మౌనంగా..దూరంగా…

– ఇంటింటికీ బీజేపీలో కనిపించని ఈటల, రాజగోపాల్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
బీజేపీలో బండి దూకుడు పెరుగుతుండగా…ఈటల రాజేందర్‌ ఎక్కడా కనిపించడం లేదు. ప్రధానిగా నరేంద్ర మోడీ 9 ఏండ్ల పాలనలో అభివృద్ధిని గురించి చెప్పేందుకు ఇంటింటికీ బీజేపీ కార్యక్రమానికి పార్టీ పిలుపునిచ్చింది. ముఖ్యనేతలంతా తమ తమ నియోజకవర్గాల్లో పాల్గొనప్పటికీ ఈటల రాజేందర్‌, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మాత్రం కనిపించలేదు. అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మను కలిసి వచ్చినప్పటి నుంచి ఈటల రాజేందర్‌ మౌనంగానే ఉంటున్నారు. ఒకప్పుడు ఎక్కడికెళ్లినా హంగూఆర్భాటం ప్రదర్శించే ఈటల రాజేందర్‌ కొంత కాలంగా గుంభనంగా ఉంటున్నారు. తెలంగాణలో ఈటలకు ప్రచార కమిటీ చైర్మెన్‌గా బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం పెద్దఎత్తున జరగ్గా…బండి గ్రూపులోని నేతలంతా ఒక్కటై జితేందర్‌రెడ్డి ఇంట్లో ఈటలకు వ్యతిరేకంగా భేటీ అయిన విషయం తెసిందే. ప్రచార కమిటీ చైర్మెన్‌ పదవే లేదంటూ పెదవి విరిస్తూ ఖండించిన విషయం తెలిసిందే. ఈ విషయంలో అధిష్టానం జోక్యం చేసుకుని పదవుల విషయంపై ఎవ్వరూ మాట్లాడొద్దని అల్టిమేటం జారీ చేసింది. అప్పటి నుంచి కినుక వహించిన ఈటల బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అడుగు కూడా పెట్టడం లేదు. పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా మాట్లాడటం లేదు. స్వతంత్ర సంస్థలు, దుబాయి బాధితుల సంఘం పెట్టిన సమావేశాలకు మాత్రమే హాజరవుతున్నారు. పొలిటికల్‌గా ఎక్కడా నోరెత్తడం లేదు. బండి చాలెంజ్‌గా తీసుకుని మరీ ‘ఇంటింటికీ బీజేపీ’ కార్యక్రమం ద్వారా అన్ని నియోజకవర్గాల్లో ప్రజలకు మోడీ తొమ్మిదేండ్ల పాలన గురించి వివరించాలని పిలుపునిచ్చారు. కానీ, గురువారం ఆ కార్యక్రమానికి ఈటల దూరంగా ఉన్నారు. ‘ఈటల పార్టీలో ఎన్నికల దాకా ఉంటాడా? కాంగ్రెస్‌ పార్టీలోకి పోతాడా?’ అన్న చర్చ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలోనే జరుగుతున్నది. మరోవైపు ఆయన కాంగ్రెస్‌ పార్టీలో చేరితే.. డిప్యూటీ సీఎంతో పాటు కోరిన పోర్ట్‌ఫోలియో కేటాయించేందుకు ఆ పార్టీ అధిష్టానం సుముఖంగా ఉన్నట్టు కూడా ప్రచారం జరుగుతున్నది. దీంతో ఆయన కాంగ్రెస్‌ వైపు వెళ్తే బాగుంటుందనే ఆలోచనలో పడ్డట్టు తెలిసింది. ఇదిలా ఉండగా, బీజేపీ పట్ల రాజగోపాల్‌రెడ్డి కూడా అనాసక్తి చూపుతున్నారు. మునుగోడు నియోజకవర్గంలో ఇంటింటికీ బీజేపీ కార్యక్రమంలో ఎక్కడా పాల్గొనలేదు. ఇప్పటికే తన అనుచరుల వద్ద త్వరలో కాంగ్రెస్‌ పార్టీలో చేరబోతున్నట్టు స్పష్టం చేసినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. అందులో భాగంగానే బుధవారం సాయంత్రం తన తమ్ముడు రాజగోపాల్‌రెడ్డితో వెంకట్‌రెడ్డి సుధీర్ఘంగా సమావేశం అయ్యారు. ఎన్నికల సమయంలో హడావిడిగా పార్టీ మారితే కార్యకర్తలు, ప్రజలు అంత త్వరగా రీసివ్‌ చేసుకోరనే భావనతో నెలరోజుల్లోపే కాంగ్రెస్‌లో చేరాలని రాజగోపాల్‌రెడ్డి భావిస్తున్నట్టు అతని సన్నిహిత వర్గాల ద్వారా తెలిసింది.