– లక్ష ఆర్థిక సాయం నిరంతర ప్రక్రియ
– ప్రతినెల 15న పథకం గ్రౌండింగ్
– నియోజకవర్గానికి 300మంది లబ్దిదారులు
– కలెక్టర్లతో వీడియోకాన్పరెన్స్‌లో మంత్రి గుంగుల
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో కులవృత్తులను కాపాడి వారిని మరింత బలోపేతం చేసే సంకల్పంతో ప్రభుత్వం ప్రారంభించిన బీసీ కులవృత్తులకు లక్ష ఆర్థిక సహాయం పథకం కింద ఈనెల్లో లబ్దిదారులకు నగదును అందించేందుకు సర్వం సిద్దం చేశామని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఇది నిరంతరాయ ప్రక్రియగా ఉంటుందని పేర్కొన్నారు. ఇదే అంశంపై గురువారం కరీంనగర్ కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లతో మంత్రి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ నెల 15న క్షేత్రస్థాయి పరిశీలన పూర్తయిన దాదాపు 300 మంది లబ్దిదారులతో ప్రతి నియోజకవర్గంలోనూ పథకం గ్రౌండింగ్ కొనసాగుతుందన్నారు. స్థానిక ఎమ్మెల్యేల చేతుల మీదుగా ఆర్థిక సాయాన్ని అందజేసే ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, అధికార యంత్రాంగం పాల్గొంటారని తెలిపారు. బీసీ కులవృత్తుల సర్వతోముఖాబివృద్ధికి కృషి చేస్తూ జిల్లా స్థాయి యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుని అర్హులైన లబ్ధిదారులను గుర్తించాలని కలెక్టర్లను ఆదేశించారు.బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రావెంకటేశం మాట్లాడుతూ ఇప్పటి వరకు 5.28 లక్షల దరఖాస్తులు వచ్చాయనీ, వాటి పరిశీలనా ప్రక్రియ వేగవంతంగా కొసాగుతున్నదని తెలిపారు.