– అధ్యక్షుడు సుబియాంటోతో జిన్‌పింగ్ భేటీ
– పలు అంశాలపై చర్చలు
బీజింగ్ : చైనా, ఇండోనేషియా సంబంధాల్లో కొత్త అధ్యాయం ఆరంభమవుతుందని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం చైనాలో పర్యటిస్తున్న ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబౌ సుబియాంటోతో శనివారం జిన్‌పింగ్ సమావేశమై పలు అంశాలపై చర్చలు జరిపారు. అక్టోబరులో అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన సుబియాంటో జరుపుతున్న తొలి విదేశీ పర్యటన ఇదే. సంయుక్త స్వయం స్వావలంబన, సంఘీభావం, సహకారం, పరస్పర ప్రయోజనం, సమాన అవకాశాలు కోసం కొత్త అధ్యాయాన్ని ప్రారంభించేందుకు ఇండోనేషియాతో కలిసి పని చేయడానికి చైనా ఆసక్తిగా వుందని జిన్‌పింగ్ చెప్పారు. బీజింగ్, జకార్తాల మధ్య కీలమైన ఆర్థిక సంబంధాలను నెలకొన్నాయి. ఇటీవలి కాలంలో ఇండోనేషియాలో సహజ వనరుల వెలికితీతో చైనా కంపెనీలు పాలు పంచుకుంటున్నాయి. రెండు దేశాల మధ్య సంబంధాలు బలోపేతమవుతున్నాయని సుబియాంటో అన్నారు. మొత్తంగా ఆసియా ప్రాంత శాంతి, సుస్థిరతలకు, ప్రజల సంక్షేమానికి, ఇరు దేశాల ప్రజల పరస్పర లబ్దికి కలిసి కృషి చేయనున్నట్టు తెలిపారు. అంతకుముందు బీజింగ్‌లోని గ్రేట్ హాల్ ఆఫ్ ది పీపుల్‌లో సుబియాంటోకు జిన్‌పింగ్ స్వాగతం పలికారు. చర్చల అనంతరం ఇరు దేశాల అధికారులు పలు మెమోరాండాలపై సంతకాలు చేశారు. సముద్ర జలాల భద్రత, జల వనరుల సహకారం వంటి అంశాలపై అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకున్నారు. శుక్రవారం చైనా చేరుకున్న సుబియాంటో చైనా ప్రధాని లీ కియాంగ్‌తో కూడా సమావేశమయ్యారు. ఇక్కడ నుంచి ఆయన అమెరికా వెళ్లనున్నారు. అటుపై పెరూ, బ్రెజిల్, బ్రిటన్ల్లో కూడా పర్యటించనున్నారు.