కేసీఆర్‌ పాలనలో.. సంక్షోభంలో విద్యుత్‌ సంస్థలు

– 2003 నాటి కరెరట్‌ ఉద్యమాన్ని 2023లోనూ చేపట్టాలి..
– విద్యుత్‌ ఉద్యమంలో మాతో కమ్యూనిస్టు సోదరులు కలిసి రావాలి..
– ‘హాత్‌ సే హాత్‌ జోడో’ యాత్రలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ-ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్‌పై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావువి ఆడంబరపు ప్రకటనలు తప్ప ఆచరణ లేదని తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు ఎనుముల రేవంత్‌రెడ్డి విమర్శించారు. యూనిట్‌ రూ.2.60 చొప్పున కొనుగోలు చేసే అవకాశం ఉన్నా రూ.15కు కొనుగోలు చేసి దానిలో 50 శాతం మెక్కి విద్యుత్‌ సంస్థలను నిర్వీర్యం చేశారని విమర్శించారు. విద్యుత్‌ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.20వేల కోట్ల మొండిబకాయిలను చెల్లించాలని డిమాండ్‌ చేశారు. విద్యుత్‌ అక్రమ దోపిడీలు, వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్‌ కోసం తమతో కలిసి కమ్యూనిస్టులు ఆందోళనకు రావాలని కోరారు. ‘హాత్‌ సే హాత్‌ జోడో యాత్ర’లో భాగంగా మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌ శివారు లచ్చతండాలో బస చేసిన టీపీసీసీ అధ్యక్షులు శుక్రవారం ఖమ్మం జిల్లా కామేపల్లి మండలంలో యాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వట్టినాగులపల్లి, తెల్లాపూర్‌, మియాపూర్‌, సంగారెడ్డి, మెదక్‌ జిల్లాల్లోని పలు భూముల కుంభకోణాలపై సిట్టింగ్‌ జడ్జితో ‘డ్రామా’రావు విచారణకు సిద్ధమా? అని కేటీఆర్‌ను ఉద్దేశించి సవాల్‌ విసిరారు. మహబూబాబాద్‌ ఎంపీ కవిత రూ.500 కోట్ల భూకుంభకోణాన్ని ప్రస్తావించారు.
2003 తరహాలోనే విద్యుత్‌ కోతలు..
ఉమ్మడి రాష్ట్రంలో 2003కు ముందు విద్యుత్‌ కోతలు, సంక్షోభం ఉన్నట్టే.. 2023లోనూ అదే పరిస్థితి ఉందని రేవంత్‌రెడ్డి అన్నారు. ఆనాడు బషీర్‌బాగ్‌ విద్యుత్‌ ఉద్యమంతో ప్రభుత్వం కుప్పకూలిందన్నారు. వ్యవసా యానికి రోజుకు పగలు 9 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేసింద న్నారు. నాడు టైం ప్రకారం కచ్చితంగా కరెంట్‌ వచ్చేదని, నేడు ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో కూడా తెలియని పరిస్థితి నెలకొందని విమర్శిం చారు. కేసీఆర్‌ ధనదాహంతో విద్యుత్‌ కొనుగోళ్లలో చేసిన అక్రమాల ఫలితంగా ట్రాన్స్‌కో, జెన్‌కోలు రూ.60వేల కోట్లు అప్పుల్లో కూరుకుపోయాయని తెలి పారు. గుజరాత్‌ కంపెనీ నుంచి రూ.వెయ్యి కోట్ల లంచం తీసుకుని కాలం చెల్లిన సబ్‌క్రిటికల్‌ టెక్నాలజీని కొనుగోలు చేశారని, ఫలితంగా రూ.10వేల కోట్ల భారం ట్రాన్స్‌కో, జెన్కో, డిస్కాంలపై పడిందన్నారు. యాదాద్రి పవర్‌ప్లాంట్‌ టెండర్‌ లేకుండా బీహెచ్‌ఈఎల్‌కు ఇచ్చి, సొంత కాంట్రాక్టర్‌కు సివిల్‌ వర్క్‌ పనులు అప్పగించారని తెలిపారు. ఐఏఎస్‌లు నిర్వహించాల్సిన బాధ్యతలను స్థాయి, అనుభవం లేని రిటైర్డ్‌ చిరు ఉద్యోగులు ప్రభాకర్‌రావు, రఘుమారెడ్డి, గోపాల రావు వంటి వారికి అప్పగిం చారని ఆరోపించారు. యాదాద్రి, భద్రాద్రి పవర్‌ప్లాంట్‌ల నిర్మాణంతో పాటు 2014 నుంచి ఇప్పటి వరకు జరిగిన విద్యుత్‌ కొనుగోళ్లపై విచారణ చేయిం చాలని డిమాండ్‌ చేస్తున్నామని తెలి పారు. ఎవరూ ఏసీడీ చార్జీలు కట్టవద్ద ని, కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక వాటిని రద్దు చేస్తుందన్నారు. శాసనసభ పక్ష నేతగా ఉన్న మల్లు భట్టివిక్రమార్క అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో యాత్రకు హాజరుకాలేకపోయారని తెలిపారు. ఐదోరోజు యాత్ర కామేపల్లి మండలం లచ్చగూడెం తండా నుంచి మొదలై కొత్తలింగాల క్రాస్‌రోడ్డు వరకు సాగింది. శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో యాత్ర కొనసాగుతుంది. విలేకరుల సమావేశంలో మాజీ ఎంపీ బలరాం నాయక్‌, డీసీసీ అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌, రాంరెడ్డి వెంకటరెడ్డి సోదరులు గోపాల్‌రెడ్డి, కృష్ణారెడ్డి, నాయకులు రాజయ్య, శ్రీచరణ్‌రెడ్డి, రాయల నాగేశ్వరరావు, మద్ది శ్రీనివాసరెడ్డి, మారం కరుణాకర్‌రెడ్డి, నగర కాంగ్రెస్‌ అధ్యక్షులు ఎండీ జావీద్‌, నాయకులు మిక్కిలినేని నరేంద్ర, మంజుల, ముస్తఫా, ముక్కా శేఖర్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.