వెలసిన గుడిసెలు – తొలగించిన అధికారులు

నవతెలంగాణ-నాగోల్‌
నాగోల్‌ డివిజన్‌లోని బండ్లగూడలో గల ప్రభుత్వ అసైన్డ్‌ భూమిలో శుక్రవారం రాత్రి నుండి కొంతమంది గుడిసెలు వేయగా సమాచారాన్ని తెలుసుకున్న మల్కాజ్గిరి, మేడ్చల్‌ జిల్లా ఉప్పల్‌ ఎమ్మార్వో గౌతం కుమార్‌ శనివారం ఎల్బీనగర్‌ ఏసీబీ శ్రీధర్‌ ఆధ్వర్యంలో పోలీసులను మోహరించి గుడిసెలను తొలగించారు. అడ్డుగా వచ్చిన వారిని ఎల్బీనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ తరలించి వదిలి పెట్టినట్లు సమాచారం. అనంతరం ఎమ్మార్వో గౌతం కుమార్‌ మీడియాతో మాట్లాడుతూ నాగోల్‌ డివిజన్లోని బండ్లగూడ లో సర్వేనెంబర్‌ 36 /6 లో రెండు ఎకరాలు, 58/1 సర్వే నెంబర్‌లో ఒక ఎకరం భూమి అసైన్ట్‌ భూమి ఉందని తెలిపారు. దీంతో శుక్రవారం రాత్రి నుండే ఇక్కడ గుడిసెలు వేసినట్లు తమకు సమాచారం అందిందని, వెంటనే శనివారం పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసి ఏసీపీి శ్రీధర్‌ రెడ్డి ఆధ్వర్యంలో వేసిన గుడిసెలను తొలగించినట్లు తెలిపారు. గుడిసెలు వేసిన వారు స్థానికులా లేక బయటి వ్యక్తులా అనేది విచారణ చేయాల్సి ఉందని తెలిపారు. ఇప్పటికే ఒకసారి వేస్తే తొలగించడం జరిగిందని, ఇది రెండవసారి అని అన్నారు. 36/6 సర్వే నెంబర్‌లో ఉన్న రెండు ఎకరాలలో ఒక ఎకరం 10 గుంటల భూమిని ఇటీవల నాగోలు డివిజన్‌కు నూతనంగా మంజూరైన పోలీస్‌ స్టేషన్‌ నిర్మాణానికి, 30 గుంటల భూమిని స్థానికంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణానికి కేటాయించినట్లు ఎమ్మార్వో పేర్కొన్నారు. అదేవిధంగా 58/1 సర్వే నెంబర్‌లో గల ఎకరం భూమిని క్రీడల మైదాన నిర్మాణానికి కేటాయించినట్లు వివరించారు. ఇక నుంచి ఈ భూమిని ఎవరు ఆక్రమించినా చట్టపరమైన చర్యలు తప్పవని తెలిపారు. సంబంధిత శాఖ అధికారులకు అప్పగించేంతవరకు ఈ భూమి వద్ద పోలీస్‌ భద్రతను ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మార్వో గౌతం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వోతో పాటు రెవెన్యూ ఇన్స్‌పెక్టర్‌, ఎల్బీనగర్‌ ఏసీపీి శ్రీధర్‌ రెడ్డితోపాటు పలువురు సీిఐలు, ఎస్సైలు, పోలీసులు సిబ్బంది పాల్గొన్నారు.