మహారాష్ట్ర సచివాలయం మూడో అంతస్తు నుండి దూకిన

– డిప్యూటీ స్పీకర్‌ మరో ముగ్గురు సభ్యులు
ముంబయి : మహారాష్ట్ర సెక్రటేరియట్‌లో శుక్రవారం అనూహ్యమైన సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. ఎస్‌టి కేటగిరీలోకి ఒక కమ్యూనిటీని చేరుస్తున్నందుకు నిరసనగా మహారాష్ట్ర డిప్యూటీ స్పీకర్‌ నరహరి జిర్వాల్‌, మరో ముగ్గురు ఎంఎల్‌ఎలు అకస్మాత్తుగా రాష్ట్ర సచివాలయం మూడో అంతస్తు నుండి కిందకు దూకారు. అయితే మొదటి అంతస్తు వద్ద వున్న సేఫ్టీ నెట్‌లో వారు పడడంతో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ప్రమాదాలు నివారించేందుకు 2018లో ఈ నెట్‌ను ఏర్పాటు చేశారు. అజిత్‌ పవార్‌ వర్గమైన నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్‌సిపి)కి చెందిన జిర్వాల్‌, బిజెపి ఎంపి సహా ముగ్గురు సభ్యులు సెక్రటేరియట్‌ భవనం పై నుండి దూకాలని నిర్ణయించుకున్నారు. ధన్‌గడ్‌ కమ్యూనిటీని ఎస్‌టి కేటగిరీలో చేర్చాలన్న డిమాండ్‌ను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. దీన్ని వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. నెట్‌లోకి పడిన తర్వాత వారు తిరిగి వెనక్కి వెళ్ళేందుకు చేస్తున్న ప్రయత్నాలు వీడియోలో కనిపిస్తున్నాయి. అంతకుముందు కొంతమంది గిరిజన ఎంఎల్‌ఎలు సచివాలయమైన మంత్రాలయ కాంప్లెక్స్‌లో కేబినట్‌ె సమావేశం జరుగుతుండగా నిరసన నిర్వహించారు. రాష్ట్రంలోని ధనగడ్‌ కమ్యూనిటీ ప్రస్తుతం ఇతర వెనుకబడిన తరగతులు (ఒబిసి) కేటగిరీలో వుంది. తమన ఎస్‌టి కేటగిరీలో చేర్చాలని ఆ సభ్యుల్లో కొంతమంది డిమాండ్‌ చేస్తూ ఆందోళనలు చేస్తున్నారు. అనేక రాష్ట్రాల్లో ధన్‌గడ్‌లు ఎస్‌టిలుగా వున్నారని, తమను కూడా అందులో చేర్చాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.