72 మంది విద్యార్థులకు ఒకే టీచర్, ఇదే బంగారు తెలంగాణ: మోహన్ రెడ్డి

 నవతెలంగాణ- రామారెడ్డి
72 మంది విద్యార్థులకు ఓకే టీచర్, విద్యా బోధన చేయడం, బంగారు తెలంగాణకు, ప్రభుత్వ పనితనానికి నిదర్శనమని సోమవారం జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి మండిపడ్డారు. మండలంలోని స్కూల్ తండా, బట్టు తాండ, జగదాంబ తాండ తో పాటు, మద్దికుంటలో మండల పరిషత్, జిల్లా పరిషత్ తో పాటు అంగన్వాడి సెంటర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. కేజీ టు పీజీ విద్య అందిస్తామని ఎన్నికల హామీ ఇచ్చి, ప్రభుత్వ విద్యాలయాలను సమస్యలకు నిలయంగా మార్చిన ఘనత కేసిఆర్ ప్రభుత్వానికి దక్కుతుందని, బట్టు తండాలో 72 మంది విద్యార్థులకు ఒక టీచర్ మాత్రమే విద్యాబోధన చేస్తే, విద్యార్థులు ఎంతవరకు విద్యను అభ్యసిస్తారనేది ప్రజలు గమనించాలని, త్రాగడానికి నీరు లేక, మరుగుదొడ్లు లేక నానా ఇబ్బందులు పడుతున్నారని, ఉన్న పాఠశాల భవనంలో, అంగన్వాడి, గ్రామపంచాయతీ భవనం గా వాడుకొనడం, 15 రోజుల నుండి అంగన్వాడీలో పప్పు సరఫరా లేక, పిల్లలకు, బాలింతలకు పౌష్టికాహారం అందించడంలో నాణ్యత లేకుండా పోయిందని ఆరోపించారు. ప్రభుత్వం మన ఊరు మనబడి కార్యక్రమాన్ని ముందుకు వేసుకొని, కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వక, పనులు ముందుకు జరగక, పాఠశాలల్లో సమస్యలు పేరుకు పోతున్నాయని, ప్రభుత్వం వెంటనే ప్రభుత్వ విద్యాలయాల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో ఉపాద్యాయులు, విద్యార్థులు, కాంగ్రెస్ నాయకులు నా రెడ్డి శ్రీనివాస్ రెడ్డి,పెండ్యాల నర్సారెడ్డి,   పోతుల భాస్కర్ రెడ్డి, బండి ప్రవీణ్, బి పేట నరసింహులు కుమ్మరి శంకర్ తదితరులు పాల్గొన్నారు.