చట్టసభల్లో 27 శాతం బీసీ రిజర్వేషన్ల కోసం

–  అన్ని పార్టీల నేతలనూ కలిశాం : దాసు సురేశ్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
చట్టసభల్లో 27 శాతం బీసీ రిజర్వేషన్ల కోసం జరుగుతున్న పోరాటానికి మద్దతివ్వాలని కోరుతూ అన్ని పార్టీల నేతలనూ ఢిల్లీలో కలిసినట్టు బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షులు దాసు సురేశ్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. తాము కలిసిన వారిలో సీపీఐ(ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా, ఆప్‌ రాజ్యసభ ఫ్లోర్‌ లీడర్‌ సంజరుసింగ్‌, బీజేపీ బీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు కె.లక్ష్మణ్‌, ఎస్పీ సీనియర్‌ నేత రామ్‌గోపాల్‌ యాదవ్‌, బీఎప్పీ, జేడీయూ నేతలను కలిసినట్టు పేర్కొన్నారు. చట్టసభల్లో బీసీల రిజర్వేషన్ల కోసం కావాల్సిన చట్టసవరణ కోసం కేంద్ర ప్రభుత్వం సంకల్పిస్తే తాము మద్దతిస్తామని సీతారాం ఏచూరి హామీనిచ్చారని తెలిపారు. చట్టసవరణకు అవసరమైన కార్యాచరణకు చేపట్టాలని లక్ష్మణ్‌ను కోరగా పార్లమెంటరీ కమిటీలో చర్చిస్తామని హామీనిచ్చారని పేర్కొన్నారు. తెలంగాణలో త్వరలోనే బీసీ రాజ్యాధికార సమితి ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ పెడతామని తెలిపారు. అన్ని పార్టీలను ఆ సభకు ఆహ్వానించనున్నట్టు పేర్కొన్నారు.