అందరూ ఎంతో ఉత్సాహంగా జరుపుకునే పండుగ దీపావళి. ఈ పండుగంటే ముందుగా గుర్తుకొచ్చేది టపాసుల మోత, తీపి వంటకాల ఘుమఘుమలు. ఈ పండుగకు స్వీట్స్‌ను ఎక్కువగా చేసుకుంటారు. ఒకరికొకరు ఇచ్చిపుచ్చు కుంటారు. ఇంట్లో వారి కోసం ప్రత్యేకంగా ట్రెడీషనల్ స్వీట్స్ చేస్తారు. అయితే కొన్ని ఫేమస్ స్వీట్స్‌ను ఇంట్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ దీపావళికి తక్కువ సమయంలో చేసుకునే కొన్ని తీపి వంటకాల గురించి నేటి మానవిలో…
ఖర్జూర పాయసం
కావలసిన పదార్థాలు : ఖర్జూరాలు – పదిహేను, బాదం పప్పులు – గుప్పెడు, పాలు – మూడు కప్పులు, చక్కెర – రెండు స్పూన్లు, యాలకుల పొడి – అర స్పూను, పిస్తాలు – గుప్పెడు,
తయారీ విధానం : ఖర్జూరాల్లోంచి విత్తనాలు తీసి సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. అలాగే పిస్తాలు, బాదం పప్పులు కూడా వేసి సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో పాలు వేసి వేడి చేయాలి. ఆ వేడి పాలలోనే సన్నగా తరిగిన ఖర్జూరాలు, పిస్తా, బాదం పప్పులను వేసి కాసేపు మరగనివ్వాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని బాగా నాననివ్వాలి. ఈ లోపు స్టవ్ మీద చిన్న కళాయి పెట్టి నెయ్యి వేయాలి. ఆ నెయ్యిలో బాదం, కొన్ని పిస్తాలను రంగు మారేవరకు వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలో మూడు కప్పుల పాలను వేసి మరిగించాలి. పాలు మరిగి కాస్త చిక్కబడే వరకు అలా ఉంచాలి. తర్వాత నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ తో పాటు పాలను కూడా అందులో వేసి కలుపుకోవాలి. దీన్ని మెత్తగా ఉడికించుకోవాలి. చక్కెరను కూడా వేసి బాగా కలుపుకోవాలి. యాలకుల పొడిని కూడా జోడించాలి. ఇప్పుడు ముందుగా వేయించుకున్న బాదం తరుగు, పిస్తా తరుగును పైన చల్లుకొని స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే టేస్టీ ఖర్జూర పాయసం రెడీ అయినట్టే. ఇది ఆరోగ్యం కూడా.
జీడిపప్పు హల్వా
కావలసిన పదార్థాలు: జీడిపప్పు – ఒక కప్పు, పాలు – రెండు కప్పులు, పంచదార – ఒక కప్పు, యాలుకలు – 2-3, నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు
తయారీ విధానం: ముందుగా జీడిపప్పును ఒక నాన్-స్టిక్ పాన్‌లో వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. వేయించిన జీడిపప్పును మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. ఒక పాత్రలో పాలు పోసి బాగా మరిగించాలి. పాలు మరిగించిన తర్వాత పంచదార వేసి బాగా కలపాలి. పంచదార కరిగిన తర్వాత జీడిపప్పు పొడిని వేసి కలుపుతూ ఉండాలి. ఈ మిశ్రమాన్ని అడుగంటకుండా బాగా కలుపుతూ గట్టిపడే వరకు ఉడికించాలి. చివరగా ఏలకుల పొడి, బాగా కలుపుకోవాలి. హల్వా గట్టిపడిన తర్వాత గిన్నెలోకి తీసి వడ్డించాలి.
మైసూర్ పాక్
మైసూర్ పాక్‌ను ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తారు. ఇది ఒక వెరైటీ మైసూర్ పాక్. అదేంటంటే ముందుగా స్టౌవ్ వెలిగించి దానిలో నెయ్యి వేయాలి. అది వేడి అయిన తర్వాత శనగపిండి వేసి.. మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా చేయడం వల్ల పిండిలోని పచ్చి వాసన పోతుంది. ఇప్పుడు దానిలో పంచదార, యాలకుల పొడి వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు కొద్ది కొద్దిగా నీరు వేసుకుంటూ.. పిండి ముద్దలు లేకుండా కలుపుకోవాలి. తర్వాత పిండి స్మూత్‌గా, క్రీమీగా మారుతుంది. అప్పుడు స్టౌవ్ ఆపేసి.. నెయ్యిని రాసిన ప్లేట్‌లో ఈ పిండిని వేసి.. పరచుకోవాలి. నచ్చిన షేప్‌లలో కట్ చేసుకోవాలి. అంతే టేస్టీ మైసూర్ పాక్ రెడీ.