బెదిరిస్తే ప్రేమ ద‌క్కుతుందా..

Will you get love if you threaten?ప్రేమించిన వ్యక్తితో జీవితాంతం కలిసి బతకాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. కానీ కొందరికి మాత్రమే ఆ అవకాశం దక్కుతుంది. దీనికి ఎంతో ఓపిక, అర్థం చేసుకునే మనసు ఉండాలి. అప్పుడే మనం కోరుకున్న ప్రేమ మన జీవితాంతం తోడుంటుంది. అలా కాకుండా కోపంతో, పగతో, బలవంతంగానో, బెదిరించో ప్రేమను పొందాలని చూస్తే అది నిజమైన ప్రేమ కాదు. దీనివల్ల అసలుకే మోసం వస్తుంది. జీవితాంతం సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. కోపంలో ఎదుటి వ్యక్తిని హింసిస్తున్నామని అనుకుంటూనే మనం బాధల్లో బతుకుతుంటాము. అలాంటి ఓ కథనమే ఈ వారం ఐద్వా అదాలత్‌లో…
రాహుల్‌ డిగ్రీ మూడో ఏడాది చదువుతున్నాడు. అతనికి ఇంటర్‌ చదువుతున్న కీర్తితో పరిచయం ఏర్పడింది. అది కొంత కాలానికి ప్రేమగా మారింది. వారి స్నేహం ప్రేమగా మారడానికి ఎక్కువ సమయం పట్టలేదు. రాహుల్‌కు 21 ఏండ్లు. కీర్తికి 18 ఏండ్లు. ఇద్దరూ ఫోన్లో గంటల కొద్దీ మాట్లాడుకునేవారు. సినిమాలకు, పార్కులకు వెళ్లేవారు. మూడేండ్లు వీరి ప్రేమ బాగానే కొనసాగింది. ఆ తర్వాత ఇద్దరి మధ్య చిన్నగా గొడవలు మొదలై ఎవరి పాటికి వారు ఉందామని బ్రేకప్‌ చెప్పుకున్నారు. అలా ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా ఆరునెలలు ఉన్నారు.
ఆ తర్వాత కీర్తి పుట్టినరోజు వచ్చింది. ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు పంపించాడు రాహుల్‌. దాంతో ఇద్దరి మధ్య మళ్లీ మాటలు కలిశాయి. తర్వాత వారి మధ్య జరిగిన కొన్ని సంఘటనలు ఫోన్లో రికార్డు చేసుకున్నారు. దాంతో కీర్తి తనను పెండ్లి చేసుకోమంటూ రాహుల్‌ వెంటపడింది. కానీ అతను ఒప్పుకోలేదు. ‘మన చదువులు ఇంకా పూర్తి కాలేదు. నా చదువు పూర్తయి ఉద్యోగం వచ్చిన తర్వాత అప్పుడు పెండ్లి చేసుకుం దాం. అప్పటి వరకు నీ డిగ్రీ కూడా పూర్తవుతుంది. పైగా మా అన్నయ్య పెండ్లి జరిగి ఏడాది కూడా కాలేదు. ఇప్పుడే నా పెండ్లి అంటే ఇంట్లో అస్సలు ఒప్పుకోరు’ అని చెప్పాడు.
కానీ కీర్తి అతని మాటలు వినే పరిస్థితుల్లో లేదు. పైగా అతన్ని ఏదో రకంగా బాధపెట్టాలని, బెదిరించి అయినా వెంటనే పెండ్లి చేసుకోవాలని అనుకుంది. ఆ బాధ భరించలేక ‘పెండ్లి విషయంలో నన్ను ఇబ్బంది పెట్టొద్దు. ఇలా చేస్తే నీతో మాట్లాడను’ అని చెప్పి అప్పటి నుండి ఆమెకు ఫోన్‌ చేయడమే మానేశాడు. ఆమె మెసేజ్‌ పెట్టినా రిప్లరు ఇవ్వడం లేదు. దాంతో కీర్తి పోలీస్‌ స్టేషన్లో తాము సన్నిహితంగా ఉన్న ఫొటోలు చూపించి బెదిరిస్తున్నాడని రాహుల్‌పై కేసుపెట్టింది. పోలీసులు రాహుల్‌ని అరెస్టు చేసి జైలుకు పంపించారు. బెయిల్‌ తీసుకొని బయటకు వచ్చాడు.
అయితే కీర్తి చెప్పిన ఫొటోలు రాహుల్‌ ఫోన్లో లేవు. కీర్తి ఫోన్లోనే ఉన్నాయి. ఇలాంటి ఫొటోలు తన ఫోన్లో ఉంటే బాగోదని అతను ఎప్పుడో వాటిని డిలీట్‌ చేశాడు. కానీ కీర్తి మాత్రం వాటిని అలాగే భద్రపరిచింది.
రాహుల్‌ జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత తన అన్నయ్యను తీసుకొని మా ఆఫీసుకు వచ్చి విషయం మొత్తం చెప్పాడు. మేము కీర్తిని పిలిచి మాట్లాడితే ‘రాహుల్‌ అంటే నాకు పిచ్చి ప్రేమ. నన్ను పెండ్లి చేసుకోమంటే నిరాకరించాడు. అందుకే నా పర్సనల్‌ ఫొటోలు అతని దగ్గర ఉన్నాయని, వాటితో నన్ను బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నాడని కేసు పెట్టాను. కానీ బెయిల్‌పై బయటకు వచ్చాడు. నేను ఈ కేసు వెనక్కు తీసుకోవాలంటే నన్ను పెండ్లి చేసుకోవాలి. అప్పుడే కేసు వాపస్‌ తీసుకుంటాను. అప్పటి వరకు ఈ కేసు ఇలా నడుస్తూనే ఉంటుంది. మొన్నటి వరకు ఈ విషయం మా ఇంట్లో కూడా తెలియదు. పోలీసులు కూడా నా పేరు బయట పెట్టలేదు. అతను అరెస్టు అయిన తర్వాతనే మా ఇంట్లో తెలిసింది’ అని చెప్పింది.
రాహుల్‌ ఇప్పుడు ఆమెతో మాట్లాడటానికి కూడా ఇష్టపడడం లేదు. ‘నేను కీర్తిని మనస్ఫూర్తిగా ప్రేమించాను. కానీ ఆమె నన్ను ఇలా చేస్తుందనుకోలేదు. నేను నిజంగా ఆమెను మోసం చేయాలి, ఇంకేదో చేయాలి అనుకుంటే మా పర్సనల్‌ ఫొటోలు నా ఫోన్లో ఉండేవి. రేపురేపు ఆమెకు ఎలాంటి ఇబ్బంది ఉండకూడదని, ఇంకెవరైనా చూస్తే బాగోదని వాటిని నేను డిలీట్‌ చేశాను. కానీ ఆమె వాటిని అడ్డం పెట్టుకొని నేనే బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నానని కేసు పెట్టింది. కావాలంటే నా ఫోన్‌ మొత్తం చెక్‌ చేసుకోండి. అయినా నేను ఏదైనా తప్పు చేస్తే కోర్టే నన్ను శిక్షిస్తుంది. నేను ఏ తప్పు చేయలేదని నమ్మితే వదిలేస్తుంది. ఆమెను ఇక్కడి వరకు పిలవడానికి కారణం తను చేసిన తప్పు తెలుసుకుంటుందని మాత్రమే. ఇప్పటికే నా వాళ్ల దగ్గర నేను దోషిగా నిలబడాల్సి వచ్చింది. అయినా నా కుటుంబం నాకు అండగా నిలబడింది. ఇప్పటికైనా కీర్తి తన తప్పు తాను తెలుసుకోవాలి. నాలాంటి అబ్బాయిలు కూడా బుద్ధి తెచ్చుకోవాలి. ఫోన్లు చేతిలో ఉన్నాయి కదా అని ఇష్టం వచ్చినట్టు దాన్ని వాడే వారికి అవగాహన రావాలి’ అంటూ తన మాటలు ముగించాడు.
కీర్తిలో మాత్రం తను చేసిన పనికి కనీసం పశ్చాత్తాపం కూడా లేదు. పైగా కేసు కోర్టులో వుంది కదా! అక్కడే తెల్చుకుంటాను. కోర్టు, కేసులు ఏమీ వద్దని మా అమ్మానాన్న కూడా చెప్పారు. నేను వాళ్ల మాటే వినలేదు. నా జీవితం నాకు నచ్చినట్టు ఉంటాను. నా దగ్గర స్మార్ట్‌ ఫోన్‌ ఉంది కాబట్టి ఈ ఫొటోలతో రాహుల్‌పై కేసు పెట్టగలిగాను. టెక్నాలజీని ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్లు వాడుకుంటున్నారు. నా అవసరానికి నేను వాడుకుంటున్నాను’ అని చెప్పి వెళ్లిపోయింది.
అయితే రాహుల్‌కు అతని కుటుంబం మొత్తం సపోర్ట్‌ చేస్తుంది. కానీ కీర్తిని మాత్రం ఎవ్వరూ సమర్ధించడం లేదు. ఫోన్లో ఉన్న ఫొటోలే తనకు న్యాయం చేస్తాయనుకుంటుంది. స్మార్ట్‌ ఫోన్‌తో ఏమైనా చేయొచ్చు అనుకుంటుంది. మానవ సంబం ధాలకు అస్సలు విలువ ఇవ్వడం లేదు. ప్రేమను ప్రేమతోనే పొందాలనే చిన్న విష యాన్ని అర్థం చేసుకోలేక సమస్యలు తెచ్చిపెట్టు కుంది. కనీసం ఎదుటి వాళ్లు చెప్పినా వినే పరిస్థితుల్లో లేదు. ఇక ఆమె జీవితం ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.
– వై వరలక్ష్మి,
9948794051