క్యాన్సర్‌ను జయించిన వారికి రెనోవ సౌమ్య ఆస్పత్రి సన్మానం

నవతెలంగాణ-కంటోన్మెంట్‌
వివిధ రకములైన క్యాన్సర్‌ బారిన పడి కార్ఖానా రెనోవా సౌమ్య క్యాన్సర్‌ హాస్పిటల్‌లో వ్యాధిని జయించిన విజేతలను ప్రపంచ క్యాన్సర్‌ దినోత్సవాన్ని పురస్కరించుకొని రెనోవా సౌమ్య క్యాన్సర్‌ హాస్పిటల్‌లో శనివారం ప్రత్యేకంగా సన్మానించారు. కార్యక్రమంలో ముందుగా క్యాన్సర్‌ను జయించిన ఆర్‌ మల్లిక (రొమ్ము క్యాన్సర్‌), చిన్న మల్లయ్య (బ్లడ్‌ క్యాన్సర్‌), అక్కిశెట్టి (ప్రొస్టేట్‌ క్యాన్సర్‌), ఎ గిరిజ (రొమ్ము క్యాన్సర్‌), సంధ్య గోస్వామి (హెడ్‌ అండ్‌ నెక్‌), హిమబిందు (బోన్‌ క్యాన్సర్‌) లకు హాస్పిటల్‌ వైద్యులు, సిబ్బంది ప్రత్యేకంగా సన్మానించారు. ఈ సందర్భంగా డైరెక్టర్‌ అండ్‌ ఛీఫ్‌ ఆఫ్‌ మెడికల్‌ ఆంకాలజీ సర్వీసెస్‌ డా. పాలంకి సత్య దత్తాత్రేయ మాట్లాడుతూ క్యాన్సర్‌ వ్యాధికి నేడు పలు ఆధునిక చికిత్సలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. శస్త్ర చికిత్సతో పాటూ మందులను వినియోగించి అందించే కీమో థెరపీ చికిత్సలతో క్యాన్సర్‌ను నయం చేయవచ్చని తెలిపారు. దీంతో పాటూ అవసరమైన వారికి రేడియేషన్‌ థెరపీ కూడా ఇవ్వడం జరుగుతుందన్నారు. క్యాన్సర్‌ వ్యాధిపై పోరాటమనేది కేవలం రోగి లేదా వైద్యుడు కలసి చేసేది కాదని అందుకు కుటుంబ సభ్యులు, ఇతర వైద్య, నర్సింగ్‌ సిబ్బంది సహకారం ఎంతో ముఖ్యమని అన్నారు. అనం తరం హెచ్‌ఓడీ డా. యుగందర్‌ శర్మ, సీనియర్‌ కన్సల్టెంట్‌ రేడి యేషన్‌ ఆంకాలజిస్ట్‌ వారు మాట్లాడుతూ రేడియేషన్‌ థెరపీ పై ఎన్నో అపోహలు ఉన్నాయన్నారు. క్యాన్సర్‌ వస్తే బతకరనే భావ న ఉందని కానీ అది తప్పన్నారు. వ్యాధి గుర్తించిన వెంటనే మంచి వైద్యుని సంప్రదించి మంచి చికిత్స తీసుకొంటే తప్పక వ్యాధిని జయించవచ్చని తెలిపారు. అనంతరం క్యాన్సర్‌ విజేత ఏ గిరిజ మాట్లాడుతూ వ్యాధి వచ్చిన తర్వాత మనకు ఏర్పడిన అనుభవాలను ఇతరులతో పంచుకొని తద్వారా వారికి ధైర్యం చెప్పడమనేది ఎంతో ముఖ్యమన్నారు. క్యాన్సర్‌ వచ్చిన తర్వాత రోగికి తనపై తనకు నమ్మకం ఉంచుకోవాలని వైద్యుని సూచనలు తప్పక పాటించాలని సూచించారు. తర్వాత రొమ్ము క్యాన్సర్‌ ను జయించిన ఆర్‌ మల్లిక మాట్లాడుతూ వ్యాధి వచ్చిన వెంటనే కంగిపోకుండా సరైన చికిత్స తీసుకోవడం ఎంతో అవసరమని తెలిపారు అలాగే పలువురు విజేతలు క్యాన్సర్‌ వ్యాధి గురించి చికిత్స గురించి మాట్లాడారు కార్యక్రమంలో రెనోవా సౌమ్య క్యాన్సర్‌ హాస్పిటల్‌ కన్సల్టెంట్‌ రేడియేషన్‌ ఆంకాలజిస్టు డా. లలితా రెడ్డి, సెంటర్‌ హెడ్‌, ఛీఫ్‌ ఆఫ్‌ టెక్నాలజీ జనార్థన్‌ నందిగాం, ఇతర వైద్యులు, పారా మెడికల్‌ సిబ్బంది, నర్సింగ్‌ సిబ్బంది, మార్కెటింగ్‌ సిబ్బంది పాల్గొన్నారు.