నోటి దుర్వాసనా..?

నోటి దుర్వాసనా..?రోజువారీ జీవితంలో మనకు తెలియకుండానే మనలో కనిపించే ప్రధానమైన సమస్య నోటి దుర్వాసన. మనం గుర్తించలేకపోయినా అవతలివ్యక్తులు ఇబ్బంది పడుతుంటారు. దీనికి ప్రధాన కారణం పళ్లు, నాలుకలో పేరుకున్న వ్యర్ధాలే. మార్కెట్‌లో లభించే టూత్‌ పేస్టుల కంటే హోమ్‌మేడ్‌ టూత్‌ పేస్టులే అద్భుతంగా పనిచేస్తాయి.
చాలామంది బాహ్య శుభ్రతకు అంటే స్నానం చేసి బయటకు అందంగా, ఆరోగ్యంగా ఉండేందుకు ప్రయత్నిస్తుంటారు. అయితే నోటి శుభ్రతకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వరు. బ్రష్‌ చేస్తే సరిపోతుందనుకుంటారు. కానీ బ్రష్‌ చేయడం వల్ల నోరు శుభ్రం కానేకాదు. నోటి దుర్వాసన నుంచి ఉపశమనం పొందేందుకు మౌత్‌ వాష్‌ మంచి పరిష్కారం. దీనికోసం మార్కెట్‌లో లభించే వివిధ రకాల మౌత్‌ వాష్‌లు అవసరం లేదు. ఇంట్లోనే వంటింటి చిట్కాలతో మౌత్‌ వాష్‌ తయారు చేసుకోవచ్చు. అది ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
మౌత్‌ వాష్‌ తయారీ ఇలా
ఒక కప్పు అలోవెరా జ్యూస్‌, నీరు, 2-3 లవంగాలు అవసరమౌతాయి. ముందుగా నీళ్లలో అల్లోవెరా జ్యూస్‌ కలిపి కాసేపు అలానే ఉంచాలి. దాదాపు 20 నుంచి 25 నిమిషాల తరువాత ఈ మిశ్రమాన్ని ఓ గిన్నెలో తీసుకుని అందులో 2-3 లవంగాలు వేయాలి. అంతే మీ మౌత్‌ వాష్‌ తయారైనట్టే. ప్రతిరోజూ బ్రష్‌ చేసిన తరువాత ఈ హౌమ్‌మేడ్‌ మౌత్‌ వాష్‌ వాడితే మంచి ఫలితాలుంటాయి.
మౌత్‌ వాష్‌తో లాభాలు
మౌత్‌ వాష్‌ చేయడం వల్ల పళ్లలో దుర్వాసన పోవడమే కాకుండా నాలుకపై ఉన్న వ్యర్ధం కూడా తొలగిపోతుంది. హౌమ్‌మేడ్‌ మౌత్‌ వాష్‌లో విటమిన్‌ ఎ, విటమిన్‌ సి, విటమిన్‌ ఇ, కోలిన్‌ బి1, కోలిన్‌ బి2 లు పుష్కలంగా ఉంటాయి. ఇవి పళ్ల దుర్వాసనను పోగొడతాయి. మీ నోరు దుర్వాసన లేకుండా ఉండాలంటే రోజూ క్రమం తప్పకుండా మౌత్‌ వాష్‌ తప్పనిసరి.