్లిదండ్రులను మోసం చేసిన ఆ యాజమాన్యాలపై క్రిమినల్‌ కేసులు పెట్టాలని, కఠిన చర్యలు తీసుకోవాలని గురువారం ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని ప్రభుత్వాన్ని కోరారు.