ఫ్రాన్స్‌లో ఆగని నిరసనలు

– 1300 మందికిపైగా అరెస్టులు
– వేల సంఖ్యలో దహనాలు
పారిస్‌ : మంగళవారం అర్ధరాత్రి నుండి ఫ్రాన్స్‌వ్యాప్తంగా కొనసాగుతున్న నిరసనలు, ఆందోళనల్లో శుక్రవారం రాత్రి 1300 మందికి పైగా అరెస్టయ్యారు. 1350కి పైగా కార్లు దగ్ధమయ్యాయి. రోడ్లపై మొత్తంగా 2560 చోట్ల భవనాలకు, వాహనాలకు నిప్పంటించారని హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే ముందు రోజులతో పోలిస్తే శుక్రవారం రాత్రి పరిస్థితి కాస్త సద్దుమణిగిందని హోం మంత్రి తెలిపారు. మరోవైపు పోలీసు కాల్పుల్లో మరణించిన 17 ఏండ్ల నహేల్‌ అంత్యక్రియలకు వారి కుటుంబం సన్నాహాలు చేస్తోంది. హింసాత్మక చర్యలను అణచివేసేందుకు శుక్రవారం రాత్రి 45 వేల మందికిపైగా పోలీసు అధికారులను మోహరించారు. బందోబస్తు ఏర్పాట్లు చేసినా 31 పోలీసు స్టేషన్లపై దాడి జరిగిందని అధికారులు శనివారం తెలిపారు. శుక్రవారం రాత్రి 79 మంది పోలీసు, అగ్నిమాపక సిబ్బంది గాయపడ్డారని చెప్పారు. కాగా, పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తుండడంతో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. అయితే అధికారుల చెబుతున్న సంఖ్య కన్నా ఇంకా ఎక్కువమందే పోలీసుల అదుపులో వున్నారని భావిస్తున్నారు. గత నాలుగు రోజులుగా ఆందోళనల్లో దిగుతున్న వారిలో ఎంతమంది గాయపడ్డారనే గణాంకాలు అందుబాటులో లేవు. ఇదిలా వుండగా, రాత్రి వేళల్లో బస్సులు, ట్రామ్‌లు నడపవద్దని హోం మంత్రి గెరాల్డ్‌ దార్మానిన్‌ ఆదేశించారు. హింసను రెచ్చగొట్టేందుకు సామాజిక మాధ్యమాలను ఉపయోగించవద్దని కోరారు.