ఈ జాగ్రత్తలు తప్పనిసరి…

ఈ రోజుల్లో సిజేరియన్ డెలివరీలు సర్వసాధారణమైపోయాయి. సిజేరియన్ తర్వాత కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని, ఆ తర్వాత కూడా దీర్ఘకాలంలో పలు అనారోగ్యాలు తలెత్తే అవకాశాలు ఉంటాయని కొంతమంది భావిస్తుంటారు. కానీ డెలివరీ తర్వాత కొన్ని జాగ్రత్తలు త్వరగా కోలుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

విశ్రాంతిని మించింది లేదు!

సిజేరియన్ తర్వాత తల్లులు ఎంత విశ్రాంతి తీసుకుంటే అంత త్వరగా కోలుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు. కుట్లపై ఒత్తిడి పడకుండా అవి త్వరగా మానిపోవడానికి ఇది దోహదం చేస్తుందట! అయితే కొత్తగా తల్లైన వారికి రోజులో చాలా సమయం పాపాయితోనే సరిపోతుంది. వారికి పాలివ్వడం, డైపర్లు/దుస్తులు మార్చడం, వారిని నిద్రపుచ్చడం, ఇలా వారు నిద్రపోయినప్పుడు ఇంటిపని ఏదైనా ఉంటే చేసుకోవడం.. ఇలా ఈ పనులతోనే రోజంతా బిజీబిజీగా గడిచిపోతుంది. దీంతో వారిలో మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఇది ఇటు బాలింతలకు, అటు శిశువుకు.. ఇద్దరికీ మంచిది కాదు. కాబట్టి తల్లైన తొలినాళ్లలో నిద్రలేమిని, ఒత్తిడిని జయించాలంటే ఇతర పనులు పక్కన పెట్టి పాపాయి నిద్రపోయిన ప్పుడే తల్లులూ నిద్రకు ఉపక్రమించాలని నిపుణులు సలహా ఇస్తున్నారు.

పాలిస్తే కోలుకుంటారు!

పాలిచ్చే ప్రక్రియ కొత్తగా తల్లైన మహిళలకు ఎంతో ప్రయోజనకరం అంటున్నారు నిపుణులు. ప్రసవానంతరం పెరిగిన బరువు తగ్గడం దగ్గర్నుంచి కుట్లు త్వరగా మానిపోవడానికి, తిరిగి సౌంద ర్యాన్ని పెంపొందించుకోవడానికి, వెంటనే మళ్లీ గర్భం ధరించకుండా ఉండడానికి.. ఇలా ఎలా చూసినా బ్రెస్ట్ ఫీడింగ్ బాలింతలకు ఎంతో మేలు చేస్తుంది.

పోషకాహారం…

సిజేరియన్ తర్వాత ఇది తినకూడదు, అది తాగకూడదు.. అన్న నియమనిబంధనలు ఇప్పటికీ చాలా ఇళ్లలో ఉండడం మనం చూస్తూనే ఉంటాం.

గర్భిణిగా ఉన్న సమయంలో సంపూర్ణ పోషకాలు లభించే పదార్థాలన్నీ ఎలాగైతే తీసుకుంటారో ప్రసవానంతరం కూడా అవే ఆహార నియమాలు పాటించాలని, తద్వారా సిజేరియన్ నొప్పుల నుంచి త్వరగా కోలుకోవచ్చని సలహా ఇస్తున్నారు. అలాగే పాలు ఎక్కువగా ఉత్పత్తి కావడం కోసం ఆకుకూరలు, వెల్లుల్లి, కోడిగుడ్లు, పాలు, పాల పదార్థాలు, మాంసం, వంటివన్నీ రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం ముఖ్యం. ■