ఇజ్రాయిల్‌ న్యాయవ్యవస్థపై దాడికి యత్నాలు

Israel– నెతన్యాహు ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ ప్రజల ఆందోళనలు
జెరూసలేం : న్యాయ వ్యవస్థపై ప్రభుత్వ దాడి ప్రయత్నాలను నిరసిస్తూ ఇజ్రాయిల్‌ వ్యాప్తంగా వేలాదిమంది ప్రజలు మంగళవారం ప్రదర్శనలు నిర్వహించారు. ప్రభుత్వం తన ప్రణాళిక ప్రకటించిన నేపథ్యంలో నెలల తరబడి కొనసాగుతున్న ఆందోళనల్లో భాగంగా మంగళవారం నాడు నిరసనలు పెద్ద ఎత్తున చోటు చేసుకున్నాయి. జెరూసలేం, హైఫా, టెల్‌ అవీవ్‌ నగరాలకు దారితీసే హైవేలను, ప్రధాన నగరాల్లోని జంక్షన్లను ఆందోళనకారులు దిగ్బంధించారు. సుప్రీం కోర్టు పర్యవేక్షక అధికారాలను పరిమితం చేసేందుకు తీసుకువచ్చిన బిల్లుకు నెతన్యాహు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో ఆందోళనలు తలెత్తాయి. అయితే విస్తృతంగా నిరసనలు తలెత్తినా న్యాయవ్యవస్థలో మార్పులు తీసుకు రావాలనే ప్రభుత్వం పట్టుదలగా వుంది. ఈ మార్పులు దేశాన్ని నిరంకుశ పాలన వైపునకు నెడుతున్నాయని వారు విమర్శిస్తున్నారు. జెరూసలేంకు దారి తీసే ప్రధాన రహదారిని దిగ్బంధించిన ఆందోళనకారులపై పోలీసులు జల ఫిరంగులు ప్రయోగించారు. మరో రహదారిని దిగ్బంధించిన వారిని పలువురిని అధికారులు అరెస్టు చేశారు. హైఫాలో ప్రధాన రహదారిని కూడా ప్రదర్శకులు దిగ్బంధించారు. దీంతో ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. ఇందుకు సంబంధించి 42మందిని అరెస్టు చేశారు.