– ప్రీ లిటిగేషన్ కేసుగా కేవలం రెండు నెలలలో పరిష్కారం
నవతెలంగాణ-సిటీబ్యూరో
శనివారం జరిగిన జాతీయ లోక్ అదాలత్‌లో 86 సంవత్సరాల వద్ధురాలి ఫ్యామిలీ పెన్షన్ వివాదం ప్రీ లిటిగేషన్ కేసుగా కేవలం రెండు నెలలలో పరిష్కారం అయినట్టు హైదరాబాద్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సిటీ సివిల్ కోర్టు కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జి కె.మురళీమోహన్ తెలియజేశారు. హైదరాబాద్ ఆసిఫ్‌నగర్‌కు చెందిన వద్ధురాలు బి.రాజమ్మ భర్త రాజయ్య విద్యుత్ శాఖ ఉద్యోగి. తన భర్త 1983లో పదవి విరమణ పొందగా 2001 మే లో మరణించాడు. భర్త మరణానంతరం కుటుంబ పెన్షన్ పొందుతున్న వద్ధురాలు బి.రాజమ్మకు కుటుంబ పెన్షన్ మంజూరులో జరిగిన తప్పిదం వల్ల విద్యుత్ శాఖ కొంత అదనపు సొమ్మును చెల్లిస్తూ వచ్చింది. ఇటీవల కాలంలో ఆర్థిక తనిఖీలలో ఈ విషయం వెలుగులోకి రావడంతో రాజమ్మకు ఇప్పటివరకు నాలుగు లక్షల, ఒక వెయ్యి, 571 రూపాయిలు అదనంగా చెల్లించినట్టు తేలింది. విద్యుత్ శాఖ అధికారులు అట్టి మొత్తాన్ని తక్షణం చెల్లించాల్సిందిగా రాజమ్మకు నోటీసులు జారీచేశారు. వయోభారంతో కదలలేని స్థితిలో ఉన్న రాజమ్మ అట్టి మొత్తాన్ని చెల్లించలేకపోవడంతో రాజమ్మకు చెల్లిస్తున్న పెన్షన్‌లో నెలకు 22వేల రూపాయల చొప్పున అధికారులు కోత విధించారు. అధిక మొత్తంలో కోత విధించడంతో ఆ మిగతా అరకొర పెన్షన్ తన పోషణకు, వైద్యానికి సరిపోవడంలేదని, ఈ విషయంలో తనకు న్యాయంచేయాలంటూ వద్ధురాలైన రాజమ్మ తన కుమారుడి ద్వారా సిటీ సివిల్ కోర్టులోని జిల్లా న్యాయ సేవాధికార సంస్థలో ఫిర్యాదు దాఖలు చేసింది. ఫిర్యాదు అందుకున్న హైదరాబాద్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జ్ కె.మురళీమోహన్ విద్యుత్ శాఖ అధికారులకు నోటీసులు జారీ చేసి ఇరుపక్షాల మధ్య రాజీ కుదిర్చారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చొరవతో ప్రతి నెల పెన్షన్‌లో విధిస్తున్న 22 వేల రూపాయలను కోతను తగ్గించి నెలకు 7,500 రూపాయల చొప్పున పెన్షన్ నుండి వసూలు చేసుకునేటట్టు లోక్ అదాలత్ సాక్షిగా ఉభయ పక్షాలు అంగీకరించాయి. ఒకవేళ తన జీవితకాలంలో నాలుగు లక్షల రూపాయల బాకీ మొత్తం పెన్షన్ ద్వారా వసూలు కానిపక్షంలో వద్ధురాలి ఆస్తి నుండి తన వారసుల ద్వారా మిగతా బాకీని విద్యుత్ అధికారులు వసూలు చేసుకోవచ్చని హామీతో కేసు పరిష్కరించబడింది. ఫ్రీ లిటిగేషన్ రూపంలో, కోర్టుకు వెళ్లకుండానే కేవలం రెండు నెలల లోపు కాలవ్యవధిలోనే న్యాయ సేవాధికార సంస్థ చొరవతో ఈ వివాదానికి పరిష్కారం లభించింది. వద్ధురాలు మంచానికి పరిమితమై కోర్టుకు రాలేని స్థితిలో ఉండటంతో న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆదేశంతో కార్యాలయ సూపరింటెండెంట్ సునీత వద్ధురాలి ఇంటికి వెళ్లి రాజీ ప్రతిపాదనను వివరించి, అందుకు వద్ధురాలు అంగీకరించడంతో రాజీ పత్రంపై వద్ధురాలి సంతకం తీసుకున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లోక్ అదాలత్‌లో వద్ధురాలు కేసు పరిష్కరించి, లోకదాలత్ సెటిల్‌మెంట్ అవార్డును అందజేశారు.